.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కీలకమైన ప్రశ్నను లేవనెత్తింది… మన చట్టాలు- నేరాలు- శిక్షలు- సంస్కరణల మీద నిజంగా ఓ పెద్ద డిబేట్ జరగాల్సిన అవసరమ ఉంది…
- ‘‘యాసిడ్ దాడి అత్యంత క్రూరమైంది… వరకట్న హత్యలకన్నా దారుణం… బాధితులకు పరిహారాలు అందాలి, అదే సమయంలో నేరగాళ్లకు ఈ శిక్షలు సరిపోవు, వాడి ఆస్తులన్నీ అమ్మేసి పరిహారాలు చెల్లించాలి… మరింత కఠిన శిక్షకు తగనట్టు చట్టాలు మార్చాలి…’’
మంచి ప్రశ్న, మంచి సూచన జస్టిస్… కానీ మన మొద్దు ప్రభుత్వాల చర్మాలకు చురక తాకొచ్చు, తాకకపోవచ్చు గానీ… తన ఆందోళన నిజం… హేతుబద్ధం… ఒక యాసిడ్ దాడి ఆ నిందితుడి సమస్యో, ఆ బాధితురాలి సమస్యో కాదు… ఇది మన సమాజం సమస్య…
Ads
దైహిక బాధ, మానసిక వేద, ఆర్థిక సమస్య, బయటికి రాలేరు… కుటుంబానికీ శిక్ష, బాధితురాలి భవిష్యత్తుకు శిక్ష, సొసైటీ చూపే దుర్భర సానుభూతి, లోలోపల కుమిలిపోతూ బాధితురాలు, ఆ కుటుంబం పడే క్షోభకు నిజంగా పరిహారం ఎవరివ్వగలరు..? పాపం శమించుగాక… దీనికన్నా చంపేయడం బెటర్…
- అంతటి నేరగాడికి బెయిల్ వస్తుంది, ఏళ్ల తరబడీ విచారణలు… అసలు శిక్ష రుజువు చేయడం ఓ సమస్య, ఏదో కాస్త శిక్ష పడినా, వాడు అలా అలా ఆ కాసింత కాలం గడిపేసి మళ్లీ వస్తాడు బయటకు… ధూర్తరాజకీయాలు సపోర్ట్ చేస్తే ముందుగానే వస్తాడు, డబ్బు పారేస్తే జైళ్లలోనూ దొరకనిది ఏముంది..? వాడు బయటికి వస్తే మరికొందరు బాధితులు తయారు..? మరెలా..?
ఎందుకంటే, ఆ నేరప్రవృత్తి మారదు, వాడు మారడు… మరేం చేయాలి..? మనది అసలే కసబ్ వంటి ఉగ్ర ధూర్తుడినే ఏళ్ల తరబడి పోషించిన న్యాయవ్యవస్థ… మరి యాసిడ్ దాడి నిందితులను ఉరితీస్తే..? కరెక్టు…
కానీ ప్రపంచంలో చాలా దేశాలు మరణశిక్షను నిషేధిస్తున్నాయి… శిక్ష సంస్కరణకు తప్ప నిర్మూలనకు కాదు అంటున్నాయి… నేరాన్ని శిక్షించాలి గానీ నేరగాడిని కాదు అంటున్నాయి… అంటే సంస్కరించాలని అంటున్నాయి… ఇస్తామిక్ దేశాలు మాత్రం ఈ చర్చ వేస్ట్, అలాంటి కేరక్టర్లను ప్రపంచం నుంచి పంపించేయాలని బహిరంగంగానే ఉరి తీస్తున్నాయి, రాళ్లతో కొట్టిస్తున్నాయి ప్రజలతో…
- మన దేశంలోనూ యాసిడ్ దాడి నేరగాళ్లకు ఇలాగే శిక్షించాలా..? ఇక్కడ బేసిక్ ప్రశ్న… నేరం- శిక్ష – సంస్కరణ…. నిజంగా మన శిక్షలు నేరగాళ్లను సంస్కరించేలా ఉన్నాయా.? మన జైళ్లు అలా ఉన్నాయా..? మన క్షుద్ర రాజకీయ వ్యవస్థ అలా ఉందా..?
ఆమధ్య ఐపీసీలు, సీఆర్పీసీలు మార్చినప్పుడే… యాసిడ్ దాడులకు కూడా కఠిన శిక్షలు చేర్చి ఉండాల్సింది… ‘‘నేరాన్ని ద్వేషించు- నేరగాడిని కాదు’’… ‘‘నేరాన్ని నిర్మూలిద్దాం- నేరగాన్ని కాదు’’… అనేది మాటలకే, ఆచరణలో అదేమీ ఫలవంతం కాదు, అలాంటి నేరగాళ్లకు మారరు, మారినా వాళ్లు ఈ సమాజానికి అక్కరలేదు అనుకుంటే… మోదీకి ఈ నిజం అర్థమైతే, జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల్లోని సూచన, సలహా అర్థమైతే… ఏదైనా తదుపరి యాక్షన్ ఉంటుంది..?

అసందర్భమో, సందర్భమో తెలియదు గానీ… ఇక్కడే మరో విషయమూ చెప్పుకోవాలి… పద్మ పురస్కారాలు పలు రంగాల్లో విశేష సేవలకు, ప్రతిభకు కదా ఇచ్చేది… మరి ఓ యాసిడ్ బాధితురాలు మంగళకపూర్‌కు పద్మశ్రీ ఇచ్చారేమిటనేది ఓ మిత్రుడి సందేహం…
కానీ ఆమెదీ ప్రతిభే… కుంగిపోకుండా, నిరంతరం పోరాడిన ధీశాలి… ఈ సమాజం మీద కోపం పెంచుకోకుండా సేవ చేస్తున్న ఔదార్యం, గొప్ప మనసు… అర్హురాలే… అందరూ గౌరవంగా కాశీలత అని పిలుచుకునే ఆమె కథ హృదయవిదారకం…
మంగళ కపూర్‌పై కేవలం 12 ఏళ్ల వయసులో (1965లో) యాసిడ్ దాడి జరిగింది…. ఒక వ్యాపార గొడవ కారణంగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు… భారతదేశంలోనే తొలి యాసిడ్ దాడి బాధితులలో ఆమె ఒకరు…
-
నరకయాతన…: ఆ దాడిలో ఆమె ముఖం పూర్తిగా వికృతమైపోవడమే కాకుండా కంటి చూపు కూడా దెబ్బతింది… ఆమె కోలుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 37 శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది…. దాదాపు ఆరేళ్ల పాటు ఆమె ఆసుపత్రి గదుల్లోనే గడిపింది…
-
సంగీత సాధన: తన గాత్రాన్నే ఆయుధంగా మార్చుకుని శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించింది… బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి రిటైరైంది… తన వైకల్యాన్ని జయించి, హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్‌లో (గ్వాలియర్ ఘరానా) చేసిన అపార కృషికి, తన ఇంట్లోనే విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఆమెకు పద్మశ్రీ… పద్మపురస్కారం తనను తాను గౌరవించుకుంది…
Share this Article