Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కాపురానికి వెళ్తావా..? ఆరు నెలలు జైలుకు వెళ్తావా..? రెండే దారులు…’

January 30, 2026 by M S R

.

న్యాయమూర్తి ఆమెకు రెండు దారులు చూపాడు… ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడం, లేదా భర్తకు లొంగి ఉండటం… అప్పటికి ఆమె వయసు కేవలం 22 ఏళ్లు… చిత్రమేమిటంటే, ఏ వ్యక్తితో కలిసి ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందో, ఆ వ్యక్తిని ఆమె అంతవరకు కనీసం చూడను కూడా లేదు…

ఆమె జైలునే ఎంచుకుంది… ఆ తర్వాత ఆమె రాసిన ఒక లేఖ భారతీయ చట్టాల గతినే మార్చివేసింది….

Ads

బాంబే, 1885 ::: కోర్టులో రుక్మాబాయి కూర్చుని ఉంది… ఆమెకు ఏమాత్రం పరిచయం లేని ‘దాదాజీ భికాజీ’ అనే వ్యక్తి, ఆమె శరీరంపై తనకు చట్టబద్ధమైన హక్కు ఉందని వాదిస్తున్నాడు… ఆమెకు 11 ఏళ్లు, అతనికి 19 ఏళ్లు ఉన్నప్పుడు జరిగిన బాల్య వివాహం అది… తన సవతి తండ్రి నిశ్చయించిన ఆ పెళ్లి వేడుక ఆమెకు సరిగ్గా గుర్తు కూడా లేదు…

వివాహం తర్వాత రుక్మాబాయి తన తల్లి వద్దే ఉండి చదువుకుంది… ఆమె తల్లి రెండో వివాహం ‘సాఖారామ్ అర్జున్’ అనే ప్రగతిశీల వైద్యుడితో జరిగింది… ఆయన ప్రోత్సాహంతో రుక్మాబాయి ఇంగ్లీష్, గణితం, సైన్స్ అభ్యసించింది…. 22 ఏళ్ల నాటికి ఆమె బాంబేలోనే అత్యంత విద్యావంతురాలైన మహిళగా ఎదిగింది….

చట్టపరమైన యుద్ధం…. 1884లో దాదాజీ కోర్టుకెక్కాడు… “ఆమె నా భార్య, ఆమెను నాతో పంపండి” అని ‘వైవాహిక హక్కుల’ కోసం దావా వేశాడు… రుక్మాబాయి స్పందన అప్పట్లో సంచలనం…: “నేను ఈ వివాహాన్ని గుర్తించను…. అప్పుడు నేను చిన్నపిల్లని, నా సమ్మతి లేదు… ఈ వ్యక్తి నాకు పరాయివాడు…”

1880ల కాలంలో ఇది వినడమే ఒక వింత… బాల్య వివాహాలు ఆనాటి సామాజిక సహజ విషాదాలు… ఒక స్త్రీ తన పెళ్లిని తిరస్కరించడం అంటే అది ధర్మద్రోహంగా భావించేవారు…

‘ఏ హిందూ లేడీ’ కలం పేరుతో… రుక్మాబాయి మౌనంగా ఉండలేదు… ఆమె పత్రికలకు లేఖలు రాయడం మొదలుపెట్టింది… ఆమె వాదనలు చాలా పదునైనవి…

  • ఆడపిల్లలకు చదువు చెప్పించకుండా, చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసే పురుషుల ద్వంద్వ నీతిని ఆమె ప్రశ్నించింది…

  • బాల్య వివాహాల పేరుతో జరుగుతున్నది ‘చట్టబద్ధమైన అత్యాచారం’ అని నిలదీసింది….

  • 1885లో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఆమె రాసిన లేఖ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది…

జైలా? లొంగుబాటా? 1887లో జస్టిస్ రాబర్ట్ హిల్‌ పిన్హే ఆమెకు వ్యతిరేక తీర్పు ఇచ్చాడు… భర్త వద్దకు వెళ్లకపోతే జైలుకు వెళ్లాలని ఆదేశించాడు… రుక్మాబాయి తడబడకుండా “నేను జైలుకే వెళ్తాను కానీ, ఇష్టం లేని వ్యక్తితో ఉండలేను” అని తెగేసి చెప్పింది… ఒక 22 ఏళ్ల యువతి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని,  సంప్రదాయ వాదులను ఎదిరించిన అద్భుత క్షణం అది…

  • చివరకు విక్టోరియా రాణి ప్రభుత్వం జోక్యం చేసుకుని, దాదాజీకి కొంత పరిహారం ఇచ్చి ఆ వివాహాన్ని రద్దు చేయించింది… రుక్మాబాయికి స్వేచ్ఛ దొరికింది…

 

వైద్యురాలిగా కొత్త ప్రస్థానం… రుక్మాబాయి అంతటితో ఆగలేదు… ఆమె డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది… అప్పట్లో భారతదేశంలో మహిళలకు వైద్య విద్య అందేది కాదు… బ్రిటన్‌లోని ‘లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్’లో ఆమె సీటు సంపాదించింది…. ఆమె చదువు కోసం భారత్, బ్రిటన్‌లోని సంస్కర్తలు నిధులు సేకరించారు….

1895లో ఆమె డాక్టరుగా పట్టా పుచ్చుకుని భారత్‌కు తిరిగి వచ్చింది… భారతదేశపు తొలితరం మహిళా వైద్యులలో ఆమె ఒకరు… దాదాపు 30 ఏళ్ల పాటు సూరత్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో వేలాది మంది మహిళలకు సేవలు అందించింది…

రుక్మాబాయి

ఆమె మిగిల్చిన వారసత్వం… రుక్మాబాయి పోరాటం ఫలితంగానే 1891లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్’ (సమ్మతి వయసు చట్టం) వచ్చింది… అప్పటివరకు కేవలం 10 ఏళ్లుగా ఉన్న వివాహ వయసును 12 ఏళ్లకు పెంచారు… ఇది చిన్న మార్పే కావచ్చు, కానీ చట్టం ఇంట్లోకి చొరబడి బాలికలను రక్షించడం అప్పుడే మొదలైంది…

  • 11 ఏళ్ల వయసులో: నిస్సహాయ బాల్య వధువు…

  • 22 ఏళ్ల వయసులో: జైలు శిక్షను ధిక్కరించిన పోరాట యోధురాలు…

  • 32 ఏళ్ల వయసులో: విదేశాల్లో చదివిన వైద్యురాలు….

రుక్మాబాయి 1955లో తన 91వ ఏట కన్నుమూసింది... ఆ కాలంలో ఆమె చేసిన పోరాటం నిజంగా ఒక చరిత్ర... వీళ్లు కదా మన పిల్లల స్కూల్ పాఠాల్లోకి ఎక్కాల్సింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కాపురానికి వెళ్తావా..? ఆరు నెలలు జైలుకు వెళ్తావా..? రెండే దారులు…’
  • ఆర్థిక సర్వే మెచ్చుకుంది సరే… మరి ఈ మేడిగడ్డ నివేదిక మాటేమిటి..?
  • పాకిస్థాన్‌లో రాముడి కొడుకు లవ కుమారుడి ఆలయ పునరుద్ధరణ..!!
  • సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…
  • పక్కపక్కనే మూడు ప్రేమ కథలు… విషాద ముగింపులు వేర్వేరు…
  • ఎయిర్ బస్సా… ఎర్ర బస్సా…! ఓ ఇంట్రస్టింగ్ వార్త ఏదో తేడా కొడుతోంది..!!
  • ఒక పోలీసమ్మ… దాడులకు వెళ్లి… కాసేపు ఓ బిడ్డకు అమ్మయింది..!!
  • వెరీ మిస్టీరియస్ ప్రొఫైల్…! ఆమెకు తెలిసిన విద్యల పేర్లూ విచిత్రమే..!!
  • శృతి ద్వివేది..! లేడీ వేణుస్వామి..! అజిత్ మృతిని ముందే చెప్పింది..!!
  • ఎన్సీపీ, శరద్ పవార్ కుటుంబ తదుపరి రాజకీయ వారసుడు ఎవరు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions