ఒక భాష పుట్టడానికి వేల ఏళ్లు పడుతుంది. పుట్టిన భాష బతికి బట్టకట్టి బాగా ఎదిగి, పూలు పూసి, మొగ్గ తొడిగి, పిందె వేసి, కాయ కాచి, పండి రసాలూరడానికి మరికొన్ని వందల ఏళ్ళో, వేల ఏళ్ళో పడుతుంది. కానీ- భాషను చంపేయడానికి అంత సమయం పట్టదు. రెండు, మూడు తరాలు- అంటే వందేళ్లు బాగా ప్రయత్నిస్తే చాలు- వేల ఏళ్లుగా నిలిచి వెలిగిన భాషను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేయవచ్చు.
భాష పరమ ప్రయోజనం భావ ప్రసారం. మౌఖిక రూప భాషకు సంకేతం లిపి. భాష ముందు పుట్టి లిపి, భాషాశాస్త్ర విషయాలయిన వ్యాకరణం లాంటివి తరువాత పుడతాయి. ప్రపంచంలో ఏ భాష అయినా ఇంకో భాషా సంపర్కం లేదా ప్రభావం లేకుండా పుట్టదు. పుట్టలేదు. ఇంగ్లీషులో లెక్కలేనన్ని లాటిన్, గ్రీకు పదాలు దొరుకుతాయి. భారతీయ భాషల్లో సంస్కృతం నిండిపోయి ఉంటుంది. సంస్కృత లిపి దేవనాగరి- హిందీ లిపి దాదాపు తొంభై అయిదు శాతం ఒకటే. దక్షిణాది ద్రావిడ భాషల వ్యాకరణ సూత్రాలు, ఛందస్సులు, అలంకార శాస్త్రాలు, విమర్శనా పద్ధతులు అన్నీ సంస్కృతం ఆధారంగా తయారయినవే. పాల్కురికి సోమనాథుడి లాంటి ఒకరిద్దరు అచ్చ తెలుగులో అద్భుతాలు సృష్టించారు. దేశీ ఛందస్సుల్లో ద్విపదలు, రగడలు రచించి తెలుగు భాషా సరస్వతి మెడలో హారాలుగా అలంకరించారు. శ్రీనాథుడి లాంటివారు రాసింది తెలుగులోనే అయినా ఆ మాటల చివర డు ము వు లు విభక్తి, ప్రత్యయాలు మినహాయిస్తే అందులో తెలుగు ఎంతో చెప్పడం కష్టం. నన్నయ, తిక్కన, పాల్కురికి, పోతన, అన్నమయ్య మొదలు నిన్న మొన్నటి విశ్వనాథ, పుట్టపర్తి, దాశరథి, సినారె దాకా తెలుగులో ఎంత గొప్ప సాహిత్యాన్ని సృజించినా వారి సంస్కృత పాండిత్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
ఒక్కో దేశానికి కొన్ని ఆచార వ్యవహారాలు, కళలు, సాహిత్య సంస్కృతులు సొంతమయినవి ఉంటాయి. అలా భారతీయత అంతా సంస్కృత భాషలో, సంస్కృతిలో దాగి ఉంది. సంస్కృతం అంటే బాగా శుద్ధి చేయబడినది అనే అర్థం. బాగా శుద్ధి చేయగా చేయగా తయారయినది అని అనుకోవచ్చు. సంస్కృతంలో సంస్కృత భాష ఒక భాగమే కానీ- సంస్కృతం అంటే భాష ఒక్కటే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యమంతా సంస్కృతాన్ని ఆధారం చేసుకుని ఉండడంవల్ల- ఆధ్యాత్మికవాదాన్ని వ్యతిరేకించేవారంతా మొదట సంస్కృతాన్ని ద్వేషించారు. తరువాత బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాల్సిన చోట్ల సంస్కృతాన్ని వ్యతిరేకించారు. భారత దేశంలో ఉంటూ విదేశీ నామస్మరణతో తరించేవారంతా సంస్కృతాన్ని ద్వేషించారు. చివరకు సంస్కృతాన్ని హత్య చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
Ads
భాషగా సంస్కృతం ఈరోజుల్లో ఎవరూ మాట్లాడకపోవచ్చు. కానీ సంస్కృతం మాటలను, సంస్కృతి సంబంధ భావనలను భారతీయ భాషల్లో, భారతీయతలో తీసేయడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. హిందూ ధార్మికతను- సంస్కృత భాషను వేరు చేసి చూడడం సాధ్యం కాలేదు కాబట్టి సంస్కృతాన్ని గుడ్డిగా ద్వేషించాం. ప్రపంచంలో జెర్మనీ లాంటి దేశాలు మాత్రం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. ప్రపంచ భాషల్లో సంస్కృత భాషకున్న క్లుప్తత (బ్రివిటీ) మరే భాషకు లేదు. అనంతంగా ఎన్ని పదాలనయినా సంధి సమాసంతో కలుపుకోవచ్చు. సంస్కృత ఉచ్చారణలో సహజమయిన నాదం ఇమిడి ఉంటుంది. భారతీయ భాషల్లో పారిభాషిక పదాల నిండా ఉన్నది సంస్కృతమే. అలాంటి సంస్కృతానికి పూర్వ వైభవం తీసుకురావాలని కేంద్రంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వానికి కోరిక.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సంస్కృత భాష గురించి గొంతు చించుకునే ఎందరు సంస్కృతం చదివారో తెలియదు కానీ- గుజరాత్ లో ఒక ముస్లిం మహిళ సంస్కృతంలో పిహెచ్డి పట్టా పుచ్చుకుంది. అక్కడే మరో ముస్లిం మహిళ కూడా సంస్కృతంలోనే పిహెచ్డి పూర్తి చేసింది. ముస్లిం అన్న మాట వల్ల ఈ వార్తకు ఇంత ప్రాధాన్యం వచ్చింది.
తల్లీ! సల్మా!
నీకు సంస్కృతాభినందనం.
– పమిడికాల్వ మధుసూదన్
Share this Article