మా బతుకుదీపాలకు వారి ప్రాణదీపాలు అడ్డుపెట్టారు
సినిమా కథల్లో పోలీసులు సూపర్ హీరోలన్నా అయి ఉంటారు. లేదా పరమ విలన్లయినా అయి ఉంటారు. మనుషులుగా మాత్రం ఉండరు. అది సినిమా కెమెరా దృష్టి దోషం. నిజజీవితంలో పోలీసు పోలీసుకావడం కంటే ముందు మనిషి. మామూలు మనిషి. మూగమనసులో ఆత్రేయ చెప్పినట్లు వారికీ-
నలుగురిలా మనసుంది.
అందరిలా ఆశలున్నాయి.
మిగతావారిలా కలలుకనే కళ్లున్నాయి.
డ్యూటీలయ్యాక ఇళ్ళకెళితే కుటుంబాలున్నాయి.
కలతపడితే కన్నీళ్ళున్నాయి.
పోలీసులు మాను మాకులు కారు. మనలాగే మనుషులు.
కుటికోసమే కోటి విద్యలు. పోటీ పరీక్షలు రాసి రాసి, శిక్షణలో పరుగెత్తి పరుగెత్తి, ఎగిరి దూకి ఒళ్ళు హూణమయితే అప్పుడు ఒంటిమీదికి ఖాకీ డ్రెస్ వచ్చింది. చేతిలోకి లాఠీ వచ్చింది. నడుము బెల్ట్ కు తుపాకి వచ్చింది.
కరోనా కొట్టిన దెబ్బ మొదట పోలీసులకే తగిలింది. హైదరాబాద్ సిటీ పోలీసుల్లో డ్యూటీలో భాగంగా తిరిగిన వందలమంది కరోనా బారిన పడ్డారు. వారిలో 34 మంది చనిపోయారు. మృతులకు స్మృత్యంజలి ఘటించడానికి నగర పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
Ads
ఈ వార్తలో కన్నీళ్లు ఇంకిన విషాదం ఉంది. ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంటున్న విషాదమూ ఉంది. చెట్టంత మనిషి తోడులేని జీవితంఎండిన చెట్టులా తోచే నైరాశ్యం నిండిన విషాదమూ ఉంది. జనం రక్షణకు కవచంలా నిలుచున్న పోలీసులను కరోనా మింగేసింది అంటే- జనాన్ని రక్షించడంలో వారు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు అని అర్థం. మన భద్రతకు వారి ప్రాణాలను అడ్డుపెట్టారు.
అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ- ఈ ముప్పయ్ నాలుగు ప్రాణాలు ఒక కారణం కోసం పోయాయి. ఒక కర్తవ్యం కోసం పోయాయి.
పోయినోళ్లు అందరూ మంచోళ్లు.
ఈ ముప్పయ్ నాలుగు మంది కూడా చాలా మంచోళ్లు.
ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు.
జనదీపాలు ఆరిపోకుండా తమ ప్రాణదీపాలను అడ్డుపెట్టిన పోలీసు జ్యోతులు.
చేతులు జోడించి నమస్కారం పెట్టి, కంట్లో తడిపెట్టుకోవడం తప్ప మీ రుణం తీర్చుకోలేని నిరుపేదలం మేము.
– పమిడికాల్వ మధుసూదన్
Share this Article