.
Mohammed Rafee ….. సుస్వరం విరామం … – బాలీవుడ్ పాటలకు స్వస్తి పలికిన అర్జీత్ సింగ్!
కొందరంతే! చిన్న వయసులోనే జీవితాన్ని చూసేస్తారు! ఫేమ్ గీములను పట్టించుకోరు! మనసుకు నచ్చినట్లు నడుచుకుంటారు! అర్జీత్ సింగ్ కూడా అంతే!
Ads
ఆధ్యాత్మిక పరిపక్వత, సేవాతాత్పరత, ప్రేమమయమైన అతని జీవితం 40 ఏళ్లకే పరిపూర్ణతను ఇచ్చింది! మంచి పీక్స్ ఫేమ్ లో వున్నప్పుడే ఇక సినిమాలకు స్వస్తి పలికేసాడు! ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది అతడి స్వర అభిమానులకు నిన్నటి నుంచి నిద్ర లేదు!
నిన్నటి నుంచి ప్రతి ఇయర్ ఫోన్ లోనూ అర్జీత్ పాటలే మారుమోగుతున్నాయి! అర్జీత్ స్వరం అలాంటిది! ఎంతో లోతైన సుందర స్వరం! ప్రేమికులకు, సున్నిత హృదయాలకు ప్రియమైన మధుర స్వరం! ఈ 20 ఏళ్లలో అతను పాడిన వేలాది పాటలు బాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి!
సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి! తెలుగు సినిమాల్లోను పాడాడు! ఎన్నో ఫిల్మ్ ఫేర్లు, జాతీయ పురస్కారాలు, గత ఏడాది కేంద్రం పద్మశ్రీ కూడా ఇచ్చేసింది!
ఆషికి 2లో తుమ్ హి హో పాట ఎన్ని సార్లు విన్నానో! రాత్ భర్ పాట ఎంత బావుంటుంది! కభీ జో బాదల్ బర్సె ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటుంది! అగర్ తుమ్ సాత్ హో, మన్వా లాగే, ఆధురి కహాని, బింటే దిల్, ఫిర్ భి తుంకో చాహుంగా, సైయారా, అప్నా బనాలే… ఇలా వందలాది పాటలు వింటూనే ఉంటాం! మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటాయి! అది అర్జీత్ స్వర మాధుర్యం!
అర్జీత్ సింగ్ పంజాబీ! సంగీత కళాకారుల కుటుంబం! గురుకుల్ రియాలిటీ షో లో పాటల ప్రియుల హృదయాల్లోకి వచ్చాడు! సంజయ్ లీలా బన్సాలీ తొలి అవకాశం ఇచ్చాడు! కానీ రిలీజ్ టైం కు ఆ పాట సినిమాలో లేదు! టిప్స్ కంపెనీతో తొలి ఒప్పందం కుదుర్చుకున్నాడు! అది ఎందుకో అదిలోనే రద్దు అయ్యింది!
- అలా అని అర్జీత్ కుంగిపోలేదు. ముంబయికి షిఫ్ట్ అయ్యాడు! ఆల్బమ్స్ చేసుకున్నాడే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ల చుట్టూ తిరగలేదు. మర్డర్ 2 సినిమా అవకాశం వచ్చింది! ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశమే రాలేదు! ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్కసారి కూడా తనకు ఛాన్స్ ఇవ్వండి అని ఏ ఒక్కరిని అడగలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జీత్ చెప్పడం విన్నాను.
మంచి అవకాశాలు వున్న సమయంలోనే ఇక సినిమాలకు పాడను అని చెప్పడంలో ఎంత గట్స్ ఉండాలి? ఎంత విశాల హృదయం ఉండాలి? అవన్నీ అతనిలో ఉన్నాయని మరోసారి చాటుకున్నాడు అర్జీత్! అదే అతని స్థానంలో ఇంకొకరు ఉండి ఉంటే స్వార్ధంగా బాలీవుడ్ సంగీతాన్ని ఏలే వారు! ఎవ్వరిని రాకుండా గడి కట్టే వారు!
కానీ అర్జీత్ దయా హృదయం! భారతదేశంలో టాలెంట్ కు కొదవలేదు! అందరికి అవకాశాలు రావాలని 20 ఏళ్ల కెరీర్ ను మరో దిశకు మార్చాడు! ఇక తన దృష్టి స్టేజ్ షో లు, ఆల్బమ్స్ పైనే అని ప్రకటించాడు! ఇప్పటికే ఒప్పుకున్న 13 సినిమా పాటలు పాడతానని, నిర్మాతలు, సంగీత దర్శకులకు అభయం ఇచ్చేశాడు! స్పాటి ఫై టాప్ సాంగ్స్ లో గత ఏడేళ్లుగా అర్జీత్ నెంబర్ వన్ సింగర్!
అర్జీత్ మంచి ప్రేమికుడు! చిన్ననాటి స్నేహితురాలిని చదువుకునే రోజుల్లోనే అమితంగా ప్రేమించాడు! కానీ, అతను కేవలం పాటల పిచ్చివాడు, ఉద్యోగం లేదని ఆ అమ్మాయి తండ్రి ఇంకొకడికి ఇచ్చి పెళ్ళి చేసేశాడు! ప్రేమలో విఫలమై అర్జీత్ విషాద గీతాలు పాడటం మొదలుపెట్టాడు! అది అలవాటుగా మారిపోయింది!
- అందుకే బాలీవుడ్ సినిమాల్లో అర్జీత్ పాటలు యువతరాన్ని పట్టి కట్టేసాయి! ఒక్క ప్రేమ గీతాలే కాదు సూఫీ, ఖవాలి, గజల్స్ పాడటంలోనూ మేటి గాయకుడిగా ఘనమైన గుర్తింవు! ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టాడు! చారిటీ పెంచుకున్నాడు! సంపాదించింది సాయం చేయడం నేర్చుకున్నాడు! మరోవైపు ప్రేమ విఫలమయిందని పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నాడు!
కానీ, కాలం ఒకేలా ఉండనివ్వదుగా! తన ప్రేమికురాలు కోయల్ విడాకులు తీసుకున్నదని తెలిసింది. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె! అయినా వెనుకాడలేదు! ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు. కుమార్తెతో పాటు ఇంకో ఇద్దరు అబ్బాయిలు సంతానం!
మొదటి నుంచి అర్జీత్ ఆంతే అని కోయల్ కూడా చెబుతోంది! గొప్ప మనసుకు తాను ఫిదా అని చెబుతోంది! ఎంత సంపాదించినా ముంబై అంధేరిలో సింపుల్ జీవితం! కారు వున్నా ఇప్పటికీ అతను మాస్క్ తగిలించుకుని అలా నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఇష్టపడతాడని ఆమె అంటున్నారు. బాలీవుడ్ లో ఇంక పాడను అనే మాట యావత్ యువత జీర్ణించుకోలేకపోతోంది! మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోవాలని కోరుకుంటోంది అర్జీత్! – డా. మహ్మద్ రఫీ
Share this Article