.
ఇప్పుడంటే తిరుమల ఆర్జిత సేవలను కూడా తూతూమంత్రం కానిచ్చేస్తున్నారు గానీ ఒకప్పుడు తిరుమలలో సేవలు అంటే అదొక ఉత్సవం, భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక జ్ఞాపకంలా మిగిలేది…
ఈ కృత్రిమ నెయ్యి లడ్డూలు, నకిలీ పట్టు శాలువాలు, క్షుద్ర రాజకీయాలతో తిరుమల ఇలా కనిపిస్తున్నది కానీ ఒకప్పుడు..?
Ads
ఆనందనిలయం అని ఓ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు… దాని మీద వందలాది మంది కామెంట్లు చాలా ఆసక్తికరంగా అనిపించాయి… అప్పటి రోజుల్లోకి తీసుకుపోయారు అందరూ…

‘‘ఇప్పటి వారికి తెలియదు కానీ … సుమారుగా 1978 టైంలో… అప్పుడే కళ్యాణం టిక్కెట్టు 1000/- ఉండేది…
చాలా సంవత్సరాల క్రితం తిరుమలలో కళ్యాణోత్సవం, మరికొన్ని ఆర్జిత సేవలు చేసిన భక్తులకు… టిటిడి సిబ్బంది లేదా నియమిత సేవకులు బుట్టలలో ప్రసాదాన్ని కాటేజీల వద్దకు తీసుకువచ్చి అందించేవారు…
పెద్ద లడ్లు, పులిహోర, చక్ర పొంగలి, దద్దోజనం ఇలా అనేక ప్రసాదాలు… వారు అవి తీసుకుని కాటేజీల వద్ద భక్తులకు పంచేవారు…’’ ఇదీ ఒరిజినల్ పోస్టు…

కామెంట్లలోకి వెళ్దాం…
1. 1982 జనవరిలో మా అమ్మమ్మ తాతగార్లు పెద్ద కల్యాణం అనగా రెండు వేల రూపాయల కల్యాణం చేయించారు… ఇరవై మంది పెద్ద కల్యాణం వారు, ఇరవై మంది చిన్న కల్యాణం దంపతులు అనగా అయిదు వందల రూపాయల కల్యాణం… మొత్తం నలభై మంది దంపతులు మాత్రమే కల్యాణం చేసేవారు… చిన్న కల్యాణానికి అయిదుగురిని, పెద్ద కల్యాణానికి పది మంది పెద్దలను పిల్లామూక ఎందరినైనా వదిలేవారు… మేం అలా వెళ్ళాము…
కాటేజీ దగ్గరికి ప్రసాదాలు సాయంత్రం సుమారు నాలుగు దాటాక వచ్చాయి… చాలా రకాలు… లడ్డూలు, వడలు, అప్పాలు, జిలేబీలు, దద్యోజనం, పులిహోర, పరమాన్నం, చక్ర పొంగలి, పులగం, కట్టు పొంగలి, అట్లు ఇంత వరకు గుర్తు… పెద్ద గంపలో తెచ్చి ఇచ్చారు… దాచుకుందుకు పాత్రలు లేవని పెద్దలు నొచ్చుకున్నారు… మేము ఆరోజు మరునాడు కూడా తిన్నాము…
కల్యాణములో సంకల్పం మొదలుకుని అన్నిటికి పెద్ద కల్యాణం దంపతులను పిలిచేవారు… చిన్న కల్యాణం దంపతులను సంకల్పానికి మాత్రమే పిలిచారు… ఉదయం పదికి మొదలుపెడితే మధ్యాహ్నం రెండువరకు కల్యాణం, వెంటనే దర్శనం…

2. అంతే కాదండీ… 60 లలో కళ్యాణం చేయించే భక్తులను కాటేజీ నుంచి కల్యాణ మండపానికి సన్నాయి మేళంతో తీసుకెళ్ళేవారు…
3. కళ్యాణం అయిన తరువాత దంపతులను స్టేజిపైకి పిలిచి ఆశీస్సులు అందించేవారు… ఆ రోజులు ఇక రావు… పిల్లల్ని ప్రక్కన అరుగు మీద కూర్చోపెట్టేవారు..
4. 90’s లో two types ఉండేవి, పెద్ద కళ్యాణం, చిన్న కళ్యాణం… పెద్ద కళ్యాణం చేయుంచుకున్న వారిని ముందు వరసలో కూర్చోబెట్టేవాళ్లు… మేము కళ్యాణం 1986లో చేసినాము.. బుట్ట నిండా లడ్డూ, వడ, దోశ, చక్కెర పొంగళి, పులిహోర ఇచ్చినారు… ఒక రూము ఇచ్చినారు… అయ్యవారు వచ్చి ఆశీర్వాదం ఇచ్చినారు…

5. 1976 లో మా మేనత్త గారు స్వామి కళ్యాణం చేసినపుడు మొత్తం సుమారుగా ముప్పై మందిని అప్పట్లో పంపించారు… మా ఆర్యవైశ్య అన్నసత్రంలోకి వచ్చి అందరికీ ప్రసాదాలు వడ్డించారు… కేజీ లడ్లు మూడు నాలుగు వచ్చినాయి… చిన్న లడ్లు పది వచ్చాయి… అన్ని రకాల ప్రసాదాలు పెట్టారు…
6. అప్పట్లో పుష్పయాగం కూడా సంకల్పం ఉండేది… దానికి బంగారు డాలర్ ఇచ్చేవారు… మా అన్నలు ఇద్దరూ చేయించారు…
7. 1979లో మా నాన్న 2000 కళ్యాణం చేయించారు… అప్పుడు కళ్యాణం తర్వాత కాటేజ్ వద్దకే మూడు బుట్టలో పెద్ద 25 లడ్డూలు, పెరుగన్నం, పులిహోర , చక్కర పొంగలి , పొంగలి జీపుల్లో తెచ్చి ఇచ్చారు…

సీన్ కట్ చేస్తే… మరి ఇప్పుడు..? ‘‘నేను డిసెంబర్ లో వెళ్లాను, ఒక కండువా, జాకెట్ ముక్క ఇచ్చారు, అంతే… ఇంకేమీ ఇవ్వలేదు, ప్రసాదం కూడా 2 చిన్న లడ్డూలు ఇచ్చారు, అయితే అక్కడ స్వామిని మోసేవాళ్లమని, తీర్థం అని చెప్పి సేవకులు డబ్బులు అడుగుతున్నారు… ఇదీ మరో కామెంట్…
చివరగా… ప్రస్తుత క్షుద్ర రాజకీయాలు మొత్తం తిరుమల ఆధ్యాత్మిక శోభకు మకిలిగా మారాయి కదా… అసలు లడ్డూ తయారీలో వాడే నెయ్యి నెయ్యే కాదనే రాద్దాంతం ఈరోజుకూ కలకలమే కదా… కానీ లడ్డూ అమ్మకాలు ఏరోజుకారోజు కొత్త రికార్డులే… ఆ దేవుడి మీద నమ్మకం… కానీ మరీ దరిద్రం అంటే… టోకున లడ్డూలు కొనుక్కొచ్చి కొందరు పెళ్లిళ్లలో పంచడం… దానికి టీటీడీ విధానాలు సహకరించడం..!!
ఈరోజుకూ తిరుమల బయట లడ్డూ అమ్మకుండా, అవీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఇస్తే... ఆ వెంకన్న లడ్డూ ప్రసాదానికి మరింత విలువ..!! కేవలం దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే దక్కాల్సిన ప్రసాదం అది..!!
Share this Article