.
ఉద్వేగం అంటే ఉద్వేగమే… లాజిక్కులు, లెక్కలు ఉండవు… ఫీలింగ్స్ మాత్రమే… అన్నీ లెక్కల ఈక్వేషన్లలో చూసుకుని మాత్రమే బతుకుతాం అంటే… ఇక వ్యాపారానికీ, జీవితానికీ తేడా ఏమున్నట్టు..? ఓ వార్త చదువుతుంటే ఇదే అనిపించింది…
ఎక్కడో పుట్టిన పిల్లల్ని, ఎవరో విదేశీయులు దత్తత తీసుకుంటే… ఎక్కడెక్కడో పెరిగిన పిల్లలు, పెద్దలయ్యాక తమ రూట్స్ వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి అన్వేషిస్తున్న కథలు బోలెడు చదివాం కదా… ఇది ఇంకా కాస్త భిన్నంగా ఉంది… ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఈ వార్త… బాగుంది, కనెక్టయ్యేలా…
Ads
తన తాత తండ్రికి తండ్రి… అంటే ముత్తాతకు తండ్రి అవుతాడు… తానుండేదేమో ఇంగ్లండ్‌లో… ముత్తాత తండ్రి చార్లెస్ విల్సన్ కన్నుమూసింది భారత్‌లో… వివరాల్లోకి వెళ్తే… ఇంగ్లండ్లోని వెవర్ధన్ గ్రామంలో 1858లో చార్లెస్ విల్సన్ జన్మించాడు… 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరాడు… భారత్‌కు వచ్చి బెంగళూరులో కొన్నాళ్లు, మద్రాసు (ప్రస్తుత చెన్నై)లో కొన్నాళ్లు పనిచేశాడు…
తర్వాత సికింద్రాబాద్‌కు వచ్చి రవాణా ఇతర సరఫరా వ్యవహారాల విభాగంలో లెఫ్టినెంట్ గా సేవలందించాడు…. ఆ సమయంలోనే అనారోగ్యంతో తిరుమలగిరిలోని స్టేషన్ ఆస్పత్రిలో చేరి.. 48 ఏళ్ల వయసులో 1906 ఆగస్టు 4న కన్నుమూశాడు…
ఆయన మృతదేహాన్ని తిరుమలగిరి సిమెట్రీలో ఖననం చేశారు… విల్సన్ చనిపో యిన ఏడాదిలోపే ఆయన భార్య హ్యారీయేట్ నలుగురు పిల్లలను తీసుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయింది… తన ముత్తాత భారత్‌లో పనిచేసి.. భారత్‌లోనే కన్నుమూసినట్లు ఆయన మునిమనమడు రాబిన్ తన ఇంట్లోని అరలో అనేకోకుండా దొరికిన పాత ఫైళ్ల ఆధారంగా తెలుసుకున్నాడు…
కుటుంబసభ్యులతో కలిసి ముత్తాత సమాధిని సందర్శించి మనః పూర్వకంగా నివాళులర్పించాలకున్నాడు రాబిన్… కానీ ఎలా..? విల్సన్ కు సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నా ఆయన సమాధి ఎక్కడ ఉంది? బెంగళూరులోనా? మద్రాసులోనా? సికింద్రాబాద్లోనా? అన్నది మాత్రం ఇన్నాళ్లు వారి కుటుంబసభ్యులు గుర్తించలేకపోయారు… ఓ స్థానిక జర్నలిస్టు రవిరెడ్డి సహకారం దొరికింది…

19 ఏళ్ల అన్వేషణ తరువాత ఎట్టకేలకు తిరుమలగిరి సిమెట్రీ-12 లో తన ముత్తాత తండ్రి సమాధి కనిపించింది… వివరాలు సరిపోల్చుకున్నాడు… ఈసారి తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు… సమాధిపై గులాబీ పూలు ఉంచి, ముత్తాత తండ్రికి నివాళి అర్పించాడు… ఇదీ వార్త స్థూలంగా…
ముత్తాత తండ్రి సమాధి కోసం 19 ఏళ్లు అన్వేషించి, ఇంగ్లండ్ నుంచి భార్యతోసహా వచ్చి నివాళి అర్పించడం గ్రేటే… అందుకే ముందే చెప్పింది, కొన్ని ఉద్వేగాలు ఏ లెక్కల్లోనూ, ఏ లాజిక్కుల్లోనూ ఇమడవు… తమ ఒక ప్రార్థన తన తాత, తన ముత్తాత, తన ముత్తాత తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తుందనే ఓ భావనలో అనిర్వచనీయత..!
హిందూ పితృ కర్మ సంప్రదాయాల్లో కూడా… ఎవరికైనా శ్రాద్ధకర్మలు జరిపించేటప్పుడు ఆ వెనకటి రెండు తరాల వాళ్లను కూడా కలిపి మరీ కర్మ చేయిస్తారు పంతుళ్లు… అంతెందుకు..? త్రయంబకేశ్వరం వంటి చోట్ల ఏడుతరాల పితృదేవతలకూ తర్పణాలు వదిలే ప్రత్యేక తంతు ఉంటుంది…! అఫ్‌కోర్స్, ఇప్పుడు ఇంట్లో గోడల మీద సొంత తల్లిదండ్రుల ఫోటోలే ఉంచడం లేదు కొందరు…!! సో, గుడ్ రాబిన్..!!
Share this Article