Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !

August 23, 2026 by M S R

.

మనం సాధారణంగా వందేళ్ల ఇల్లు అంటేనే… అటువైపు తొంగి కూడా చూడం… అదెంత హిస్టారికల్ మాన్యుమెంట్ అయినా సరే… పైగా ఏ దెయ్యాల కొంపో అని భయపడిపోతాం కూడా… కానీ సొగసైన బ్యాటింగుకు పేరొందిన శ్రీలంక క్రికెటర్ సంగక్కర గత చరిత్రాత్మక ఆర్కిటెక్చర్ కళకు వర్తమాన ఆధునిక సొబగులు అద్ది, కొత్త అందాన్ని తీసుకొచ్చి, అందులోనే ఉంటున్నాడు… అదీ అభిరుచి, అదీ కళాత్మక అభిరుచి అంటే… వివరాల్లోకి వెళ్దాం…

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సొగసైన బ్యాటర్లలో ఒకడిగా పేరున్న సంగక్కర.. తన భార్య యెహాలితో కలిసి శ్రీలంకలోని గాలే కోటలో నిర్మించుకున్న ఇంటి విషయంలోనూ ‘పాతదాన్ని చెరిపేయడం కాదు.. దానితో కలిసి కొత్తదాన్ని సృష్టించడం’ అనే ఆలోచనను ఎంచుకున్నాడు…

Ads

గాలే ఫోర్ట్‌ అంటే కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు. 1600ల నుంచే పోర్చుగీసు, డచ్ వ్యాపారుల నిర్మాణాలతో రూపుదిద్దుకున్న చారిత్రక పట్టణం. యూరోపియన్లు దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో నిర్మించిన కోట పట్టణాల్లో అత్యుత్తమంగా మిగిలిన ఉదాహరణగా యునెస్కో గుర్తించిన ప్రదేశం. అలాంటి చరిత్ర మధ్యలో సంగక్కర కుటుంబం ఇల్లు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కథ చెబుతోంది.

సంగక్కర

కలల ఇల్లు… కానీ లోపలికి వెళ్లాక షాక్!

గాలేలో ఒక ఇల్లు కావాలన్న కోరిక సంగక్కర దంపతులకు చాలాకాలంగా ఉంది. ఎన్నోసార్లు ఆ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లేవారు. ఇంటిని కొనకముందే దానిపై మనసు పడిపోయింది.

“ఇదే మన ఇల్లు” అని నిర్ణయించుకున్నారు.

2008లో చివరకు దాన్ని కొనుగోలు చేశారు. విచిత్రమేమిటంటే.. కొనుగోలు చేసేంతవరకు ఇంటి లోపలి పరిస్థితి వారికి తెలియదు.

మొదటిసారి తలుపు తెరిచి లోపలికి వెళ్లగానే మాత్రం షాక్.

అది అందమైన చారిత్రక భవనం కాదు. లోపల పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉంది. కానీ అక్కడే సంగక్కర దంపతులు ఒక నిర్ణయం తీసుకున్నారు.

పాతదంతా తీసేసి కొత్త ఇల్లు కట్టడం కాదు. పాత ఇంటినే కొత్త జీవితంలోకి తీసుకురావాలి. ఏళ్ల శ్రమ ప్రారంభమైంది.

అందుకే ఆర్కిటెక్టులు జీవన్ డిసౌజా, మురాద్ ఇస్మాయిల్, ఇంటీరియర్ డిజైనర్ అన్నికా ఫెర్నాండోతో కలిసి ఈ ఇంటి రూపాంతరానికి శ్రీకారం చుట్టారు.

చరిత్రను కూల్చలేదు, పదిలపరిచారు… సుమారు 120 ఏళ్ల నాటి ఈ నాలుగు బెడ్‌రూమ్‌ల విల్లాలో మూడు కోర్ట్‌యార్డ్ గార్డెన్లు ఉన్నాయి. పైకప్పుపై స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. గదుల్లో ఆధునిక ఫర్నిచర్‌తో పాటు కళాఖండాలు, పురాతన వస్తువులు కనిపిస్తాయి.

కానీ ఈ ఇంటి అసలు అందం అక్కడ లేదు.

గోడల్లో ఉంది.

పాత ఇంటి గోడలపై కనిపించే తేమ మరకలు, కాలం మిగిల్చిన రంగులు, పాత నిర్మాణంలో ఉపయోగించిన కోరల్ రాళ్ల ఆనవాళ్లు.. వీటిని డిజైనర్లు దాచిపెట్టలేదు.

కొత్త గోడల పక్కనే పాత గోడలు కనిపించేలా చేశారు.

అదే ఈ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చింది. కంట్రాస్టు స్పష్టంగా కనిపించేలా…

“మీరు ఇంట్లో ఎక్కడ నడిచినా పాత ఇల్లు కనిపిస్తుంది” అన్న సంగక్కర మాటల్లోనే ఈ ఇంటి తత్వం మొత్తం దాగుంది.

కొత్తది అక్కడ ఉంది. పాతది కూడా అక్కడే ఉంది. రెండూ ఒకదానితో ఒకటి పోటీపడకుండా కలిసి ఉంటాయి.

అది కేవలం ఇంటి డిజైన్ కాదు. గాలే కోటలోకి కొత్తగా వచ్చిన ఒక కుటుంబం.. అప్పటికే అక్కడ శతాబ్దాలుగా జీవిస్తున్న చరిత్రతో ఎలా కలిసి జీవిస్తుందో చెప్పే ఒక ప్రతీకలా మారింది.

సంగక్కర

ఒక విగ్రహం కోసం ఏకంగా ఇల్లే దాని చుట్టూ కట్టారు!

ఇంట్లోని ప్రత్యేక ఆకర్షణల్లో శ్రీలంక కళాకారుడు ప్రగీత్ మనహంస రూపొందించిన భారీ శిల్పం ఒకటి.

ఆ శిల్పాన్ని ఇంట్లో పెట్టాలనుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే.. అది ఏ తలుపులోంచీ లోపలికి రాదు!

ఇక ఏం చేయాలి?

శిల్పాన్ని ముందుగానే ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంటి పునర్నిర్మాణం జరిగింది.

అంటే.. ఇంటిని శిల్పం చుట్టూ నిర్మించారన్నమాట.

సంగక్కర చెప్పినట్టు, ఆ పాత్ర ఇంటి పునర్నిర్మాణం మొత్తం చూసింది!

సంగక్కర

డిజైనర్‌కు ఇది మరో ఇంటీరియర్ ప్రాజెక్ట్ కాదు

ఇంటీరియర్ డిజైనర్ అన్నికా ఫెర్నాండోకు ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన బాధ్యతాభావం ఉంది.

గాలే ఫోర్ట్ లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న వారసత్వ ప్రదేశంలో పని చేయడం అంటే సాధారణంగా ఒక ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కాదని ఆమెకు తెలుసు.

పాత నిర్మాణాన్ని ఎంతవరకు కాపాడాలి? ఎక్కడ కొత్తదాన్ని తీసుకురావాలి? ఏ గోడను అలాగే ఉంచాలి? ఏ ఆనవాళ్లను చెరపకూడదు?

ప్రతి నిర్ణయం వెనుక చరిత్ర ఉంది.

మొదట్లో పాత గోడలపై కనిపించిన తేమ మరకలు, రంగు మారిన ఉపరితలాలు లోపాల్లా కనిపించాయి. కానీ కొద్దికొద్దిగా అవే ఇంటి అందంగా మారాయి.

శుభ్రమైన కొత్త గోడ పక్కన కాలం తాకిన పాత గోడ కనిపించినప్పుడు.. ఆ రెండింటి మధ్య వచ్చిన వ్యత్యాసమే ఇంటికి వ్యక్తిత్వాన్ని ఇచ్చింది.

సంగక్కర ఇంటి అసలు కథ ఇదే

ప్రపంచ క్రికెట్‌లో 28 వేలకుపైగా పరుగులు చేసిన ఆటగాడు సంగక్కర. టెస్టుల్లోనే 38 సెంచరీలు చేసిన వికెట్ కీపర్-బ్యాటర్. రిటైర్ అయిన తర్వాత వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా, కోచ్‌గా మరో ప్రపంచంలో తన ప్రతిభను చూపిస్తున్నాడు.

కానీ గాలేలోని ఈ ఇల్లు అతని మరో కోణాన్ని బయటపెడుతోంది.

ఇక్కడ అతను క్రికెట్ లెజెండ్ కాదు.

ఒక పాత ఇంటిని చూసి దాని చరిత్రను ప్రేమించిన మనిషి.

ఆ ఇంటిని కూల్చి కొత్త భవనం కట్టడం చాలా సులభం.

కానీ 120 ఏళ్ల గోడల్లో కాలం వేసిన ముద్రలను అలాగే ఉంచి, వాటి మధ్య తన కుటుంబ జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభం కాదు.

అందుకే గాలేలోని సంగక్కర ఇల్లు ఒక విలాసవంతమైన సెలబ్రిటీ హోమ్ కంటే ఎక్కువ.

చరిత్రను మ్యూజియంలో బంధించకుండా… ఇంట్లోనే పదిలంగా ఉండేలా చేసిన ఒక ఆలోచన.

పాతది పోవాల్సిన అవసరం లేదు.

కొత్తది రావాలంటే పాతదాన్ని కూల్చాల్సిన అవసరం కూడా లేదు.

రెండూ కలిసి ఉండగలవు.

సంగక్కర దంపతుల గాలే ఇల్లు అదే విషయాన్ని చాలా అందంగా చెబుతోంది…!

సంగక్కర

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions