.
బయటికి పోలీసులు చెప్పే కథలు వేరు… ఏదో అప్పటికప్పుడు బాహుబలి రాజమౌళికి, ఆయన డాడీ విజయేంద్రప్రసాద్‌కు దీటుగా ఏదో కథ రాస్తారు… మీడియా గుడ్డిగా కళ్లకద్దుకుని బహుళ ప్రచారంలోకి తీసుకొస్తుంది… కానీ ఎప్పటికప్పుడు నిజాలు దాచబడి, కప్పబడి, కాలగతిలో కనుమరుగైపోతుంటాయి…
కొన్నిసార్లు మాత్రమే ఏ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టరో లేదా కేసు అనుమానాస్పదంగా తోచి ఇంకెవరైనా బయటికి తీసుకొస్తేనే కథ మలుపులు తిరుగుతుంది… అఫ్‌కోర్స్, తక్షణ సెన్సేషన్ ప్రాధాన్యంగా మారిన మీడియా పోకడల్లో… తరువాత లైట్ తీసుకుని, ఫాలోఅప్ పట్టని క్రైమ్ కవరేజీల పుణ్యమో… క్రైమ్ స్టోరీల కథే మారిపోతోంది…
Ads
ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏదో కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కు అడిక్టయ్యారు, ఆ గేమ్‌లో చెప్పినట్టు ఓ దశకు రాగానే ఆత్మహత్య చేసుకున్నారు అని ఓ ప్రాథమిక కథనం… తరువాత మేం కొరియన్లలాగే బతకాలని అనుకుంటున్నాం అని తండ్రికి ఏదో సూసైడ్ లేఖ రాసినట్టు అనుబంధ కథనం…
దీని ఆధారంగా కొరియన్ గేమ్స్ మీద పుంఖానుపుంఖాలుగా కథనాలు, ప్రమాద హెచ్చరికలు… ముద్దొచ్చే ముగ్గురు ఆడపిల్లల సామూహిక ఆత్మహత్య దేశవ్యాప్తంగా జనం మనస్సులను కలిచివేసింది… నిజమే, ఆన్‌లైన్ గేమ్స్ ప్రమాదకరమే గానీ… ఈ కథలో మాత్రం చాలా సందేహాస్పద అంశాలున్నాయి… అసలు విలన్ ఆ పిల్లల తండ్రే… పలు తాజా కథనాలు ఏం చెబుతున్నాయంటే…
వాళ్లు ఆల్రెడీ చనిపోయారు, లోకల్ మీడియాలో వాళ్ల పేర్లు, వయస్సు సహా అన్ని వివరాలూ రాసేస్తున్నారు… కానీ తెలుగు మీడియా మాత్రం అద్భుత పాత్రికేయ ప్రమాణాలు పాటిస్తున్నట్టు ఆ పిల్లల కళ్లకు నల్ల గంతలు పెట్టేసి, అంటే కలర్ పూసేసి… ఫోటోలు, వీడియోలు పెట్టేస్తున్నారు…

సరే, అసలు కథలోకి వెళ్దాం… కొరియన్ గేమ్, తండ్రి వాళ్ల స్మార్ట్ ఫోన్లు లాగేసుకున్నాడు, దాంతో వాళ్లు హర్టయి సూసైడ్ చేసుకున్నారు అనేది హంబగ్… అసలు ఈ విషాద కథలో విలన్ తండ్రే…
“కొరియన్ గేమ్” అనేది కేవలం ఒక చిన్న అంశం మాత్రమే… దీని వెనుక అత్యంత భయంకరమైన, చిక్కుముడి ఉన్న కుటుంబ కథ ఉంది… లోతైన కథనాలు, పోలీసు విచారణలోతాజాగా వెలుగులోకి వచ్చిన, వస్తున్న అసలు నిజాలు వేరు…
1. ఒక తండ్రి “ముగ్గురు భార్యలు”
తండ్రి చేతన్ కుమార్‌కు ముగ్గురు భార్యలు… ఇందులో మొదటి ఇద్దరు భార్యలు (సుజాత, హీన) సొంత అక్కాచెల్లెళ్లు… మూడవ భార్య టీనా, గతంలో అతని వద్ద పని చేసే ఉద్యోగి… వీరిలో ఇద్దరు ఒకే ఇంట్లో, అది కూడా ఒకే గదిలో నివసిస్తున్నారనే విషయం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది… ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఒకే గదిలో పడుకోవడం ఆ పిల్లల మానసిక స్థితిని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు…
2. గతంలో “సహజీవనం”- అనుమానాస్పద మృతి
చేతన్ కుమార్‌కు గతంలో ఒక ప్రియురాలు (Live-in partner) ఉండేది… 2015లో ఆమె కూడా బిల్డింగ్ పైనుంచి పడి అనుమానాస్పదంగా మృతి చెందింది… అప్పట్లో అది ఆత్మహత్యగా కేసు మూసేశారు… అలాగే ఆరు- ఏడేళ్ల క్రితం, తన పెద్ద కూతురు పుట్టినరోజున, అతని మరదలు (ప్రస్తుత రెండో భార్య మరో చెల్లెలు) కూడా ఇదే విధంగా బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయిందట… ఒకే ఇంట్లో ఈ ఆత్మహత్యలు జరగడం వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉందని పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు…
3. పిల్లల “బందీ” జీవితం
ఆ ముగ్గురు అమ్మాయిలు గత మూడేళ్లుగా అసలు స్కూలుకు వెళ్లడం లేదు… కరోనా తర్వాత తండ్రి వారిని చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచేశాడు… వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు…
-
“మేము చాలా ఒంటరిగా ఉన్నాం” అని గోడల మీద రాసుకున్నారు…
-
తండ్రి పెట్టే ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో నిరంతరం జరిగే గొడవల వల్ల వారు మానసిక ఒత్తిడికి గురయ్యారు…
-
చివరికి వారికి తోడుగా ఉన్న ఫోన్లను కూడా తండ్రి లాక్కొని అమ్మేయడంతో, తమకు ఇష్టమైన “కొరియన్ ప్రపంచం” కూడా దూరమైందనే బాధలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు…
4. కోట్ల అప్పులు- కుటుంబ కలహాలు
చేతన్ కుమార్‌కు సుమారు 2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి… ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల ఇంట్లో వాతావరణం ఎప్పుడూ నరకంలా ఉండేదట… మూడవ భార్య టీనా విషయంలో మొదటి ఇద్దరు భార్యలకు, అలాగే పిల్లలకు మధ్య తీవ్రమైన గొడవలు ఉండేవని సమాచారం… ఆ అమ్మాయిలు తమ చిన్న చెల్లెలికి కొరియన్ సంస్కృతి నేర్పుతుంటే, ఇంట్లోని పెద్దలు దాన్ని వ్యతిరేకించి ఆమెను కూడా తమకు శత్రువుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ డైరీలో రాశారు…
5. పోలీసుల అనుమానం
పోలీసులు ఇప్పుడు తండ్రి చెబుతున్న “కొరియన్ గేమ్” వాదనను పక్కన పెట్టి, అతని నేర నేపథ్యం, పాలిగమీ (బహుభార్యాత్వం) వల్ల ఏర్పడిన కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టారు… తండ్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గేమ్స్ మీద నెపం తోస్తున్నాడా? అనే కోణంలో విచారణ జరుగుతోంది…
మొత్తానికి, ఇది కేవలం గేమ్ అడిక్షన్ వల్ల జరిగిన మరణం కాదు, ఒక వ్యక్తి వికృత ధోరణి, గందరగోళమైన కుటుంబ పరిస్థితుల్లో నలిగిపోయి ముగ్గురు ఆడపిల్లలు బలయ్యారు… ఐనా సరే, ఇంకా ఏవో అస్పష్ట సందేహాలు ఉన్నట్టు, లాజిక్ కుదరడం లేదు అనిపిస్తోంది కదా... అవును, అవే బయటపడాల్సి ఉంది..!!
Share this Article