.
Mohammed Rafee …. మిత్రమా… ఇందుకే నేను స్పందించలేదు! ‘‘అన్నా ఘోరమే, అందరి గురించి రాస్తావు, మీ ఆంధ్ర రచయిత బొగ్గుల శ్రీనివాస్ చనిపోతే, చం*పేస్తే ఒక్క ముక్క రాయలేదు అని ఒక యూనివర్సిటీ మిత్రుడు ఫోన్ చేశాడు.
“ఇంకేంటి విషయాలు” అని టాపిక్ కట్ చేశాను. ఇంకొందరు ఫోన్ చేసి “శ్రీనివాస్ హ*త్య వెనుక పవన్ కళ్యాణ్ చెయ్యి వుంది. దమ్ముంటే రాయండి” అన్నారు. నవ్వి ఊరుకున్నాను! మొత్తానికి పోలీసులు త్వరగా తేల్చి పడేసారు.
Ads
బొగ్గుల శ్రీనివాస్ ఆంధ్రకు చెందిన వారు, లేదా తెలంగాణలో జీవిస్తున్న వారు అనేది అసలు అనవసరమైన టాపిక్! అతను ఎక్కడివాడైనా ఒక్కటే! ఎవ్వరికి ఏదీ శాశ్వతం కాదు! అందరూ ఒక్కటే! తెలంగాణ అయితే ఏంటి? ఆంధ్ర అయితే ఏంటి? ఎందుకు ప్రతి విషయానికి ప్రాంతాలు ఎత్తి చూపిస్తారు?
అతను సరదా మనిషి! అందరినీ కలుపుకుపోయే స్నేహశీలి! బతుకు తెరువు కోసం మిత్రుడు మాటలు నమ్మి అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసపోయి, మిత్రుడి చేతిలో చా*వు దెబ్బ తిని దారుణంగా కనుమూసిన మనిషి! అతడి జీవితం ఇలాంటి అక్రమ సంపాదనపరులకు ఒక గుణపాఠం!
పవన్ కళ్యాణ్ హఠావో అంటూ ఒకే ఒక్క పుస్తకం రాసి, పలుసార్లు పబ్లిష్ చేయించుకుని డబ్బులు సంపాదించుకున్నాడు! అతనికి అభ్యుదయ భావజాలం ఉంది కూడా..! భాగ్యనగరంలో బతకాలంటే ప్రతి నెలా డబ్బు అవసరమే. యూనివర్సిటీలోనే పరిశోధకుడిగా చాలా ఏళ్ళు గడిపినా, మిత్రుడితో జిఎస్టీ అక్రమ వసూళ్లకు చేతులు కలిపి కోటి రూపాయల పెనాల్టీ ఎదుర్కొన్నాడు! ఆదాయపు పన్ను శాఖ నుంచి అనేక సార్లు నోటీసులు అందుకుని చివరకు బ్లాక్ లిస్ట్ లోకి చేరుకున్నాడు! ఇరువురి మధ్య 30 లక్షల వివాదం ప్రాణం పోగొట్టుకునేలా చేసింది! అదీ సుపారీ హత్య…
తన గురించి ఒక పుస్తకం రాస్తే దానికి బెంబేలు పడిపోయి మనిషిని చం*పేంత దుర్మార్గపు ఆలోచనలు పవన్ కళ్యాణ్ కు ఉంటాయా? పైగా అది రాసి ఎన్నో ఏళ్లయింది. శ్రీనివాస్ చనిపోయిన వార్త విన్న నిముషాల్లోనే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ దోషి అంటూ ఇష్టం వచ్చిన రాతలు రాసేసారు. యూ ట్యూబర్లు చెలరేగిపోయారు. నిజం నిలకడగా తెలుస్తుంది! అదే నిన్న తెలిసింది! పవన్ కళ్యాణ్ కు శ్రీనివాస్ హ*త్యకు ముడిపెట్టిన రాతగాళ్లు ఇప్పుడేం జవాబు చెబుతారు! జస్ట్ ఆస్కింగ్!
బొగ్గుల శ్రీనివాస్ నాకు సుపరిచితుడే! జోవియల్ గా ఉంటాడు! ఆ పుస్తకం వచ్చిన కొత్తలో మా ఆఫీస్ లో నన్ను కలసి ఒక కాపీ ఇచ్చి “కొంచెం రాయండన్నా” అన్నాడు! రాద్దామని చదివాను కానీ, చదివాక రాయాలనిపించలేదు.
అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ వివిధ అంశాలపై చర్చిస్తూ ఈ జిఎస్టీ అక్రమ వ్యాపారం విషయం కూడా చెప్పాడు. తాను క్లీన్ చిట్ అని, తన మిత్రుడు చేస్తున్న మోసానికి తన లైసెన్స్ మాత్రమే ఇస్తున్నానని, లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పాడు! అప్పుడే చెప్పాను ఏదో ఒక రోజు అడ్డంగా దొరికిపోతావని! చివరకు అందులో దొరికినా బయట పడగలిగాడు కానీ, మిత్రుడి లావాదేవీల్లో మోసపోవడమే కాకుండా ప్రాణం కోల్పోయాడు!
అడ్డదారులు ఎప్పుడు ఇలాంటి ఫలితాలనే ఇస్తాయి. అతను పాలేరు రిజర్వాయర్ లో ప్రమాదంలో చనిపోయాడని మీడియాలో వార్త వచ్చినా నేను నమ్మలేదు. పవన్ కళ్యాణ్ హ*త్య చేసాడని సోషల్ మీడియా కూసినా నేను పట్టించుకోలేదు. మిత్రుడు శ్రీనివాస్ చనిపోయాడనే బాధ ఉంది! కానీ, ఏం చేయగలం? ఇంకొకరు ఇలాంటి దారి ఎన్నుకోవద్దని చెప్పడానికే ఈ నాలుగు మాటలు! శ్రీనివాస్ కు శ్రద్ధాంజలి. – డా. మహ్మద్ రఫీ
Share this Article