.
బండి సంజయ్…! ఓ కార్పొరేటర్ నుంచి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన దూకుడు కేరక్టర్… తప్పకుండా తనకు తెలంగాణ బీజేపీలో అభిమానగణం ఎక్కువే… చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర నిలబడి, తొడగొట్టి సవాల్ విసిరితే ఒవైసీ కాదు, కేసీయార్ హడలిపోయి, బీజేపీ వాళ్లను కాళ్లవేళ్లా ప్రాథేయపడి, సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన దూకుడు…
కానీ ఏమైంది..? కొరగాని కొడుకు కారణంగా… నేల మీదకు పడిపోయాడు… సారీ టు సే నాయకా… నీ చుట్టూ కోటరీ కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, కొడుకు మీద నీ ప్రేమ కావచ్చు, నీ ఆలోచనల్లోనే లోపం కావచ్చు… తప్పు జరిగింది… బదనాం అయిపోయావు… నేను నా కొడుకుని చట్టం మీద గౌరవంతో పోలీసులకు అప్పగిస్తున్నా అంటున్నావు కానీ… నిజం ఏమిటి..?
Ads
- యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు… పోక్సో కేసులో అరెస్టు లేనిదే బెయిల్ రాదు… మరి నీ లాయర్లు చెప్పింది ఓ కేంద్ర హోం మంత్రిగా ఎందుకు విశ్వసించావు..? ఇప్పుడు చట్టానికి అప్పగిస్తున్నాను అంటే ఇన్నాళ్లూ నీ చంకలో దాచిపెట్టుకున్నట్టే కదా కొడుకును..? మరిక చట్టం మీద గౌరవం ఏముంది..? రేవంత్ రెడ్డి లుక్ అవుట్ జారీ చేశాక కదా ఇక తప్పనిసరై, చేతులెత్తేసి, తనయుడిని అప్పగించింది.,.? పోలీసులే చెబుతున్నారు కదా, మేమే అరెస్టు చేశామని, భగీరథ్ నేరం అంగీకరించాడని, మరి నీ అప్పగింతల మాటకు విలువేది..?
శతృసంతానం అనే ఓ పదం ఉంది… పూర్వ జన్మలో మనకు పగవాళ్లుగా ఉన్నవాళ్లు ఆ జన్మలో ఏమీ సాధించలేక ఈ జన్మలో మనకే సంతానంగా పుడతారు, సాధిస్తారు, దుంప తెంచుతారు… నీ కొడుకు తత్వం నీకు తెలియనిది కాదు… సరే, భగీరథ మీద ప్రేమతో ‘మంచోడు’ అని నువ్వు మనసు చంపుకుని సర్టిఫికెట్ ఇస్తున్నావే అనుకుందాం… కానీ..?
నీ క్యాంపు ప్రచారం మేరకు కొన్ని అంశాలు చూద్దాం… ‘‘నీకూ బీఆర్ఎస్‌కూ పడదు, బీజేపీతో బీఆర్ఎస్ రహస్య స్నేహానికి నువ్వే అడ్డు… సో, నువ్వు ఎక్కడ దొరుకుతావోనని కాచుకుంది…దొరికావు కదా, ఇక టాంటాం, నెగెటివ్ క్యాంపెయిన్‌తో వేటాడారు… అసలు ఇలాంటి కేసుల్లో అత్యంత క్రూరంగా గతంలో బిహేవ్ చేసిన దుర్మార్గపు పార్టీ అది… ఇప్పుడు నీ మీద పోస్టర్లు, ప్రచారం, సోషల్ స్మియర్ క్యాంపెయిన్… చివరకు జడ్జి మీద కూడా…
నీ సొంత పార్టీలోనే నువ్వంటే పడని కేరక్టర్లు బోలెడు… ఒక ఫాస్ట్, ఒక సాఫ్ట్ కలిస్తే సంజయ్ ఎంత, చూసుకుందాం అనే ప్రచారాలు నీదాకా రాలేదా..? సరే, ఇదంతా పొలిటికల్ కుట్రే అనుకుందాం… అమ్మాయివాళ్లు కూడా స్థితిమంతులే కాబట్టి 5 కోట్లకు బ్లాక్ మెయిల్ అనే నీ ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మలేదు… అసలు పోక్సో కేసు తీవ్రత ముందు హానీట్రాప్ అసలు కేసేనా..?
అసలు నువ్వు ఒక ప్రమాదం ఊహించలేదు… నీ కొడుకు మీద ఓ కన్నేసి ఉంచబడిందని..!! తన గుణం తననూ నిన్నూ నేల మీదకు ఈడుస్తుందని..!!
వర్తమానంలో ఏదైనా లైంగిక దాడి సంఘటనను చెబితే అమె మేజర్ అవుతుంది, అందుకే పాత తేదీల్లో, డిసెంబరు 31 సంఘటన అన్నారుట… అప్పటికి ఆమె మైనరేనట… ఎంత ప్లాన్డ్… మీవాళ్లే చెబుతున్నారు సుమీ… ఇద్దరూ కలిసి తిరిగారు, లవ్వు, బ్రేకప్పు మన్నూమశానం పక్కనపెడితే… మీవాడికి ఎలాగూ ఏ సోయీ లేదు… ఓసారి జైలుకు వెళ్తేనే తొవ్వలపడతడు అనుకోవాలి కదా నువ్వు… లేదు, అడుగడుగునా తప్పించాలని చూశావు…
ఎప్పుడైతే పోక్సో కేసు పెట్టబడిందో, నువ్వు డిఫెన్సులో పడిపోయావు… బదనాం అయిపోయావు… కొన్నాళ్లు కాపురం చేశాక కూడా, సహజీవనం చేశాక కూడా అబ్బాయిలపై అత్యాచారం కేసులు పడుతున్న రోజులివి… ఎప్పుడైతే పోలీసులు పోక్సో కేసులో అదనపు సెక్షన్లు పెట్టారో, అప్పుడే నీకు అర్థమై ఉండాలి…, ఆమె మేజరో, మైనరో తేల్చుకున్నాకే, వాంగ్మూలం తీసుకున్నాకే పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారని..!!
పోక్సో కేసు పెట్టగానే, భగీరథను పోలీసులకు అప్పగించేస్తే… చివరకు తన కొడుకును కూడా క్షమించలేదని, చట్టాన్ని గౌరవించాడని ఓ కేంద్ర హోం సహాయ మంత్రిగా నీకు పేరొచ్చేది… తరువాత బెయిల్ వచ్చేది… కాస్త సోయి కూడా వచ్చేది మీవాడికి… అన్నీ కుదిరితే వచ్చేసారి అదే కరీంనగర్ టౌన్ స్థానంలో మీవాడు ఎమ్మెల్యేగా కూడా పోటీచేసేవాడు… అఫ్‌కోర్స్, అయ్యకు తలవంపులు తెస్తున్నాననే భయభక్తులు కూడా లేవు మనవాడికి…’’
- కావచ్చు, ఓ కేంద్ర మంత్రికి సంబంధించి కేసు కదా, కాస్త ఆచితూచి, జాగ్రత్తగా వ్యవహరిద్దామని రేవంత్ రెడ్డి అనుకోవచ్చు గాక… కానీ ఓ బీజేపీ కేంద్ర మంత్రికి ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సహకరిస్తున్నడనే నిందను తనూ మోయలేడు… పైగా పోక్సో కేసు… చట్టం, సమాజం సానుభూతి అమ్మాయి వైపే ఉంటుంది… సో, తనూ ఏమీ చేయలేని స్థితి…
బండి ఉరుకుతున్నన్ని రోజులు బాగానే ఉంటుంది… కానీ బండి చక్రాల్లో కట్టెలు పెట్టి కూలగొట్టే మన ఇంటర్నల్ శక్తులు ఉంటాయి, ఉన్నాయి… ఇలాంటప్పుడు తగ్గేవాడే తోపు… కక్ష తీర్చుకుంటా, ఎవడినీ వదలను వంటి డైలాగులు నీ కడుపులోనే దాచుకుని…, నీ కొడుకు కారణంగా రోజులు బాగాలేని దుస్థితికి చేరుకున్నప్పుడు, అనివార్యంగా మౌనాన్ని ఆశ్రయించాల్సి ఉండాల్సింది… అక్కడా సంయమనం కోల్పోయావు.., జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడమూ అనవసరమే… ఎస్, నిన్ను అభిమానించే వాళ్లూ తలదించుకునే సిట్యుయేషన్…!
Share this Article