Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో రాజేంద్రప్రసాద్‌కు దీటైన ఓ హస్తి నటన – కాసింత ఎక్కువే !!

July 12, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … బుచుకి బుచుకి . కాట్రవల్లి . ఎంద చేట !! ఎక్కడ నుండి పట్టకొచ్చారో మా Divakara Babu Madabhushi గారు !! ఆయనే చెప్పాలి . మనకు జంధ్యాల , రేలంగి నరసింహారావు వంటి కామెడీ స్కూల్ మాస్టర్ల సినిమాలలో పాత్రలు చిత్రవిచిత్రంగా ఉంటాయి . ఆ స్కూల్ నుండి మరో మాస్టారు యస్ వి కృష్ణారెడ్డి . మూలకధ క్రెడిట్ నిర్మాత అచ్చిరెడ్డికి , యస్ వి కృష్ణారెడ్డికి చెందుతుంది కాబట్టి ఈ చిత్రవిచిత్ర పాత్రలను సృష్టించిన ఈ ఇరువురినీ అభినందించవలసిందే .

పాత్రలు బొమ్మల్లాంటివేగా . వాటిని నడిపించాలంటే మాటలు కావాలి . ఈ చిత్రవిచిత్ర పాత్రలకు తన శైలిలో అద్భుతమైన సంభాషణలను వ్రాసిన దివాకర్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందించాలి . ఎంద చేట డైలాగ్ ఆలీని వీర పాపులర్ చేసిపడేసింది .

Ads

జంతువులతో సినిమాలు తీయటంలో శేండో చిన్నప్ప దేవర్ సిధ్ధహస్తుడు .‌1971 లో ఆయన తీసిన హాథీ మేరీ సాథీ దేశమంతా ఒక ఊపు ఊపేసింది . అలాగే మన తెలుగులో పొట్టేలు పున్నమ్మ వంటి సినిమాలు సూపర్ హిట్టయ్యాయి . కుక్కలతో , ఆవులతో ఎన్ని సినిమాలు వచ్చాయో ! నమ్మినబంటు వంటి వ్యవసాయ నేపధ్య సినిమాలు మనకు తెలుసు . అరవై ఏళ్ల కిందే వచ్చాయి .

ఆ బాటలో వచ్చిన సినిమాయే ఈ రాజేంద్రుడు గజేంద్రుడు . సినిమాలో ఇద్దరు హీరోలు . ఒకరు రాజేంద్రుడి పాత్రలో రాజేంద్రప్రసాద్ అయితే మరొకరు గజేంద్రుడు పాత్రలో గణేష్ . ఈ ఏనుగు ట్రైనర్ నజీర్ని కూడా మనం తలచుకోవాలి . మనిషిలాగా కన్నీళ్ళు పెట్దింది . సంతోషం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు వదిలింది . హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడిపింది . విలన్లను మట్టుబెట్టింది . రాజేంద్రప్రసాద్ తో సమానంగా నటించింది . హేట్సాఫ్ . రాజేంద్రప్రసాద్ గురించి చెప్పేదేముంది ! వెడం చేత్తో చేసేసాడు .

నిరుద్యోగి రాజేంద్రుడికి దొరుకుతాడు గజేంద్రుడు . తాను పస్తుండయినా గజేంద్రుడికి ఆహారాన్ని పెట్టి గజేంద్రుడికి తన మాజీ యజమానిని గుర్తుకు తెస్తుంటాడు . ఇంటి ఓనర్ కూతురితో ప్రేమను సక్సెస్ చేస్తాడు . విలన్లను లేపేసి , హీరోహీరోయిన్లకు పెళ్ళి జరిపించి just married అట్ట పట్టుకుంటాడు .

ఆల్మోస్ట్ అన్ని సెంటర్లలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమాను చూడని వారు ఉండరు . అయితే మనం గుర్తుకు తెచ్చుకోవలసింది పాత్రలనే . నాకయితే మొదట గుర్తొచ్చేది మా గుంటూరు నాయకి జయలలిత , బాబూమోహన్ జంట . ఏదో వ్యాపారంలో సక్సెస్ అయి ప్రయోజకుడిగా రుజువు చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టి బాబూమోహన్ చేత అగరుబత్తీలు , సబ్బులు , బూరలు , గాజులు  వగైరా వ్యాపారాలు చేయించే పాత్ర , మరదలు కోసం అష్టకష్టాలు పడే బావ .

ఈ రెండు పాత్రలు బుచుకి బుచుకి . ఆ తర్వాత మహా పతివ్రత శ్రీలక్ష్మి పాత్ర . చాలా సినిమాలలో ఆమె కోసమే పాత్రలను ప్రత్యేకంగా మలిచారు దర్శకులు . ఆ వరుసలో ఈ పాత్ర . ఆ తర్వాత బాంక్ మేనేజర్ బ్రహ్మానందం , ఎంద చేట ఆలీ పాత్రలు . ఇద్దరూ పోటాపోటీగా తినేసారు .

పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు . ఏనుగు పేడను రాకెట్లకు ఇంధనంగా అమ్మి లక్షలు గడించాలనే పేరాశ కలవాడు . ఇంక మరో మరచిపోలేని పాత్రలు రాజేంద్రప్రసాద్ , గుండు హనుమంతరావు . ముఖ్యంగా గుండు హనుమంతరావు పాత్ర . ఇలా పాత్రల సృష్టే అద్భుతం .

ఇతర ప్రధాన పాత్రల్లో అరవ హోటల్ ఓనరుగా మల్లికార్జున రావు , అతని కూతురిగా బేబీ చంద్రిక , గజేంద్రుడి మొదటి యజమానిగా గుమ్మడి , విలన్లుగా విద్యాసాగర్ , నర్సింగ్ యాదవ్ , బ్రహ్మానందం భార్యగా రత్నసాగర్  తదితరులు నటించారు .

ఆఖరిలో చెపుతున్నానని సౌందర్య అభిమానులు నన్ను కోప్పడకండి . దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కోల్పోయిన అందాల అభినయ తార సౌందర్య . చలాకీగా , అల్లరి పెట్టే ఇంటి ఓనర్ కూతురిగా గ్లామర్ స్పేసుని నింపేసింది .

యస్ వి కృష్ణారెడ్డి ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు .‌నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని ; కుకుకూ కుకుకూ కుకుకూ ఎవరో నీవని అనకు ; ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జత అంటూ సాగే ఈ మూడు డ్యూయెట్లు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

రాజాయ నమః గజరాజాయ నమః అనే పాట గజేంద్రుడి మీద బాగుంటుంది . మందు పార్టీలో రాజేంద్రుడు పాడే పాట ఇంకొకటి . చక్కని సాహిత్యంతో పాటల్ని వ్రాసిన సిరివెన్నెల వారిని , జొన్నవిత్తుల వారిని , భువనచంద్రని అభినందించాలి . అంతే అందంగా పాడారు బాలసుబ్రమణ్యం , చిత్ర .

తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది . మిథున్ చక్రవర్తి , రాశి , బిందుశ్రీ , ప్రేమ్ చోప్రా తదితరులు నటించారు . తెలుగులో ఆబాలగోపాలాన్ని అలరించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడండి . హాయిగా నవ్వుకోండి . నవ్వు ఆరోగ్యప్రదాయిని కూడా …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరో రాజేంద్రప్రసాద్‌కు దీటైన ఓ హస్తి నటన – కాసింత ఎక్కువే !!
  • Space Couple – ఈ వ్యోమగాముల జంట కథ స్పూర్తిదాయకం!
  • అక్రమార్కిణి..! మమత పార్టీ నిధుల వెనుక నానా బాగోతాలు..!
  • ఒకే పాట- నాలుగు గొంతులు … జానకమ్మ వాయిస్ మ్యాజిక్ ఈ సాంగ్
  • క్రాంతి గౌడ్ – ఆదివాసీ పల్లె నుంచి- లార్డ్స్ హానర్స్ బోర్డు దాకా!
  • అమృత గాయని – అమర గాయని… ఎక్స్‌ప్రెషన్ మాస్టర్ జానకమ్మ…
  • నీ లీల పాడెద దేవా! ఆ విశిష్ట నాదస్వరానికి దీటైన స్వరాలాపన!
  • చూడు చూడు మోడీ… హరీష్‌లా మారిపోతున్న మన ఈటలను చూడు!!
  • అమరగాయని జానకమ్మలో సంగీతబీజాలు మన సిరిసిల్లలోనే!
  • మన తోపులు ఉత్త తోక పటాకులే! పైగా నానా చెత్త సాకులు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions