.
టెన్షన్, టెన్షన్! ఉత్కంఠ భరితమైన ఆ క్షణం [#NailBitingSituation] రానే వచ్చింది! ఆర్టెమిస్ 2 [#ArtemisII] వ్యోమగాములు [#Astronauts] సైతం తట్టాబుట్ట సర్దేశారు! మరికొన్ని గంటల్లో సముద్ర జలాల్లో దిగడం [#WaterLanding] కోసం సమాయత్తం అయ్యారు! పసిఫిక్ మహాసముద్రం [#PacificOcean] లో దిగే [#SplashDown] వ్యోమగాముల కోసం అమెరికన్ జాన్ పీ మూర్త [#USSJohnPMurtha] మిలట్రీ నౌక ఇప్పటికే సిద్ధమైంది.
శాన్ డిగో తీర ప్రాంతంలో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. డైవర్స్ కూడా రెడీగా ఉన్నారు. మెడికల్ టీమ్స్ సైతం అక్కడికి చేరుకున్నాయి! అన్నీ అనుకూలించి, అగ్నిదేవుడు కరుణిస్తే, ప్యారాచూట్లు పని చేసి ప్రచండ వాయుదేవుడు శాంతిస్తే, సముద్రుడు సహకరిస్తే, చివరగా ఆ దేవుడు అనుమతిస్తే, 13 నిమిషాల భయంకర నిశ్శబ్దం తరవాత “దివి నుంచి మేం సురక్షితంగా భువికి దిగాం” అని నాలుగు స్వరాలు ముక్తకంఠంతో మార్మోగనున్నాయి!
Ads
చందమామ చుట్టూ విజయవంతంగా ప్రదక్షిణ చేసిన ఒరియన్ వ్యోమనౌక [#OrionSpaceShuttle] 10 వ రోజు భూ గ్రహం వైపు దూసుకొస్తోంది! 80 కాదు, 100 కాదు, ఏకంగా గంటకు 38000 కి.మీ వేగంతో ఆ స్పేస్ షటిల్ భూ వాతావరణాన్ని తాకుతుంది [#ShuttleInterface]! ఆ ఘర్షణ [#Friction] వల్ల ఎరుపు, తెలుపు రంగుల మిశ్రమంతో కూడిన అగ్నికీలలు ఒరియన్ నౌకను చుట్టుముడతాయి!
స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ సుమారు 5000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత జనిస్తుంది! ఇది కేవలం మూడంటే, మూడే సెకన్లలో మనిషిని భస్మం చేయగలిగేంత ఉష్ణం! ఇనుమును కరిగించేంత వేడి! ఒక అగ్నిపర్వతం బద్దలైనప్పుడు చిమ్మే లావా [#Magma] వేడికి రెండు రెట్లు! భూమిని తాకుతున్న టైంలో టెలిస్కోప్ తో చూసేవాళ్లకు ఆ గుళిక [#Capsule] ఒక ఉల్క [#Meteor] ను తలపిస్తుంది!
సాధారణంగా మనం ఎక్కే విమానాలు గంటకు 900 ల కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి! సూపర్ సోనిక్ ఏరోప్లేన్ శబ్దవేగం [#SoundVelocity] తో దూసుకెళ్తుంది! అదే మిలట్రీ స్నైపర్ బుల్లెట్ రఫ్తార్ గంటకు 3500 ల కి.మీ! సో 38 వేల కి.మీ వేగం అంటే, ఆ బుల్లెట్ కంటే దాదాపు 11 రెట్ల వెలాసిటీ అన్నమాట! అలా ప్రచండ వేగంతో పయనించే ఆ వ్యోమగుళికలో బెల్టులు బిగించుకొని సీట్లలో కూచోవడం మినహా, అందులోని వ్యోమగాములకు దానిపై ఎలాంటి నియంత్రణ ఉండదు!
ఒరియన్ క్రూ క్యాప్సూల్ దాదాపు 16 ఫీట్ల వ్యాసం [#Diameter] లో సిలికా, ఎపోక్సీ, రెసిన్‌ల మిశ్రమం [#Mixture] తో కూడిన #Avcoat వేడి కవచం [#HeatShield] తో పొరలు పొరలుగా కప్పబడి ఉంటుంది. వాటిలోని ఒక్కొక్క పొర [#Layer] గుళిక నుంచి విడిపోయి వాతావరణంలో కలిసిపోతూ ఆ సెగల వేడిమి గుళిక లోపలికి వెళ్లకుండా నియంత్రిస్తుంది! అలా మాడ్యూల్ చుట్టూ వేడివేడి ప్లాస్మా ఆవహించి ఉంటుంది!
అగ్ని బంధంలో నలుగురు వ్యోమగాములు హైపర్ సోనిక్ వేగంతో భూమ్మీదకు దూసుకొస్తుంటారు! క్రూ క్యాప్సూల్లో రేడియో సిగ్నల్స్ ఉండవు! వ్యోమగాములకు గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోతాయి! చిమ్మ చీకట్లో చివరి 13 నిమిషాలు ఆ నౌకలో భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతుంది! క్షణం ఒక యుగమై అందులోని వ్యోమగాములకు శ్వాస తీయడం కష్టంగా మారుతుంది. తాము పీల్చి వదిలేసిన గాలితోనే ఊపిరి తీస్తూ వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి! అంతటి క్లిష్ట పరిస్థితుల్లో గుండె కూడా బరువెక్కుతుంది! ఏదో భారమైన వస్తువు గుండెలపై ఉన్న ఫీలింగ్! మొత్తంగా స్ప్లాష్ డౌన్ ప్రక్రియ ఒక నరకాన్ని తలపిస్తుంది!
కీలక తరుణంలో తాము నమ్ముకున్న భౌతిక శాస్త్రం ఏమాత్రం అటూ ఇటైనా, అంతే సంగతి! పంచప్రాణాలు హుష్ కాకి! ఆర్టెమిస్ 1 మిషన్లో ఆ అనుభవం కూడా ఎదురైంది! అది మానవరహిత [#Unmanned] ప్రయోగం కావడంతో అదృష్టవశాత్తు పెద్ద ముప్పు తప్పింది! సముద్రపు జలాల్లో పడ్డ తరవాత ఆ రాకెట్ మాడ్యూల్ ను పరిశీలించిన శాస్త్రవేత్తలు నోళ్లు వెళ్ల బెట్టారు!
క్యాప్సూల్ చుట్టూ ఉన్న హీట్ షీల్డ్ పొరలు పొరలుగా విడిపోవాల్సింది పోయి సుమారు 100 చోట్ల పగుళ్ల లాంటి స్పాట్లు ఏర్పడ్డాయి! ఒత్తిడి పెరిగి ఆ కవచం ముక్కలు ముక్కలైంది! ఇది ప్రాణాంతక పరిణామం! అందుకే నాసా శాస్త్రవేత్తలు ఆర్టెమిస్ 2 ప్రయోగంలో వ్యూహం మార్చి స్వల్ప మార్పులను అనుసరించాలని నిర్ణయించారు!
ఒరియన్ క్రూ క్యాప్సూల్ హీట్ షీల్డ్ కు బదులుగా ఆ నౌక భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే [#ReEntry] పథంను మాత్రం మార్చారు! క్యాప్సూల్ ముందు భాగం కాస్త ఎత్తైన కోణంలో పైకి లేచి భూమి మీదకు ప్రవేశించేలా [#LoftedReturnTrajectory] రీ ఎంట్రీని ప్లాన్ చేశారు. తద్వారా ఆ గుళిక అతి తక్కువ సమయం వాతావరణంలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పద్ధతిని నాసాలోనే కొంతమంది శాస్త్రవేత్తలు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు! కొత్త హీట్ షీల్డ్ లేకుండా వెళ్లడం అంత సురక్షితం కాదని అభిప్రాయపడ్డారు! కానీ, నాసా మాత్రం లాఫ్టెడ్ రిటర్న్ ట్రాజెక్టరీ పద్ధతికే మొగ్గు చూపింది!
ఇక పున: ప్రవేశ కోణంలో ఏమాత్రం తేడా జరిగినా నీటిపైన విసిరిన రాయిలా వ్యోమగాములున్న ఆ గుళిక ఎవరో విసిరేసినట్లు తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది! తప్పు చిన్నదైనా ముప్పు పెద్దది అన్నట్లు దాన్ని వెనక్కి తీసుకొచ్చే ఇంజన్లు లేక ఆస్ట్రనాట్లు రోదసీలో చిక్కుకుపోతారు! త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ ఆక్సిజన్ అందినంత కాలం బ్రతికి, ఆ తరవాత ప్రాణాలు వదులుతారు!
ఇక, స్పేస్ షటిల్ కోణం ఎత్తు పెరిగితే మరో సంకటం ముంచుకొస్తుంది! ఆస్ట్రనాట్ల శరీరంపై గురుత్వాకర్షణ శక్తి [#GravitationalForce] ప్రభావం తీవ్రమైతుంది! 3.9 యూనిట్లుగా ఉండాల్సిన ఆ శక్తి 7 నుంచి 7.5 యూనిట్లకు చేరి, శరీరం బరువు అమాంతంగా 7 రెట్లు పెరుగుతుంది! ఆ ప్రభావం ఛాతీపై పడి, గుండె రక్తాన్ని మెదడుకు పంపకుండా చేస్తుంది! ఫలితంగా వ్యోమగాములు స్పృహ కోల్పోతారు!
కాగా, క్రూ క్యాప్సూల్ అత్యంత సురక్షితంగా సముద్ర జలాల్లో దిగే విధంగా 11 ప్యారాచూట్లు, ఫ్లోటింగ్ డివైజ్ లతో డిజైన్ చేయబడి ఉంటుంది! దివి నుంచి భువికి దిగే పథంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరైన ప్యారాచూట్ ఏ ఒక్కటి తెరుచుకోకపోయినా, సరైన రీతిలో అగ్గి రాజుకోక పోయినా, గుళిక గతి తప్పి సముద్రంలో కాకుండా అతి వేగంగా భూమిపై పడితే? ఇక అది వినాశనమే [#Catastrophe]! అందులో ఉన్న నలుగురూ నాశనమే!
అందుకే, జాబిలి దగ్గరికి పోవడం కంటే, తిరిగి రావడమే అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం! సో, చంద్ర ప్రదక్షిణ [#LunarFlyBy] చేసి వస్తున్న ఆ నలుగురు వ్యోమగాములు క్షేమంగా ఇల్లు చేరాలని ఆకాంక్షిద్దాం! చందమామ రావే, జాబిల్లి రావే.. అన్న అమ్మ పాటకు బదులుగా మనమే అక్కడికి చేసిన సాహస వైజ్ఞానిక యాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలని కోరుకుందాం!…. Suraj V Bharadwaj
Share this Article