.
మరో రెండు టరమ్స్ నేనే ప్రధానిని… అని మోడీ తనను కలిసినవాళ్లతో చెబుతున్నాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చాడు ఈరోజు కొత్త పలుకు వ్యాసంలో… అంటే ఇప్పటికే తనకు 75 ఏళ్లు… అంటే 90 ఏళ్లు వచ్చే దాకా తనే ప్రధానిగా ఉండగలడా అని కూడా హాశ్చర్యపోయాడు… ‘ఈ శతాబ్ది’ నాదే అని మోడీ ధీమాగా పలు పార్టీల నాయకులతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… నిజమో కాదో మోడీ చెప్పడు, ఖండించడు కానీ..?
నిజానికి 75 ఏళ్లు దాటాక బీజేపీలో ఎంత ప్రముఖ నాయకుడైనా సరే, మార్గదర్శక మండలిలో గౌరవంగా కూర్చోబెడతారు… అంటే మర్యాదగా తప్పిస్తారు… అడ్వానీ దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషి దాకా చాలా మంది ఇలాగే తప్పించబడ్డారు… మోడీకి ప్రస్తుతం 75 ఏళ్లు… మరో మూడేళ్లు ఎలాగూ ప్రధానిగా తనే ఉంటాడు… అంటే 78 ఏళ్లు… మార్గదర్శక మండలికి వెళ్లిపోవాలనే అలిఖిత నియమం నుంచి తనకు మినహాయింపు ఉంటుందా, కాలం చెప్పాలి…
Ads
బీజేపీ మీద మోదీ అమోఘమైన పట్టు నిజమే కానీ… అన్నీ తను అనుకున్నట్టు జరగవు, బీజేపీ పద్ధతి వేరు… కానీ ఒకటి మాత్రం నిజం… జాతీయ రాజకీయాల్లో, రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్టును మాత్రం మోడీ ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తున్న మాట నిజం… అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో కునారిల్లుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయాంశాలపై ఓ ఐడియాలజీ గానీ, ఓ దృక్పథం గానీ ఏమీ ఉండటం లేదు… డబ్బు, అధికారం యావ తప్ప..!
ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ పని అయిపోయినట్టే ఇక… రీసెంట్ పరిణామాల్లో నితిశ్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు, బీహార్‌లో బీజేపీ మరింత బలపడి, జేడీయూ కాలక్రమేణా కనుమరుగు కావడం ఖాయం… శివసేన సంగతి చూశాం, ఎన్సీపీ సంగతీ అంతే… బీహార్‌లో ఆర్జేడీ, యూపీలో ఎస్పీ ఈరోజుకూ కోలుకోవడం లేదు… కొన్ని ఉదాహరణలు ఇవి…
మోడీతో పెట్టుకుని, దెబ్బతిని, మళ్లీ ఎలాగోలా మోడీ ప్రాపకం సంపాదించి చంద్రబాబు కోలుకున్నాడు, తేరుకున్నాడు… కేసీయార్ దెబ్బతిని ఇంకా కోలుకోలేదు, మోడీ ప్రాపకం కోసం ఏవేవో ప్రయత్నాలు… ఈ ఇద్దరూ ఓ దశలో మోడీని విపరీతంగా ఆడిపోసుకుని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినవాళ్లే… కేసీయార్ అయితే ఏకంగా ప్రధాని పదవినే ఆశించాడు… సరే, ఎఐడీఎంకే ప్రస్తుతం బీజేపీ అనుబంధ పార్టీగా మారిపోయింది… ఎటొచ్చీ డీఎంకే, టీఎంసీలు మాత్రమే బలంగా నిలబడి, మోడీ దెబ్బల నుంచి తమను తాము కాపాడుకున్నాయి…
జేఎంఎం వంటివీ ఉన్నా, మరీ బలంగా ఏమీ లేవు… మోడీ ఒక్కొక్కటీ నరుక్కుంటూ వస్తున్నాడు… ఈసారి బెంగాల్ గనుక బీజేపీ కైవసం అయితే ఇక టీఎంసీకి చుక్కలు చూపిస్తాడు… అస్సోం సంగతి తెలిసిందే కదా… సీఎం హిమంత ఎంతగా పాతుకుపోయాడో… హిమంత, యోగి, ఫడ్నవీస్… ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో బలమైన నాయకుడిని తయారు చేసి, పార్టీని పటిష్టం చేస్తూ… అవసరమైనచోట్ల ప్రాంతీయ పార్టీలను వాడుకోవడం, తరువాత తప్పించడం… ఈ కార్యాచరణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… బీజేపీ లైన్ అది, మోడీ సొంత కార్యాచరణ కాదు…
ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఎంతగా మోడీ పాపులారిటీ పట్ల అసహనంగా ఉన్నాసరే, ఇప్పటి బీజేపీ స్థితికి ప్రధాన కారకుడు మాత్రం కచ్చితంగా మోడీయే… మరో రెండు టరమ్స్ ఉంటాడా లేడానే చర్చ వదిలేస్తే… భారత రాజకీయాల్లో తనకంటూ ఓ విశిష్ట అధ్యాయం మాత్రం లిఖించుకున్నాడు… బహుశా ఆ భావనే ‘ఈ శతాబ్ది నాది’ అనిపించిందేమో తనతో… పైగా తనకు దీటైన ప్రజాదరణ ఉన్న నేత మరొకరు కనిపించడం లేదు బీజేపీలో… అవసరాన్ని బట్టి యడ్యురప్పకు ఈ వయోపరిమితి నుంచి మినహాయింపులు ఇచ్చింది కదా పార్టీ…
జమిలి ఎన్నికల పరమార్థం కూడా ప్రాంతీయ పార్టీలను మరింత దెబ్బతీయడమే… సర్ ప్రక్రియ మీద నానారకాల విఫల పోరాటం చేసిన మమత, స్టాలిన్ తదితరులు కూడా రాబోయే పరిణామాల్ని అర్థం చేసుకుంటున్నారు, జమిలిపై ఆల్రెడీ వ్యతిరేక గళం విప్పుతున్నారు కూడా… లెఫ్ట్ కూడా నామమాత్రం అయిపోతున్న నేపథ్యంలో, రేపు కేరళలోనూ అధికారం కోల్పోతున్న స్థితిలో… ఇక రాబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలు కానున్నాయా..? రాహుల్ నాయకత్వం నుంచి బయటపడితే కాంగ్రెస్‌కు ఇంకాస్త మంచి రోజులు వస్తాయేమో..!
ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్య ఆలయ నిర్మాణం, తక్షణ ట్రిపుల్ తలాఖ్ రద్దు వంటివి స్థూలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో ఉన్నా అవి సాకారం అవుతాయా అనే సందేహం సంఘ్ కేడర్‌లోనే ఉండేది… అవి సాకారం అయిపోయాయి… కామన్ సివిల్ కోడ్ వంటివి కొన్ని బాకీ ఉన్నాయి… అవీ అవుతాయి… అందుకే మోడీపై మోహన్ భగవత్ ఎంత రుసరుసలాడినా సరే, ఆ ఆగ్రహ ప్రభావం మోడీపై ఏమీ కనిపించడం లేదు… మోడీ తనకు పడకపోతే ఎవరినైనా ఎలా శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడో సంఘ్ అనుబంధ వీహెచ్పీ తొగాడియాకు తెలుసు… మరి మోహన్ భగవత్..? కాలం చెబుతుంది…
చివరగా… నేను మరో ఆరు నెలలు ముఖ్యమంత్రిగా అదనపు కాలం పొందుతాను అని రేవంత్ రెడ్డి తన వాళ్లతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… అంటే జమిలి ఎన్నికల కోసం ప్రస్తుత శాసనసభ పరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తారని సారాంశం… కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నది అదనపు ఆరు నెలలు కాదు, 2029 లో కూడా నేనే అని..!! బీజేపీ, బీఆర్ఎస్ కలవకపోతే, బీజేపీలోని వర్గ తన్నులాటలు ఆగకపోతే జరిగేది కూడా అదే..!!
Share this Article