Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?

February 17, 2026 by M S R

.

ఆలస్యపు న్యాయం అసలు న్యాయం జరిగినట్టే కాదు అంటుంటారు కదా… ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు విస్మయాన్ని కలిగించించింది… అనేక సందేహాల్ని, ప్రశ్నల్ని అలాగే మిగిల్చింది… కొందరు రాసేస్తున్నారు 24 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది అని… నిజంగా జరిగిందా..? న్యాయనిపుణులు మాత్రమే చెప్పాలి…

ముందుగా ఆమె తల్లిని మెచ్చుకోవాలి… పట్టువదలకుండా… అలుపెరగకుండా ఇన్నేళ్లు పోరాడింది… ఇది మాటల్లో చెప్పుకున్నంత సులభమేమీ కాదు… ప్రలోభాలు, బెదిరింపులు కూడా ఎదుర్కుని ఉండే ఉంటుంది… సరే, ఇంతకీ జరిగింది న్యాయమేనా..?

Ads

శిక్షను రద్దు చేయాలనే నిందితుడి పిటిషన్ కొట్టేసింది, గుడ్… కానీ శిక్ష ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు…? వెంటనే పోలీసులు ఎదుట లొంగిపో అనే ఆదేశమూ గుడ్… కానీ ఆల్రెడీ కొంతకాలం జైలులో ఉన్నట్టున్నాడు, ఇంకా ఎంత కాలం మాత్రమే తనకు శిక్ష మిగిలేది..?

సరే, సుప్రీంకోర్టు అన్నీ ఆలోచించే చెప్పింది అనుకుందాం… కానీ 24 ఏళ్ల తరువాత తీర్పు న్యాయం చేసినట్టేనా..? మిత్రుడు Gurram Seetaramulu ఏమంటాడంటే..?

‘‘ప్రత్యూష శవం మీద పెట్టిన ఐసు గడ్డ కరిగినంతసేపు కూడా చట్టం, న్యాయం ఆమె వైపు నిలబడలేదు. ఓ కోవా బన్ను మీద పెంట పురుగుల్లా పడి చస్తాం తప్ప ఇలాంటి వ్యవస్థీకృత హత్యల మీద అసలే నోరు విప్పం…

ఆ అఘాయిత్యానికి కనీస న్యాయం దక్కడానికి ఇరవై నాలుగేళ్ళు పట్టింది. సిగ్గూ ఎగ్గూ లేని రాజ్యం ఒక అందమైన కలల ప్రపంచానికి బలవంత ముగింపు పలికింది. సినీ వినీల ఆకాశంలో ఒక మెరుపై మెరుద్దామని కలలు కన్న ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసారు. కోటి ఆశలతో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన ఆమెను అధఃపాతాళంలోకి నెట్టేశారు.

ప్రత్యూష తెలంగాణ ఆడబిడ్డ. ఆమె మీద పడి సంపన్న ఐశ్వర్యం నక్కల్లా పీక్క తిన్నది. ఇందులో పోలీసులు, మంత్రులు, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ హాస్పిటల్స్, అందులో డాక్టర్లు అందరూ పాపులే. ఆమెను అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి, నోట్లో విషం పోసి, చంపి, అందులో ఒక బకరా గాణ్ణి ఇరికించి, మిగతా అందరూ దేశాలు వదిలి పారిపోయారు.

ఆమె ప్రేమికుడిగా చెప్పబడుతున్న మనిషి చావలేదు. కానీ ఆమె మాత్రం చంపబడింది. ఇందులో చట్టం తన పని తాను చేసుకుంది. సహజంగానే చట్టం, న్యాయం సంపన్నుల కాపలాగా పనిచేసింది.  కానీ ప్రత్యూష శవం మీద పెట్టిన ఐసు గడ్డ కరిగినంతసేపు కూడా న్యాయం ప్రత్యూష వైపు నిలబడలేదు.

ఈ కేసు వాదించిన తారకం సర్ డైరీలు ఈ మధ్య చదివా. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం… 2002 ఫిబ్రవరి 23 న జరిగిన ఘటన. ఇరవై నాలుగున మహా ఘనత వహించిన కేర్ హాస్పిటల్ కు చేరింది. ఆమె వంటి మీద 13 చోట్ల గాయాలు ఉన్నాయని ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పాడు.

మహా ఘనత వహించిన దేవేందర్ గౌడ్‌లు, మాధవ రెడ్లు… అందునా చట్టం, న్యాయం అరవై ఆరు పాదాల మీద నడిపిన బాబొరి పాలనా కాలం అది. బంజారా హిల్స్ , పంజాగుట్ట అది మా పరిధి కాదు అనే బంతాటలో నలిగిపోయింది ప్రత్యూష…

బాధ్యత కలిగిన హాస్పిటల్ ఆమె దుస్తులను భద్రపరచడం ప్రోటోకాల్ నియమం. కానీ అప్పటికి అప్పుడే హాస్పిటల్‌లో ఆమె దుస్తులను కాల్చేసి న్యాయాన్ని నిలబెట్టారు అభినవ ధన్వంతర్లు. గాంధీ హాస్పిటల్ ఒక రిపోర్ట్, ఫోరెన్సిక్ లాబ్ మరొక రిపోర్ట్, ఒక డాక్టర్ ఆమె వంటి మీద గాయాలు ఉన్నాయి అని చెప్పడం,
మరొక డాక్టర్ వైద్యంలో భాగంగా పెట్టిన గాట్లు అనడం మొత్తంగా సకల రాజ్య వ్యవస్థలు ఆమెను ఏకాకిని చేశాయి.

అన్ని వ్యవస్థలు కలిసి హత్యను ఆత్మహత్యగా మార్చాయి. ఏ మహిళా సంఘం నోరు విప్పలేదు, హక్కుల సంఘాలు నామమాత్రంగానే స్పందించాయి. కేసు హైదరాబాద్ మెట్రో సెషన్స్ , హై కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు చేరడానికి పాతికేళ్లు పట్టింది.

ముందు ఇదేళ్లు… ఇప్పుడు రెండేళ్ళు… అంతే… ఒక అందమైన అమ్మాయిని అత్యాచారం, హత్య చేసినందుకు మహా ఘనత వహించిన చట్టం ఇచ్చిన గిఫ్ట్. సినిమా సమాజమే హంతక స్వభావం కలిగినది. ఈ అమ్మాయికి బాబుల డాబు గిరి లేదు. ప్రవర అసలే లేదు . నిత్యం జరిగే హత్యల అత్యాచారాల పరంపరలో ఇదొకటి.

ఒక్క నటుడు నోరు విప్పలేదు, ఇది అన్యాయం అని అనలేదు, అసలెవరు హంతకులు ఇందులో? ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని అర్ధాంతరంగా కుదించారు. ప్రత్యూష కేసులో మనమంతా దోషులమే. ఆ తల్లికి సమాజం మొత్తం బాకీ ఉంది. మన సమాజానికి సెలెక్టివ్ అమ్నీషియా, అన్నీ మర్చిపోయినట్టు నటిస్తాం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?
  • నచ్చిన వార్త..! కొన్ని ఉద్వేగాలకు లెక్కలు, లాజిక్కులు ఉండవ్..!!
  • ఉత్తమ పురుష్..! లేడీ ఐఏఎస్‌లకు ఆయనంటే ఎందుకో క్రేజ్..?
  • పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!
  • చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…
  • ఈ చంద్రబాబు దోస్త్‌కు మన తెలంగాణ ఆడపిల్లలు జస్ట్ గినియా పిగ్స్..!!
  • ఓ బందిపోటు కథ కాదు… దేహమంతా లైంగిక దాడి గాయాల బాధితురాలి కథ …
  • ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…
  • అత్తరు కాదు అది… ఆడదాని నెత్తురు, కొవ్వు… ఓ సైకో ఫాంటసీ…
  • ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions