.
Subramanyam Dogiparthi …. వారిజాక్షులందు వైవిహికములందు
ప్రాణ మాన విత్త భంగమందు
నంది తారుతమలయందు బొంకవచ్చు
నఘము పొందదధిపా !
అల్లాటప్పా వాళ్ళు చెప్పింది కాదు . బమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతంలో శుక్రుడు బలి చక్రవర్తికి బోధించిన శుక్ర నీతి . పైగా అల్లరి మొగుడు సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎండార్స్ చేసిన థియరీ .
Ads
అసలు సినిమా పేరే రెండిళ్ళ పూజారి . కధ చెప్పాలా !? అర్థం అయ్యే ఉంటుంది . ఓ ఊళ్ళో రాముడు వంటి మంచి బాలుడు ఉంటాడు . నిఖార్సయిన ఏకపత్నీవ్రతుడు . అనూహ్యంగా ఆఫీసు డబ్బుల్లో ఒక లక్ష రూపాయలు వాడేసుకుంటాడు . ఇంకో నాలుగు లక్షలు కాజేయబడతాయి .
తప్పని పరిస్థితులలో ఓ నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళికి ఒప్పుకొని అయిదు లక్షల రూపాయలు ఆఫీసుకు తిరిగి ఇచ్చి బయటపడతాడు . అక్కడ నుంచి ఇద్దరి పెళ్ళాల మధ్య ఫుట్ బాల్ లాగా ఎడాపెడా వాయించబడుతూ ఉంటాడు . క్లైమాక్సులో ఇద్దరూ గర్భవతులం అని చెప్పడంతో అల్లరి మొగుడులాగా సుఖాంతం , శుభాంతం అవుతుంది .
సృజనా ఫిలింస్ బేనరుపై టి. రమేష్ బాబు నిర్మాతగా కధను రచయిత జి. వి. అమరేశ్వరరావు సమకూర్చగా మరొక ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు స్క్రీన్ ప్లేని అందించారు . మరో రచయిత కం నటుడు తనికెళ్ళ భరణి డైలాగులను వ్రాసారు . వెరశి టి. ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చక్కటి వినోదాత్మక సినిమా రూపు దిద్దుకుంది .
కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర వ్రాసిన పాటల్ని దర్శకుడు టి. ప్రభాకర్ చాలా రొమాంటిక్గా చిత్రీకరించారు . బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు . వీణల్లో తీగె ఏమంది , లెఫ్ట్ లెగ్గు లిఫ్టు చేసి , సందె మసకలో రాజా , పట్టింది పిచ్చిదో , హరిలో రంగ హరీ రెండిళ్ళ పూజారీ అంటూ సాగుతాయి పాటలు .
పాటలన్నీ సుమన్ , శోభన , నగ్మాల మీదే ఉంటాయి . పర్లేదు, చూడతగ్గ రొమాంటిక్ వీడియోలే . ప్రధాన పాత్రల్లో మల్లికార్జున రావు , నిర్మలమ్మ , గిరిబాబు , హేమ , తనికెళ్ళ భరణి , కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ తదితరులు నటించారు .
సినిమాలో హైలైట్ కోట శ్రీనివాసరావు హిజ్రా పాత్ర . ఆయనకు ఆయనే సాటి . అద్భుతంగా నటించారు . డైలాగ్ డెలివరీలో కూడా చాలా వంపులు ఉంటాయి .మొత్తం మీద చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడతగ్గ రొమాంటిక్ ఎంటటర్టయినర్ …
Share this Article