.
Subramanyam Dogiparthi ….. నిత్య పెళ్ళికొడుకు నూతన్ ప్రసాదుని 22 ఏళ్ళు వీల్ చైర్లో పడేసిన సినిమా ఈ బామ్మ మాట బంగారు బాట . తెర మీద తెర వెనుక కష్టపడే సినిమా వాళ్ళకూ చాలా వృత్తిపరమైన ప్రమాదాలు ఉంటాయి (occupational hazards) .
అమితాబ్ బచ్చన్ కూలీ సినిమాలో ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యారో మనందరికీ తెలిసిందే . లేత మనసులు సినిమాలో జరిగిన ఓ ప్రమాదం వలన జమునకు తల తిరుగుడు వచ్చిందని అంటారు . కెరీర్ మాంచి ఊపులో ఉన్న టైంలో ప్రమాదం జరిగి నడుం కింద భాగం చచ్చుబడిపోయి అద్భుతమైన కెరీర్ని పోగొట్టుకున్నారు నూతన్ ప్రసాద్ . విధి బలీయం .
Ads
తమిళంలో సక్సెస్ అయిన Paatti Sollai Thattathe సినిమాకు రీమేక్ మన బామ్మ మాట బంగారు బాట . తమిళంలో మనోరమ , పాండియన్ రాజన్ , ఊర్వశి , సిల్క్ స్మిత ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగులో భానుమతి , రాజేంద్రప్రసాద్ , గౌతమి , నూతన్ ప్రసాద్ , సిల్క్ స్మితలు ప్రధాన పాత్రల్లో నటించారు .
భానుమతి సినిమాలో ఉంటే పెద్ద పెద్ద నటులే చిన్నబోతారు . ఇంక అప్పుడప్పుడే పెద్దవుతున్న రాజేంద్రప్రసాద్ ఏం ఆగుతాడు !! సినిమాకు షీరో భానుమతే . టైటిలే ఆమె మీద ఉంది కదా ! క్లైమాక్సులో 64 ఏళ్ళ వయసులో , భారీ కాయంతో కర్ర సాము , ఫైటింగులు చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది .
టైటిల్ సాంగ్ ఢిల్లీకి రాజయినా బామ్మ మాటే బంగారు బాట అంటూ పాడి ప్రేక్షకుల చెవుల తుప్పు వదిలిస్తుంది . సిల్క్ స్మితతో టీజింగ్ సీన్లలో తన కులుకులతో , వంపులతో అదరగొట్టేస్తుంది . భానుమతి కోసమైనా ఈ సినిమా తప్పక చూడవలసిందే .
ఓ చిన్న ఊళ్ళో మోతుబరి కుటుంబం భానుమతి , నూతన్ ప్రసాదులది . వాళ్ళ ముద్దుల మనమడు పట్నంలో BA అయిదేళ్ళు చదివిన రాజేంద్రప్రసాద్ . అదే ఊరి అందాల బొమ్మ రైల్లో పరిచయం అయి , ప్రేమలోకి జారి , పెళ్లి చేసేసుకుంటారు .
బామ్మ ఆమోదించకపోవటంతో కట్టుబట్టలతో పట్నం వచ్చి ఓ లాయర్ ఆఫీసులో అవివాహితులం అని చెప్పి ఒకరికి తెలియకుండా ఒకరు ఉద్యోగం సంపాదించుకుంటారు . మనమడిని వెతుక్కుంటూ ముసలోళ్ళు పట్నం వస్తారు . బిడ్డను అద్దెకు ఇచ్చిన సిల్క్ స్మితను బామ్మ దబాయించి తరిమేస్తుంది .
సిల్క్ స్మిత భర్త బామ్మను , గౌతమిని కిడ్నాప్ చేస్తాడు . ఆ ఆటోని ఓ ప్రొఫెసర్ గారి సూపర్ కారుతో ఛేజ్ చేస్తారు . ఈ సూపర్ కార్ , ఛేజింగ్ అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది . విలన్ గేంగుతో బామ్మ ఫైట్ చేసి సినిమాను శుభాంతం చేస్తుంది . మనమడికి , మనుమరాలికి ఓ అబ్బాయి ఓ అమ్మాయి కవలలుగా పుట్టడంతో సినిమాకు శుభం కార్డ్ పడుతుంది .
మంచి కామెడీ వినోద చిత్రం . జంధ్యాల హాస్యభరిత సంభాషణలు , ముఖ్యంగా భానుమతి డైలాగులు , ప్రేక్షకులను రంజింప చేస్తాయి . సంగీత దర్శకుడిగా టైటిల్సులో చంద్రబోస్ పేరు కనిపిస్తుంది . ఈ చంద్ర బోస్ ఇప్పటి చంద్రబోసేనా లేక మరో చంద్రబోసా నాకు తెలియదు . ఒకరే అయితే చంద్రబోసుకి ఇదే మొదటి సినిమా అయిఉండాలి .
పాటలన్నీ వేటూరి వారే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ శ్రావ్యంగా పాడారు . రాజేంద్రప్రసాద్ , గౌతమి డ్యూయెట్లు ; రాజేంద్రప్రసాద్ , సిల్క్ స్మిత గ్రూప్ డాన్స్ చాలా అందంగా హాటుగా చిత్రీకరించబడ్డాయి . అన్నీ బాగుంటాయి .
చెన్నాపట్నం మఛిలీపట్నం , ప్రేమలో చిలకల మడుగు , సలాం అంటూ సాగుతాయి పాటలు . రెండు భాషల్లోనూ నిర్మాతలు AVM వారే . దర్శకుడు రాజశేఖర్ . ఇతర ప్రధాన పాత్రల్లో పద్మనాభం , సుత్తి వేలు , బ్రహ్మానందం , పొట్టి ప్రసాద్ , ప్రియాంక , సాక్షి రంగారావు , ఆనందరాజ్ తదితరులు నటించారు .
సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . చక్కటి వినోద భరిత చిత్రం . గౌతమి సౌకుమార్యం బాగుంటుంది . నేను పరిచయం చేస్తున్న 1240 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article