.
తమిళ్ష్ కవి వైరముత్తుకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం వచ్చింది. అందుకు అయనకు అభినందన. నాకు ఊహ తెలిసేనాటికి వైరముత్తు తమిళ్ష్‌లో ప్రసిద్ధమైన కవి. వైరముత్తు ఒక ట్రెండ్ సెట్టర్ కవి. ఒక కవి ఒక భాషలో ట్రెండ్ సెట్టర్ అవడం విశేషం. ఎలా అయితే శ్రీశ్రీ తెలుగులో ట్రెండ్ సెట్టర్ కవి అయ్యారో అలా వైరముత్తు తమిళ్ష్‌లో ట్రెండ్ సెట్టర్ కవి అయ్యారు.
80, 90 దశాబ్దుల్లోని యువ కవులను, యువతను వైరముత్తు ప్రభావితం చేశారు. అభివ్యక్తి విధానం పరంగానూ, భావనా సరళి పరంగానూ వైరముత్తు ఒక దశ తమిళ్ష్ కవితను ప్రభావితం చేశారు. కణ్ణదాసన్ తరువాత తమిళ్ష్‌లో ప్రముఖమైన కవి వైరముత్తు. సినిమా కవిగానూ వైరముత్తు బలమైన ముద్ర వేశారు.
Ads
కొత్త తరహా చింతన, కొత్త తరహా వాక్యాలు, కొత్త అభివ్యక్తి విధానంతో వైరముత్తు కవిగా, ప్రముఖకవిగా రాణించారు. వైరముత్తు ఇంగ్లిష్ వంటి భాషల ప్రభావంతో కవి అవలేదు. ఇంగ్లిష్ భావాలు తీసుకున్న సందర్భాలు ఉన్నా ఆయన శైలి, తీరు స్వకీయమే.
తమిళ్ష్, భారతీయ చింతనను దాటి అంతర్జాతీయ ఆలోచనను అందుకున్నారు వైరముత్తు. ఆశ్చర్యకరంగా తనకు తెలీకుండానే వైరముత్తు గజల్ అభివ్యక్తిని, గజల్ శైలిని సాధించారు. అబ్దుల్ రహ్మాన్ వంటి తమిళ్ష్ కవులు గజల్ భావనను, భాషను తమిళ్ష్‌లోకి తీసుకొచ్చినా వైరముత్తు సినిమా పాటలోకి కూడా గజలియత్‌ను తీసుకొచ్చారు.
వైరముత్తు కవిగానూ సినిమా కవిగానూ దాదాపుగా ఏక కాలంలో ప్రసిద్ధమయ్యారు. కణ్ణదాసన్ మరణం తరువాత వైరముత్తు ఆ స్థానంలోకి వచ్చారు. గొప్ప అభివ్యక్తి విధానం వైరముత్తుది. పద చిత్రాలు వైరముత్తు ప్రత్యేకత. కవిత్వానికి సాంకేతికతను పొదివారు వైరముత్తు.
‘మనిషీ, మనిషీ ఇకపై నీ చూపులు ఎర్రబడితే లోకం ఉదయిస్తుంది’ అని గొప్పగా అన్నారు. ‘మనసులో కూర్చుని గంట కొట్టావు; నా మౌనాన్ని సంగీతంగా అనువదించావు’ అంటూ ఫక్తు గజల్ వలే రాశారు. ‘మాటిమాటికీ దాహం వచ్చి మనిషిని తాగుతుంది’ అంటూ గజల్ భావనను తమిళ్ భాషస్తం చేశారు.
‘హృదయం పదేపదే మరణించింది’ అనీ ‘నా కథ రాయడానికి నా కలం తిరస్కరించింది’ అనీ, ‘ప్రేమ నన్ను ప్రేమించలేదు’ తన గజలియత్ ప్రతిభను చాటుకున్నారు వైరముత్తు. ‘నదితో వెళితే తీరం ఉంటుంది
విధితో వెళితే తీరం ఎక్కడుంటుంది?’ అన్నారు ఒక సందర్భంలో. ‘కచేరీలో వినని సంగీతం ఉంది కదా?
మన చుంబనాల శబ్దం సంగీతమే కదా?’ అన్నారు.
మరణం సమీపించిన తనను ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాను అన్నప్పుడు “నాకొక పూమాల నువ్వు కొనాలి అది ఎందుకో?” అని అన్నారు. ఈ మాటలను మన వేటూరి వాడారు. ‘నువ్వు పట్టు చీర కట్టుకుంటే పట్టు పురుగులు మోక్షాన్ని పొందుతాయి’ అని వైరముత్తు అన్నదాన్ని కూడా వేటూరి తీసుకున్నారు. అంత కణ్ణదాసన్‌ను కూడా తీసుకోని వేటూరి ఈ రెండు సందర్భాల్లో వైరముత్తును తీసుకున్నారు.
‘నీలాన్ని తొలగిస్తే ఆకాశంలో ఏమీ లేదు’ అనీ ‘ప్రేమలేఖలు రాయడానికి మేఘాలన్నీ పత్రాలే; ఆకాశంలోని నీలాన్ని తీసుకురా కలంలోని సిరా చాలదు’ అన్నారు. ప్రత్యేకమైన అభివ్యక్తి విధానంతో ప్రశస్తమైన కవిత్వం రాశారు వైరముత్తు. చాల చాల చెప్పచ్చు అయన గురించి.
వైరముత్తు గొప్ప వక్త. ఒక విశేషమైన శైలితో, పదజాలంతో ఆయన ప్రసంగం గొప్పగా ఉంటుంది. అభివ్యక్తి విధానంపై ఆయన పట్టు, పంథా ప్రశస్తమైనవి. పీ. సుశీల అంటే వైరముత్తుకు ప్రాణం. తనకు మరణం వచ్చే సమయం తెలిసిపోతే అరగంట ముందు ఒక గదిలో తలుపులు మూసుకుని సుశీల పాట వింటూ మరణిస్తాను అని చెప్పారు వైరముత్తు. మన ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు వైరముత్తు ఇచ్చిన నివాళి ఏ తెలుగు వ్యక్తీ, కవీ ఇవ్వలేదు; ఇవ్వలేరు.
భాషా దురభిమానం లేకుండా తమిళ్ష కళాకారులంటే ఉండే అభిమానం వైరముత్తుకు కూడా మెండుగా ఉంది. ఒక వేదికపై పీ.బీ. శ్రీనివాస్ గురించి ఈయన play ‘back’ గాయకుడు కాదు ‘front’line గాయకుడు అన్న అర్థం వచ్చేట్టు తమిళ్ష్‌లో అన్నారు.
నన్ను కణ్ణాదాసన్ ప్రభావితం చేసినా వైరముత్తు అభివ్యక్తి విధానం అంటే నాకు ఎంతో అభిమానం. ఎంతో వివాదాస్పదుడయ్యారు వైరముత్తు. తన నాస్తికత్వంతో అయన అపకీర్తి పాలయ్యారు; తన మాటలు, ప్రవర్తనతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. అయినా ఆయన ప్రయాణం విజయవంతంగా సాగుతూనే ఉంది. 1986లో ఇళైయరాజాతో విబేధాలు వచ్చినా వైరముత్తు పతనం అవలేదు! ఇది చాల గొప్ప విషయం.
ఎంత నాస్తికుడైనా, ఎంత వివాదాస్పదుడైనా వైరముత్తు కవిగా, రచయితగా, వక్తగా ప్రశ్తనీయమైన వారే. నిజానికి ఈ నా రచన వైరముత్తును సరిగ్గా తెలియజేసేది కాదు. తొందర తొందరగా రాస్తూండడం వల్ల ఇంతే రాస్తున్నాను. అందుకు నేను క్షంతవ్యుణ్ణి. వైరముత్తుకు జ్ఞాన్‌పీఠ్ వచ్చినందుకు ఆయనకు అభినందన; అభివాదం.
రోచిష్మాన్
9444012279
Share this Article