.
ఆహా ఏం రుచి, తినరా మైమరిచి…. అని వంకాయ కూరను వర్ణించాడు ఓ సినిమా కవి… కానీ దోశకు సరిగ్గా వర్తిస్తుంది అది… ఆన్‌లైన్‌లో దోశల యూట్యూబ్ వీడియోలు, మీమ్స్, షార్ట్స్, వందల రకాల తయారీ పద్ధతుల వీడియోలు ఎన్ని వేలు ఉంటాయో లెక్కలేదు… ఎస్, దోశ అల్పాహారాల్లో రారాజు… సౌత్ ఇండియాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు…
జొమాటో, స్విగ్గీ, హోటళ్లకు స్ట్రెయిట్ ఆర్డర్లు… ఏవి తీసుకున్నా సరే, బిర్యానీ తరువాత స్థానం దోశలదే… జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి సంస్థలు ప్రతి సంవత్సరం విడుదల చేసే రిపోర్టుల (ఉదాహరణకు Swiggy’s StatEATstics) ప్రకారం… భారతదేశంలో ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్ చేయబడే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్‌లలో మసాలా దోశ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది…
Ads
ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ప్రతి నిమిషానికి వందల సంఖ్యలో దోశ ఆర్డర్లు నమోదవుతుంటాయి…. ప్లెయిన్ దోశ, మసాలా దోశలతో పాటు సెట్ దోశ, మైసూర్ మసాలా దోశ వంటి రకాలు ప్రజల ఛాయిస్‌గా మారుతున్నాయి…
దోశకున్న మరో విశేష గుణం… ఇది ఫర్మెంటెడ్… పులిసిన ఆహారం ఎప్పుడూ మంచిదే… ప్రొబయాటిక్స్… పైగా కార్బ్స్ ప్లస్ ప్రొటీన్ల మేలు కలయిక… ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారా..? ఉంది, ఓ సందర్భం ఉంది… ఆ వార్త ఇదుగో…

భారతీయ వంటకాల వైవిధ్యం మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది… అంతర్జాతీయ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ (TasteAtlas) – 2026 విడుదల చేసిన ప్రపంచంలోని అత్యుత్తమ పాన్‌కేక్‌ల జాబితాలో ఏకంగా 11 భారతీయ వంటకాలు చోటు సంపాదించుకున్నాయి.. విదేశాల్లో పాన్‌కేక్ అంటే కేవలం తీపి పదార్థంగానే చూస్తారు, కానీ మన దేశానికి చెందిన కారంగా, మసాలాలతో ఉండే దోశలు వారిని మంత్రముగ్ధులను చేశాయి…
అగ్రస్థానంలో మసాలా దోశ… ఈ జాబితాలో మసాలా దోశ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది… 4.3 స్టార్ రేటింగ్‌తో ఇది గ్లోబల్ టేబుల్‌పై తన సత్తా చాటింది… కేవలం మసాలా దోశే కాకుండా మరికొన్ని రకాలు కూడా సత్తా చాటాయి…
-
క్లాసిక్ దోశ…: 15వ స్థానం
-
పేపర్ దోశ…: 35వ స్థానం
దక్షిణాది రాష్ట్రాల వంటకాలతో పాటు తూర్పు భారతానికి చెందిన ‘పిఠా’ (మన ఆవిరి కుడుముల టైపు) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది…
-
అప్పం…: 60వ స్థానం
-
పెసరట్టు (Pesara Dosa)…: 63వ స్థానం
-
ఉతప్పం…: 74వ స్థానం
-
నీర్ దోశ…: 84వ స్థానం
-
మాల్‌పువా (తీపి పాన్‌కేక్)…: 85వ స్థానం
-
రవ్వ దోశ: 96వ స్థానం
-
పిఠా…: 98వ స్థానం
‘పెసరట్టు’ ప్రస్తావన వచ్చింది కదా, అది కేవలం పాన్‌కేక్ మాత్రమే కాదు, ‘ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి’గా కూడా గుర్తింపు పొందింది… ఆంధ్రా స్పెషల్ ‘పెసరట్టు-ఉప్మా’ కాంబినేషన్ గురించి మరోసారి చెప్పుకుందాం…
పాశ్చాత్య దేశాల్లో పాన్‌కేక్‌లను మేపుల్ సిరప్‌తో తింటారు… కానీ మన భారతీయ దోశలు పులియబెట్టిన పిండితో తయారవుతాయి… కొబ్బరి చట్నీ, కమ్మని సాంబార్‌తో వీటిని ఆరగించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది… లాట్వియాకు చెందిన ‘కార్టుపెలు పంకుకాస్’ (బంగాళాదుంప పాన్‌కేక్) ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది… స్టివార్డ్ బ్రదర్, మసాలా దోశ మరో ప్లేట్ ఆర్డర్ ప్లీజ్…
Share this Article