.
సోషల్ మీడియాలో ఎవరో తమిళంలో ఓ పోస్టు పెట్టారు… అది నటి సరిత సినిమాల్లోకి రీఎంట్రీ గురించి, ఆమె పాత సినిమా కెరీర్ గురించి… అది చదువుతుంటే చిన్నతనంలో ఆమె ఓ చట్టాన్ని సవాల్ చేసిన ఓ సంచలన విడాకుల కేసు గుర్తొచ్చింది…
ముందుగా ఆమె కెరీర్ మీద ఆ పోస్టు ఇలా… సారాంశం… సరిత మళ్ళీ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది… ఖుష్బూ కుమార్తెతో ఆమె వీడియో షార్ట్స్ ప్రస్తుతం నెట్టింట కనిపిస్తున్నాయి… సరిత అసలు పేరు అభిలాష... సినిమా కోసం ఆమె పేరును సరితగా మార్చుకుంది…
Ads
దర్శకుడు కె. బాలచందర్ ఆమెను ‘AKM’ (అరివుకెట్ట ముండం – తెలివిలేని మొద్దు) అని పిలిచేవాడట… ఆ రోజుల్లో అది ఒక గురువు తన శిష్యురాలిపై చూపించే చనువు… ఈ రోజుల్లో అలా పిలవడం సాధ్యమేనా..?
ఆమె రంగు తక్కువైనా, ఆ ముఖ వర్చస్సు అందరినీ కట్టిపడేసేది… పొద్దుగా, పొట్టిగా ఉన్న ఈ నల్లపిల్ల అందగాడు కమలహాసన్‌తో జతకట్టిన 1978 నాటి ‘మరోచరిత్ర’ ఓ సంచలనం అప్పట్లో… అదే ఆమె తొలి సినిమా కూడా… 1975లోనే, అంటే 16 ఏళ్లకే ఆమెకు తెలుగు నటుడు వెంకట సుబ్బయ్యతో వివాహం జరిగింది…
ఆరు నెలల కాపురం తర్వాత వారు విడిపోయారు… బహుశా ఆ నటుడితో పరిచయం వల్లనే ఆమెకు నటనపై ఆసక్తి కలిగిందేమో… తిరుపతిలో పెళ్లి చేసుకుని కడపకు వెళ్లిన సరిత, ఆ తర్వాత చెన్నైకి చేరుకుంది… సరిత- వెంకట సుబ్బయ్య విడాకుల కేసు న్యాయవాదులకు ఒక Landmark Case గా చిరస్థాయిగా నిలిచిపోయింది… చివరలో చెప్పుకుందాం…
మరోచరిత్ర తర్వాత తమిళంలో ‘అవళ్ అప్పడిత్తాన్’లో చిన్న పాత్ర, ‘తప్పు తాళంగళ్’, ’47 నాట్కళ్’ (47 రోజులు) వంటి చిత్రాల్లో నటించింది… వేగంగా ఆమె పెద్దమ్మ (వయసు పైబడిన పాత్రలు) స్థాయికి వచ్చేసింది… బాలచందర్- సరిత కాంబినేషన్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించింది… కేబీ సార్‌కి సరిత నటన అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం (Crush), ప్రేమ ఉండేవి… ఆమె నాలుగు భాషల్లోనూ అదరగొట్టింది…
మలయాళంలో మమ్ముట్టి సరసన ‘కుట్టేట్టన్’, ‘తనియావర్తనం’ వంటి చిత్రాల్లో నటించింది… ముఖేష్‌తో కలిసి నటిస్తున్న సమయంలోనే వారిద్దరూ రెండో వివాహం చేసుకున్నారు… సరిత సిఫార్సుతోనే ముఖేష్‌కు రామ నారాయణన్ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది… బాలచందర్ కూడా ‘జాతి మల్లి’ చిత్రంలో ముఖేష్‌ను నటింపజేశారు…

ముఖేష్‌లో ఏం చూసి సరిత ఆయన్ని ఇష్టపడ్డారో అని మలయాళీలు అప్పట్లో ఆశ్చర్యపోయారు… ఎందుకంటే తమిళ ‘ఫ్రెండ్స్’ సినిమాలో విజయ్‌కి తల్లిగా సరిత నటిస్తే, అదే సినిమా మలయాళ వెర్షన్లో సూర్య చేసిన పాత్రను ముఖేష్ చేశాడు… అంతటి వయసు/ మార్కెట్ వ్యత్యాసం వారి మధ్య ఉండేది… ముఖేష్ ఎప్పుడూ పెద్ద నటుడు కాలేకపోయాడు, పైగా ఆయనకు తాగుబోతు అనే పేరు కూడా ఉంది…
చివరికి సరిత విడాకులకు దరఖాస్తు చేసి, తన ఇద్దరు కుమారులతో దుబాయ్‌లో స్థిరపడింది… ఆమె కుమారులు సినిమాల్లో ప్రయత్నించినా పెద్దగా రాణించలేదు… ముఖేష్ ఇప్పుడు మెథిల్ దేవిక అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు… (ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే)… కానీ ఇప్పుడు ఆమెతో కూడా గొడవలు వచ్చి విడిపోయినట్లు సమాచారం…
సరిత తెరపై కనిపించకపోయినా, ఆమె గొంతును మనం వింటూనే ఉన్నాం… నటి నగ్మాకు డబ్బింగ్ చెప్పింది సరితే… మౌన గీతాలు, నెట్రికన్, అచ్చమిల్లై అచ్చమిల్లై, కుట్టేట్టన్, మృగయ… ఇలా అన్నింటిలోనూ ఆమె పాత్రలు ఎంతో భావోద్వేగంతో కూడి ఉంటాయి…
సరితను చూసి ఆమె సోదరి (విజి చంద్రశేఖర్) కూడా నటనలోకి వచ్చింది… కానీ సరిత అంత పేరు తెచ్చుకోలేకపోయింది…

ఆ విడాకుల కేసు …. నటి సరిత, ఆమె మొదటి భర్త వెంకటసుబ్బయ్యల కేసు (T. Sareetha vs T. Venkata Subbaiah, 1983) భారత న్యాయ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన మరియు ‘ల్యాండ్‌మార్క్’ కేసుగా నిలిచిపోయింది… దీనికి ప్రధాన కారణం “దాంపత్య హక్కుల పునరుద్ధరణ” (Restitution of Conjugal Rights – Section 9 of Hindu Marriage Act) అనే చట్టాన్ని ఆమె సవాలు చేయడం…
న్యాయ నిపుణులు ఈ కేసును ఎందుకు అంత ప్రత్యేకంగా భావిస్తారంటే...
1. శరీర స్వయంప్రతిపత్తి (Bodily Autonomy)..: భార్యాభర్తలు విడిపోయినప్పుడు, తిరిగి కలిసి ఉండాలని కోరుతూ భర్త (లేదా భార్య) కోర్టులో కేసు వేయవచ్చు… ఒకవేళ కోర్టు కలిసి ఉండమని చెబితే, ఇష్టం లేకపోయినా భార్య భర్త దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది… సరిత దీనిని వ్యతిరేకించింది… “ఒక వ్యక్తికి తన శరీరంపై తనకు మాత్రమే అధికారం ఉండాలి, కోర్టు బలవంతంగా ఒక వ్యక్తితో కలిసి ఉండమని లేదా శృంగారంలో పాల్గొనమని చెప్పడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధం” అని ఆమె తరపున వాదనలు జరిగాయి…
2. సెక్షన్ 9 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు…: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎ. చౌదరి ఈ కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చారు… హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 అనేది అనాగరికమైనదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు – వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు)ను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ, ఆ సెక్షన్‌ను “రాజ్యాంగ విరుద్ధం” అని కొట్టివేశారు…
3. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత…: పెళ్లయినంత మాత్రాన ఒక మహిళ తన శరీరపై హక్కును కోల్పోదని, ఎవరితో ఉండాలి, ఎవరితో శృంగారంలో పాల్గొనాలి అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఈ తీర్పు స్పష్టం చేసింది… దాంపత్య హక్కుల పేరిట ప్రభుత్వం లేదా కోర్టులు బెడ్ రూమ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఇది నొక్కి చెప్పింది…
4. న్యాయపరమైన వివాదం…: అయితే, ఈ తీర్పు వచ్చిన కొద్ది కాలానికే ఢిల్లీ హైకోర్టు,, ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిని విభేదించాయి… కుటుంబ వ్యవస్థను కాపాడటానికి సెక్షన్ 9 అవసరమని అవి భావించాయి… అయినప్పటికీ, నేటికీ “వైవాహిక అత్యాచారం” లేదా మహిళల హక్కుల గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ సరిత కేసును ఒక ఉదాహరణగా, ఒక మార్గదర్శిగా న్యాయవాదులు ప్రస్తావిస్తుంటారు…

ఆమె నటిస్తున్న కొత్త మలయాళ చిత్రం పేరు ‘ఆరంభం’ (Aarambham)… ఇందులో సరిత ఒక కీలకమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నదట… నటి ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్ ఈ సినిమాతోనే మలయాళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతోంది…
చాలా కాలం తర్వాత ఆమె మలయాళ తెరపై కనిపిస్తుండటంతో కేరళ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… సరిత మలయాళంలో చివరిగా 2003లో ‘అమ్మకిలికూడు’ వంటి చిత్రాల్లో కనిపించింది… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మలయాళంలో చేస్తున్న పూర్తి స్థాయి పాత్ర మళ్లీ ఇదే… గత ఏడాది తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన ‘మావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది…
Share this Article