Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!

February 25, 2026 by M S R

.

Bhavanarayana Thota … ప్రసారం కాని ‘తాజ్ కృష్ణ స్కై బ్రిడ్జ్’ కథేంటంటే… బాధితుల పక్షాన నిలబడేదే నిజమైన జర్నలిజం. సర్వసాధారణంగా బాధితులు నిరుపేదలు, సామాన్యులే ఉంటారు. కానీ, చాలా అరుదుగానైనా డబ్బున్నవాళ్ళ పక్షాన కూడా న్యాయం ఉండవచ్చు. అయినాసరే, డబ్బున్నవాళ్ళ కోణంలో ఆలోచించటానికి మనసు ఒప్పకపోవచ్చు. వాళ్ళ సంఖ్య తక్కువ కావటం, బాధితుల సంఖ్య ఎక్కువ కావటం కూడా అందుకు కారణం కావచ్చు. అటువంటి సంఘటన ఒకటి చెబుతాను.

2010 లో నిర్మాత అశ్వనీదత్, పేరుమోసిన రియల్టర్ ‘ఇందూ’ శ్యాంప్రసాద్ రెడ్డి (ఐవీఆర్ సీఎల్ వ్యవస్థాపకుడు) చేసిన సరికొత్త ప్రయోగం ‘లోకల్ టీవీ’ లో ఉండగా జరిగిన సంఘటన. మా రిపోర్టర్ ఒక రోజు ఒక వార్త తెచ్చాడు. అదేంటంటే హైదరాబాద్ లో ఎర్రమంజిల్ కాలనీ గుండా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వచ్చే రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయన్నది ఆ వార్త సారాంశం. అందుకు కారణం తాజ్ కృష్ణ, తాజ్ దక్కన్ హోటల్స్ ను కలుపుతూ కడుతున్న ఒక ప్రైవేట్ స్కై బ్రిడ్జ్.

Ads

ఆ రెండూ ఒకే యాజమాన్యంలోనివి కావటం వల్ల నిర్వహణ సులభంగా ఉండటానికి ఆ బ్రిడ్జ్ కట్టుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమం ఒక హోటల్ లో జరుగుతూ ఉంటే అతిథులందరికీ ఒకే హోటల్ లో రూమ్స్ కేటాయించటం కుదరనప్పుడు ఇలాంటి బ్రిడ్జ్ చాలా ఉపయోగం.

అది హోటల్స్ వాళ్ళకు ఉపయోగమే అయినా, అది కట్టేటప్పుడు రోడ్డు మీద ఉంచే మెటీరీయల్ వల్ల ఇబ్బంది తప్పదు. దాదాపు 500 మీటర్ల పొడవున్న ఆ స్కై బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగా తయారుచేసిన కాంక్రీట్ ఫాబ్రికేటెడ్ దిమ్మెలు వాడినా, అది పూర్తి కావటానికి దాదాపు 3 వారాలు పట్టింది. ఈ లోపు ట్రాఫిక్ సమస్య వచ్చిన మాట నిజం. నిర్మాణం పనుల కోసం సగం రోడ్డు వాడుకుంటున్నారు.

అందువల్ల మిగతా సగం రోడ్డు గుండా మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ చాలా నిదానంగా వెళ్లక తప్పటం లేదు. ఈ సంగతి మా రిపోర్టర్ ను ఆకర్షించింది. అదే వార్తగా రాసి వీడియోలతో సహా తెచ్చాడు. హోటల్ వాళ్ళ వలన సామాన్య ప్రజలకు జరుగుతున్న ఇబ్బంది గురించి రాశాడు. మొత్తంగా హోటల్ వాళ్ళు తమ సొంత వ్యాపార ప్రయోజనం కోసం స్కై బ్రిడ్జ్ కడుతూ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పటం ఆ వార్త లక్ష్యం.

అయితే, ఆ వార్త చూసినప్పుడు నాకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. దాదాపు 40 ఏళ్లకు ముందు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళుతున్నప్పుడు ఈనాడు దాటాక ఆర్టీయే ఆఫీసు ఎదురుగా ఇప్పుడున్న రోడ్డు లేదు. కానీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ను లింక్ చేయాలని గవర్నమెంట్ అనుకుంది. ఎర్రమంజిల్ కాలనీలో కొన్ని ఇళ్ళు కూలగొట్టి మధ్యలో కొంత భూసేకరణ జరిపింది.

మొత్తానికి ఆ రోడ్డు వేయటం వల్ల చాలా లాభం కలిగింది. అంతకుముందు తాజ్ కృష్ణా నుంచి జీవీకే దాకా ఉన్న భూమికి మధ్యలో ఈ రోడ్డు వచ్చింది. ఆ విధంగా వాళ్ళ భూమి రెండు ముక్కలైంది. అదే సమయంలో ఆ రోడ్డు వల్ల వాళ్ళ బిజినెస్ కు కూడా చాలా మేలు జరిగింది.

ఈ సంగతి గుర్తుకు రాగానే మా రిపోర్టర్ కు ఇదంతా చెప్పకుండానే.. ఆ స్కై బ్రిడ్జ్ కట్టుకోవటానికి వాళ్ళకు పర్మిషన్ ఎలా వచ్చిందో ఆ ఆర్డర్ కాపీ దొరుకుతుందేమో ప్రయత్నించమని చెప్పా. వార్త ఆపినందుకు అతనేమీ చిరాకు పడలేదు. వారం రోజులు చాలా ఓపిగ్గా ట్రై చేసి పట్టుకొచ్చాడు. నవ్వుతూ నా చేతికిచ్చాడు.

అప్పటికే తను చదివి ఉండటం వల్ల అతనికి విషయం అర్థమైంది. నా అనుమానమే నిజమైంది. అప్పట్లో ప్రభుత్వం ఆడగ్గానే తమ భూమి ఉచితంగా ఇచ్చామని, ఇప్పుడు తమ అవసరాల దృష్ట్యా స్కై బ్రిడ్జ్ కట్టుకోవాల్సిన అవసరముందని చెబుతూ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ దరఖాస్తును క్లియర్ చేయటానికి అధికారులకు ఏడాదిన్నర పట్టింది. దరఖాస్తును రిఫర్ చేస్తూ ఆమోదిస్తున్నట్టు పేర్కొన్న ఉత్తర్వు అది. నిజానికి టాంక్ బండ్ చివర్లో ఉన్న మారియట్ హోటల్ (ఒకప్పుడు వైస్రాయ్ హోటల్ పేరుతో తెలుగుదేశంలో అధికార మార్పిడి ఘట్టానికి సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే కదా) కూడా ఇలాంటి స్కై బ్రిడ్జ్ కట్టుకుంది. చాలా తక్కువ టైమ్ లోనే పర్మిషన్ వచ్చింది. అది అప్పటి కథ.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే, టి. సుబ్బిరామిరెడ్డి వియ్యంకుడైన తాజ్ యజమానికి పర్మిషన్ రావటానికి ఏడాదిన్నర పట్టింది. పైగా, వాళ్ళు ఒకప్పుడు ఉచితంగా భూమి ఇచ్చి ఉన్నారు. ఈ చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేసరికి ఆ స్కై బ్రిడ్జ్ కూడా దాదాపు పూర్తికావచ్చింది.

అంటే, ముందుగా వాళ్ళు రోడ్డు ఎగువన ఉన్న భాగం పూర్తి చేశారు. వాళ్ళ ఆవరణలో ఉన్న భాగం తరువాత కట్టుకున్నారు. ఆ విధంగా ట్రాఫిక్ సమస్య త్వరగానే తీరేటట్టు జాగ్రత్త తీసుకున్నారు. అప్పుడింకా వార్త వేయటానికేమీ లేదు కాబట్టి వదిలేద్దామన్నాడు మా రిపోర్టర్.

ఇప్పుడాయన ప్రభుత్వ పదవిలో ఉండటం వల్ల పేరు రాయలేదు. ఏమైనా, ఒక్కోసారి మనకు కనిపించే దానికి భిన్నంగా ఇంకో కోణం ఉండవచ్చుననటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రోత పాటకు రక్షిత విఫల సమర్థన… ఈమె ఎవరో గుర్తుందా మీకు…
  • ఈ ఐదు అంశాలే బీజేపీ Vs మమత పోరులో కీలకం… ఇదీ ప్రజెంట్ పిక్చర్…
  • 100 కోట్ల శ్రీదేవి చెన్నై ఆస్తిపై… జాన్వి, ఖుషీ కపూర్ ఇంట్రస్టింగ్ ఫైట్..!!
  • కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…
  • వాడెవడో ఏదో కూశాడట..! రాహుల్ గాంధీ డప్పు కొడుతున్నాడు..! ప్చ్, పిటీ..!!
  • హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions