.
ఒకటి మాత్రం నిజం… ప్రైవేటు పాప్ వీడియోలకు ఆద్యురాలు సింగర్, డాన్సర్, ప్రజెంటర్ స్మిత… మసక మసక చీకటిలో, హాయ్ రబ్బా వంటి పాటలు పుష్కరం క్రితమే తీసుకొచ్చింది… పాపులర్ అయ్యాయి కూడా… తరువాత పెద్దగా తెరపైన కనిపించలేదు… ఈమధ్య పాప్, ర్యాప్ మిక్స్ చేసి, పాటలతో దేశదేశాలు తిరిగి స్వరయాత్ర చేద్దామనుకుంది…
ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ అని పేరెట్టింది… నాగార్జునతో లాంచ్ చేసినట్టు గుర్తు బిగ్‌బాస్ షో సమయంలో… ఆధునిక టెక్నాలజీతో, విదేశాల్లో షూటింగ్స్ చేసి, కొత్తగా పాటలు రూపుదిద్దాలనీ భావించింది… లాంచింగ్ సాంగ్ పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు… హంగులు, రంగులు, ఆర్భాటాలు ఎక్కువయ్యాయి… నిజానికి ఇప్పుడు చిన్నచిన్న నటులతో, తక్కువ ఖర్చుతో, నేచురల్ షూటింగ్స్‌తో తెలంగాణ ఫోక్స్ సూపర్ హిట్స్… బంపర్ హిట్స్…
Ads
ఆర్టిఫిషియల్ మెరుపులను జనం ఇష్టపడటం లేదు… ఆ తత్వం ఆమెకు అర్థం కాలేదు… దాంతో ఇప్పుడు కొత్త తత్వం బోధపడి… అవును, తత్వాల్లోకి వెళ్తోంది… తత్వమసి… నాద టు నిర్వాణ పేరిట మరో ప్రయోగానికి తెరతీస్తోంది… అంటే ఆధ్యాత్మిక స్వర యాత్ర… తత్వ యాత్ర… ఇదీ దేశదేశాలు తిరిగే ప్లానేనట… అయితే ఓ జాగ్రత్త తీసుకోవాలి…
భజగోవిందం నుంచి అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే’ వంటి కీర్తనల దాకా పాడటానికి ఎంచుకున్నప్పుడు వాటికి ఆర్టిఫిషియాలిటీ అద్దకూడదు… మూలం చెడకూడదు… సాహిత్యం వినిపించకుండా ఇన్‌స్ట్రుమెంట్ల గోల ఉండకూడదు… పాప్, ర్యాప్ ఛాయలు ఉండకూడదు… ఇవి విస్మరిస్తే విమర్శలకు తావివ్వడమే కాదు, ఇక ఈ మ్యూజిక్ కెరీరే ప్రమాదంలో పడుతుందేమో…
ఈ తత్వయాత్రకు కారణాలు సుదీర్ఘంగా ఏవో ఇంటర్వ్యూల్లో, వార్తల్లో చెబుతోంది… కానీ శ్రోతలకు అవి అక్కర్లేదు… ఔట్ పుట్ బాగుందా లేదానేదే ముఖ్యం… మీడియా వార్తలు హైప్ ఇస్తాయేమో గానీ అంతిమంగా నిలబడేది నాణ్యత మాత్రమే…
ఆదిశంకరాచార్యుల శ్లోకాలు, వేదాంత తత్త్వాలతో కూడిన ‘తత్త్వమసి’ అనే ఆధ్యాత్మిక యాత్ర ఓ సాహసమే నిజానికి… తను పూర్తిగా స్విచ్ ఓవర్ అయిపోతేనే సాధ్యం… స్మితకు ఒక ఇమేజ్ ఉంది. కానీ ఆమె చుట్టూ ఉన్న టీమ్ లేదా ఆమె సొంత నిర్ణయాలో ఏమో కానీ, ఆమెకు స్థాయికి మించిన ఎలివేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించారు ఇంతకుముందు… ఒక గ్లోబల్ స్టార్‌గా ఆమెను ప్రొజెక్ట్ చేయాలని చూశారు… కానీ కళాకారులకు ఇమేజ్ కంటే వారి ప్రతిభే ముఖ్యం…
సరే, గత వైఫల్యాల తర్వాత, స్మిత ఇప్పుడు తన మూలాల వైపు మళ్లింది… భారతీయ సనాతన ధర్మంలోని తత్త్వాలను, ఆధ్యాత్మికతను సంగీతం ద్వారా ప్రజలకు చేరవేయాలనే సంకల్పం గొప్పదే… వారానికి ఓ పాట చొప్పున మొత్తం 100 వారాలు అట… కొన్ని పూర్తయ్యాయట కూడా… ఈమధ్యే పోస్టర్ ఆవిష్కరణ వంటి ప్రోగ్రామ్ ఏదో నిర్వహించినట్టున్నారు…
గతంలోలాగా అనవసరమైన ఆర్కెస్ట్రయిజేషన్ ఆర్భాటాలకు పోకుండా, తత్త్వంలోని లోతును, భక్తిని యథాతథంగా ప్రజలకు అందించగలిగితేనే ఈ ‘తత్త్వమసి’ ఆమెకు నిజమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది… దేశాలు తిరగడం కంటే, తన గొంతుతో శ్రోతల హృదయాలను తాకడంపై ఆమె దృష్టి సారించాల్సిన అవసరం ఉంది… లేదంటే అసలైన ‘తత్వం’ బోధపడే ప్రమాదముంది…!! తత్వ‘మసి’ కాకూడదనే ఆకాంక్షిద్దాం..!! ఎందుకంటే..? మానస సంచరరే గీతానికీ, మసక మసక చీకటికీ నడుమ తేడాను ఆమె గుర్తించాలి కాబట్టి..!!
Share this Article