.
Subramanyam Dogiparthi …. ఇంత చిక్కని కధను , అంతే బిర్రయిన స్క్రీన్ ప్లేని , వాటికి దీటుగా డైలాగులను వ్రాసిన పరుచూరి బ్రదర్సుని ముందుగా అభినందించాలి . తాము నేసే కధలకు భిన్నంగా చిక్కని కధను నేసారు ఈ సినిమాకు .
న్యాయపరిరక్షణే ధ్యేయంగా పనిచేసే న్యాయమూర్తి శోభన్ బాబు . తన తీర్పు వలన అనాధ అయిన సుమన్ని తమ కొడుకులతో సమానంగా పెంచుతారు శోభన్ బాబు , ఆయన భార్య సుమిత్ర . ఈ ముగ్గురితో పాటు ఓ మేనకోడలు కిన్నెర . సుమన్ క్రమశిక్షణతో పెరిగి పోలీస్ ఇనస్పెక్టర్ అవుతాడు . స్వంత రెండో కొడుకు సాయికుమార్ దారి తప్పి నేర మనస్తత్వం కలిగిన మనిషి అవుతాడు .
Ads
చెడు సావాసాలు కూడా తోడవటంతో బాంకు దోపిడీకి కూడా పాల్పడి అక్కడ ఒక మహిళా ఉద్యోగి షబ్నంను కిడ్నాప్ చేసి , తీరా ఆమె సాయికుమార్ని గుర్తించాక , మానభంగం చేసి గాయపరుస్తాడు . ఆమె చనిపోయే ముందు తనను ప్రేమించిన సాయికుమార్ అన్న శుభలేఖ సుధాకరికి అన్ని విషయాలు చెపుతుంది .
ఆ కోపంతో రెచ్చిపోయిన శుభలేఖ సుధాకర్ తమ్ముడితో ఘర్షణ పడి షూట్ చేయటంతో సాయికుమార్ చనిపోతాడు . చిన్న కొడుకుని పెద్ద కొడుకు చంపాడని తెలిసాక అతన్ని చట్టం నుండి రక్షిస్తానికి శోభన్ బాబు నానా తిప్పలు పడతాడు . క్లైమాక్సులో కొడుకుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేసి తాను ఆత్మహత్య చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .
మొట్టమొదటగా అభినందించవలసింది శోభన్ బాబునే . జడ్జిగా చాలా హుందాగా నటించారు . సంఘర్షణకు లోనయిన ఎమోషనల్ సీన్లలో ఇంకా బాగా నటించారు . హీరో పాత్రలు అయిపోయాక తండ్రి పాత్రల్లో బ్రహ్మాండంగా నటిస్తూ నటన నుండి ఎందుకు మరుగయ్యారో అర్థం కాదు . తెర మరుగు కాకుండా ఉండి ఉంటే ఇలాంటి గొప్ప సినిమాలు చాలా వచ్చి ఉండేవి .
తర్వాత మెచ్చుకోవలసింది సుమన్నే . సిన్సియర్ పోలీస్ ఆఫీసరుగా , గ్లామర్ హీరోగా బాగా నటించారు . అతని సరసన లిజీ హుషారుగా , అల్లరిగా బాగా నటించింది . బట్టతల ఎక్కడ కనిపించినా కొట్టకుండా వదలిపెట్టని పాత్రలో బాగా నటించింది . ఆ తర్వాత శోభన్ బాబు మేనకోడలిగా పొడుపు కధలు వదులుతూ కిన్నెర కూడా బాగా నటించింది .
దారితప్పిన కొడుకుగా సాయికుమార్ , పెద్ద కొడుకుగా శుభలేఖ సుధాకర్ , సాయికుమార్ స్నేహితుడిగా మహర్షి రాఘవ బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో చలపతిరావు , వంకాయల , బ్రహ్మానందం , సుబ్బరాయ శర్మ , జెన్నీ , బాబూ మోహన్ , తాతినేని రాజేశ్వరి తదితరులు నటించారు .
పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . పేకాట క్లబ్బులో అమ్మ దీని తస్సాదియ్యా అంటూ పేకాట లోని డ్రాప్ , మిడిల్ డ్రాప్ , కార్డ్ షో కౌంట్ , షో , వగైరా వాటిని మిక్స్ చేసి బ్రహ్మాండంగా వ్రాసారు . తప్పక చూడాల్సిందే ఈ వీడియోని . ముఖ్యంగా పేకాట అలవాటు ఉన్నవారు .
క్లైమాక్సులో దోషి ఎవరు నిర్దోషి ఎవరు పాట బాగుంటుంది . ఇట్లాగే తెల్లార్లూ డ్యూయెట్లో లిజీ రివర్స్ లవ్వాడుతుంది . అన్ని డ్యూయెట్లలో హీరో హీరోయిన్ని లవ్వాడితే ఈ డ్యూయెట్లో రివర్స్ . మరో డ్యూయెట్ ఒకటికి ఒకటి కూడా బాగుంటుంది . విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , శైలజ , చిత్ర శ్రావ్యంగా పాడారు .
మంగమ్మ శపథం , జీవనజ్యోతి వంటి హిట్ సినిమాలను తీసిన D V S బేనరుపై వై నాగేశ్వరరావు చాలా సమర్ధవంతంగా దర్శకత్వం వహించారు . అభినందనీయులు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకు ముందు చూడనట్లయితే తప్పక చూడండి . శోభన్ బాబు , సుమన్ అభిమానులు ఎన్ని సార్లయినా చూడవచ్చు . An excellent sentimental , emotional , action movie
నేను పరిచయం చేస్తున్న 1244 వ సినిమా #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article