Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!

June 24, 2026 by M S R

.

కొన్నాళ్లుగా సొసైటీ సీన్ మొత్తం మారిపోయింది… అంతకుముందు వరకట్న హత్యలు… ఇప్పుడు ప్రియుల కోసం, మదపిచ్చితో భర్తలను, పిల్లలను హతమార్చే బరితెగింపు… రోజూ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి… ఇన్నాళ్లూ మగపిశాచుల వార్తలే చదివాం, ఇప్పుడు మదపిశాచుల వార్తలు… మరీ ఈ కథయితే దారుణం… ముందే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబితే అయిపోయేది, కానీ పెళ్లి చేసుకుని మరీ హతమార్చింది, ఎస్, నేనే  చంపాను అని అంగీకరించింది…

అవును, రోజులు బాగాలేవు, అసలే భరణాలు, మనోవర్తిలు, విడాకుల కేసులు, గ‌ృహహింస కేసులు, లైంగిక దాడి కేసులతో మగాడు సున్నితంగా మారిపోయి, పెళ్లంటేనే ఆమడల దూరం పారిపోతున్నాడు… సహజమే, అవసరమే అనిపిస్తోంది… (మరోవైపు అసలు పెళ్లిళ్లే కష్టాలమయం అనుకుంటుంటే ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి, అయిదు వేలు ఇస్తాం, పది వేలు ఇస్తాం అనే సొల్లు, క్షుద్ర, డొల్ల కబుర్ల రాజకీయ నేతల పైత్యం సరేసరి…)

Ads

కేతన్

సరే, ఈ కథలోకి వద్దాం… పుణేకు (Pune) చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ (26)… లోహగడ్ ఫోర్ట్ (Lohagad Fort) వద్ద ఫోటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడు… అని అందరూ మొదట్లో భావించారు… కానీ అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ (Murder)…

కాబోయే భార్య, ఆమె ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టారు… ఇది తెలిసి రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి…. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పుణేలో పెద్ద బిల్డర్… కేతన్‌కు 20 ఏళ్ల సియా గోయల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ (Engagement) జరిగింది… నవంబర్ 25న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు…

దీనికోసం ఏకంగా రూ. 17 కోట్లు వెచ్చించి జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌ను బుక్ చేశారు… బంధువులను తీసుకెళ్లేందుకు రెండు చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా రెడీ చేశారు… అంతా సంతోషంగా పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా, జూన్ 18న కేతన్ మరణవార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది… సియా అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో ఉంది… కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది… ఎగ్జిక్యూట్ చేసింది…

  • నోరు విప్పితే పోయేదానికి నరరూప రాక్షసత్వం…: “పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది, క్యాన్సిల్ చేసుకునేవాళ్లం కదా!” అంటూ ఆ తల్లిదండ్రులు పెడుతున్న రోదనలు వింటే ఎవరి గుండైనా కరుగుతుంది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు వద్దనుకోవడం, ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం పెద్ద వింతేమీ కాదు. కానీ, ప్రియుడి మోజులో పడి, తండ్రి సంపాదనను చూసి వ్యామోహంతోనో లేదా ఎదురుచెప్పే ధైర్యం లేకో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం ఏ రకమైన మానసిక పైశాచికత్వం?

  • క్షణిక సుఖం కోసం దారుణమైన ముగింపు…: కేతన్‌ను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని సియా, ఆమె ప్రియుడు చేతన్ భావించారు…. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? పెళ్లి ఆగిపోయింది, ప్రియుడితో జీవితం లేదు సదా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది…

  • కాబోయే భర్త, ప్రియుడు, ఈ కాబోయే పెళ్లాం, అందరూ సినిమా హీరోహీరోయిన్లను తలదన్నేలా ఉన్నారు. చదువుకున్నారు, ఆస్తులకు ఢోకా లేదు… కానీ..? మదం… మదం… దాంతో చెలరేగే పైశాచికత్వం..!!

కేతన్

2. అతి నమ్మకం.. పైశాచికత్వాన్ని అంచనా వేయలేకపోవడం! ఈ కథలో అత్యంత బాధాకరమైన, విస్తుపోయే అంశం ఏంటంటే.. కేతన్ తన కాబోయే భార్యను గుడ్డిగా నమ్మడం. తనపై జరిగిన మొదటి హత్యాయత్నాన్ని కూడా అతడు గ్రహించలేకపోయాడు.

  • మొదటి ప్రయత్నం (జూన్ 14)…: ట్రెకింగ్ పేరుతో లోహగడ్ ఫోర్ట్‌కు తీసుకెళ్లి కొండ అంచు నుంచి తోసేస్తే… అదృష్టవశాత్తూ చెట్టు కొమ్మ చిక్కి కేతన్ బతికాడు… “పాము కరవబోతుంటే కాపాడటానికి నెట్టాను” అని సియా అబద్ధం చెప్తే, ప్రేమికురాలి మాటల్ని నమ్మి కాబోయే భార్య తన ప్రాణాలు కాపాడిందని మురిసిపోయాడు…

  • రెండో ప్రయత్నం (జూన్ 18)…: కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే, మళ్లీ అదే లొకేషన్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటూ పిలిస్తే… ఎలాంటి అనుమానం లేకుండా వెళ్లాడు. అక్కడ ప్రియుడితో కలిసి ఆమె 400 అడుగుల లోయలోకి నెట్టేస్తుంటే, తాను ప్రాణంగా భావించిన అమ్మాయే తన పాలిట యముడు అవుతుందని ఆ యువకుడు ఊహించి ఉండడు…

గమనించాల్సిన విషయం…: ప్రేమలో పడినప్పుడు భాగస్వామి ప్రవర్తనలోని ప్రమాదకరమైన మార్పులను, హెచ్చరికలను (Red Flags) చాలామంది గమనించరు… అతి నమ్మకం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని చెప్పడానికి కేతన్ ఘటనే ఉదాహరణ…

సాంకేతికత పెరిగింది, మేం లొకేషన్ మార్చేస్తాం, వేరే వాళ్ల ఫోన్లు వాడుతాం, పోలీసులకు దొరకం అని నిందితుడు చేతన్ చౌదరి వేసిన ‘మాస్టర్ ప్లాన్’ను పుణే రూరల్ పోలీసులు (2004 కాల్స్ డేటా, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌తో) బద్దలు కొట్టారు. చట్టం ముందు ఏ నేరస్థుడూ తప్పించుకోలేడు. పట్టుబడ్డాక ఆమె ఏం చెప్పిందో తెలుసా..? ‘ఎస్, నేనే చేశాను’….

చివరగా…: డబ్బు, హోదా, అందం అన్నీ ఉన్నా.. నమ్మకద్రోహం ముందు కేతన్ అగర్వాల్ ప్రాణాలు నిలవలేదు… తప్పు చేసిన సియా, చేతన్‌లకు కఠిన శిక్ష పడాల్సిందే. కానీ, యువతరం బంధాల విలువను, ప్రాణం విలువను గుర్తించనంత కాలం ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి. నిన్న శ్రద్ధా వాకర్.. నేడు కేతన్ అగర్వాల్.. రేపు ఇంకెవరో కాకూడదంటే, బంధాలలో గుడ్డి నమ్మకం కంటే విచక్షణ చాలా అవసరం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!
  • అమ్మ కాగానే ఆట మానేయాలా? మరేం చేయాలి? ఇదీ 6R ఫార్ములా!
  • విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”
  • చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్!
  • KCR’s Voice – ఆ మంత్రి కడిగేశాడట- ఈయన చూశాడట !!
  • జంబలకిడిపంబ! కాన్సెప్టే బ్లాక్‌ కామెడీ, ఆపై ఈవీవీ మార్క్!!
  • Nagabandham … పెద్ద పేరున్న టీమ్ కాదు- కానీ పాన్ ఇండియా బజ్!
  • TMC Crisis – మమత సెల్ఫ్‌గోల్! అష్ట దిగ్బంధనంలో అభిషేక్!
  • 12 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు? – బ్రిటన్ రాజకీయాల ‘నగుబాట’
  • కామాఖ్య..! అంబుబాచీ రోజులు..! రజస్వల కాదు, రుతుస్రావం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions