.
సింధు జలాల వివాదం ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య కేవలం నీటి సమస్యగా మాత్రమే కాకుండా, ఒక దౌత్యపరమైన యుద్ధంగా మారింది… హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు (PCA) ఈ వ్యవహారంలో ఎందుకు తలదూర్చింది, భారత్ ఎందుకు “నో” చెప్పింది అన్న అంశాలపై ఓ పూర్తి స్పష్టతనిచ్చే ప్రయత్నం ఇది…
సింధు జలాల సమరం: హేగ్ కోర్టుకు భారత్ షాక్! ఉగ్రవాదం ఉన్నచోట ఒప్పందాలకు తావులేదని స్పష్టం చేసిన భారత్…
Ads
1. అసలు కోర్టు భారత్‌ను ఏమని అడిగింది? హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA), భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగా, రాట్లే (Ratle) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను (Operational Data) తమకు సమర్పించాలని ఆదేశించింది…
ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహం తగ్గుతుందని, ఇది 1960 ఒప్పందానికి విరుద్ధమని పాక్ వాదిస్తోంది… ఆ వాదనలను విచారించడానికి తాము సిద్ధమని, ఫిబ్రవరి 2026 నాటికి భారత్ తన వాదనలు వినిపించాలని కోర్టు కోరింది…
2. పాకిస్థాన్ కోర్టును ఎందుకు ఆశ్రయించింది? 1960 ఒప్పందం ప్రకారం, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటిపై పాకిస్థాన్‌కు 80% హక్కులు ఉంటాయి… భారత్ అక్కడ కేవలం విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే కట్టుకోవాలి, నీటిని నిల్వ చేయకూడదు…
పాక్ ఆరోపణ..: భారత్ కడుతున్న డ్యామ్‌ల డిజైన్ వల్ల నీటి ప్రవాహం ఆగిపోతుందని, తద్వారా తమ వ్యవసాయం దెబ్బతింటుందని పాక్ భయం…
వ్యూహం…: ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌ను గెలవలేక, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిలదీసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని పాక్ చూస్తోంది…
3. ప్రపంచ బ్యాంకు పాత్ర ఏమిటి? 1960లో ఈ ఒప్పందం కుదిరిందే ప్రపంచ బ్యాంకు (World Bank) మధ్యవర్తిత్వం వల్ల… అందుకే ఏదైనా వివాదం వస్తే పరిష్కరించే మధ్యవర్తిత్వ బాధ్యత కూడా దానిదే…
ప్రస్తుత చిక్కుముడి…: పాకిస్థాన్ “కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్” కావాలంది… భారత్ “తటస్థ నిపుణుడు (Neutral Expert)” చాలు అంది…
ప్రపంచ బ్యాంకు నిర్ణయం..: చిత్రం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు ఒకేసారి ఇద్దరినీ సంతృప్తి పరచడానికి అటు ఎక్స్‌పర్ట్‌ను, ఇటు కోర్టును రెండింటినీ నియమించింది… ఇది “ప్రమాదకరం” అని భారత్ అప్పుడే హెచ్చరించింది… ఎందుకంటే రెండు సంస్థలు వేర్వేరు తీర్పులు ఇస్తే పరిస్థితి అయోమయంగా మారుతుంది…

4. భారత్ ఈ కోర్టును ఎందుకు గుర్తించడం లేదు? భారత్ ఈ కోర్టును “అక్రమంగా ఏర్పడింది” (Illegally Constituted) అని పిలుస్తోంది… దానికి మూడు ప్రధాన కారణాలు…
ఒప్పంద ఉల్లంఘన…: 1960 ట్రీటీ ప్రకారం.. ముందు కమిషన్ చర్చించాలి, తర్వాత నిపుణుడు రావాలి, చివరగా కోర్టుకు వెళ్లాలి… పాక్ ఈ క్రమాన్ని పాటించకుండా నేరుగా కోర్టుకు వెళ్ళింది…
ఏప్రిల్ 2025 పహల్గామ్ దాడి..: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఒప్పందాలను అమలు చేయడం సాధ్యం కాదని భారత్ ఈ ట్రీటీని “సస్పెన్షన్ (Abeyance)” లో పెట్టింది…
సార్వభౌమాధికారం…: ఏ కోర్టు పడితే ఆ కోర్టు తమ దేశ ప్రాజెక్టుల డేటా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదని భారత్ ఖండితంగా చెప్పేసింది…
5. కోర్టు అధికారాలు… భారత్ వాదనలోని న్యాయం
కోర్టు పరిమితులు…: PCA అనేది ఒక సలహా సంస్థ వంటిది… దానికి ఏ దేశంపైనా తన తీర్పును బలవంతంగా రుద్దే అధికారం లేదు… భారత్ తన డేటా ఇవ్వకుండా, విచారణకు హాజరు కాకుండా ఉంటే కోర్టు ఏమీ చేయలేదు…
ఏకపక్ష తీర్పు (Ex-parte award)…: భారత్ విచారణకు హాజరు కాకపోతే, కోర్టు పాకిస్తాన్ వైపు వాదనలు విని ఒక తీర్పు ఇవ్వొచ్చు… అయితే, ఆ కోర్టు ఏర్పాటునే భారత్ ‘అక్రమం’ అని కొట్టివేసింది కాబట్టి, ఆ తీర్పును భారత్ అస్సలు పరిగణనలోకి తీసుకోదు…
భారత్ వైపు న్యాయం…: ప్రపంచవ్యాప్తంగా ఏ అంతర్జాతీయ చట్టమైనా “దేశ భద్రత”కు ప్రథమ స్థానం ఇస్తుంది… పాక్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి మన పౌరులను చంపుతుంటే, మనం వాళ్లకు నీటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదనేది భారత్ నైతిక వాదన…
ముగింపు…: భారత్ తన వైఖరితో ఒక విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది — “మేము నిబంధనలను గౌరవిస్తాం, కానీ ఆ నిబంధనల పేరుతో మా గొంతు కోసే ప్రయత్నం చేస్తే మాత్రం సహించం…” ‘‘నీళ్లూ నెత్తురూ కలిసి ప్రవహించలేవు…’’
ఏమో... ఇందులోనూ ట్రంపు వేలుపెట్టే ప్రయత్నం చేయవచ్చు, నేను చెప్పినట్టు వినకపోతే మళ్లీ పీనల్ టారిఫ్స్ తప్పవని బెదిరించవచ్చు... ఎందుకంటే... అమెరికాకు పాకిస్థాన్ కావాలి..!!
Share this Article