.
ప్రధాని మోడీ న్యూజిలాండ్ పర్యటన… తనకు స్వాగతం చెబుతున్నప్పుడు ఆయన నేలపై పడిన ఏదో కర్ర ముక్కను చేత్తో తీస్తున్నాడు… ఆ వీడియోల్లో చాలామందిని ఆకర్షించిన సీన్ అది… ఏమిటది..? ఏం పడింది..? ఏం తీసుకుంటున్నాడు..?
ఆ చేష్ట వెనుక మంచి అర్థం, పెద్ద విశేషమే ఉంది… ఇంట్రస్టింగు… అది స్థానిక ఆదివాసీ సంస్కృతితో ముడిపడి ఉన్న పాయింట్… అది సాధారణ చెక్క ముక్క కాదు… న్యూజిలాండ్ ఆదివాసీ ప్రజలైన మావోరీ (Māori) సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారంలో భాగం…
Ads
ప్రధానికి స్వాగతం పలికే సందర్భంగా మావోరీ యోధులు సంప్రదాయ “పోవ్హిరి (Pōwhiri)” వేడుకను నిర్వహించారు… విదేశీ దేశాధినేతలు, ప్రముఖ అతిథులకు అత్యంత గౌరవంగా ఈ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడం అక్కడి ఆనవాయితీ…
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక మావోరీ యోధుడు ప్రధాని మోదీ ముందు నేలపై చిన్న చెక్క గుర్తును ఉంచాడు… దీనిని “వెరో (Wero)” అనే సంప్రదాయ సవాలుగా పిలుస్తారు…

ఆ చెక్క ముక్కను ఎందుకు ఉంచుతారు? అది ఆయుధం కాదు… అలంకరణ కూడా కాదు… అతిథి శాంతియుత ఉద్దేశంతో వచ్చాడా? స్నేహం కోసమా? లేక ఘర్షణ కోసం వచ్చాడా? అనే విషయాన్ని ప్రతీకాత్మకంగా తెలుసుకునే సంప్రదాయం అది…
అతిథి ఎలాంటి తొందరపడకుండా, గౌరవంగా ఆ చెక్క గుర్తును ఎత్తుకుంటే… “నేను శాంతి, స్నేహం, పరస్పర గౌరవంతో వచ్చాను” అనే సందేశంగా భావిస్తారు…
ప్రధాని మోదీ ఏం చేశారు? సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రధాని మోదీ వంగి ఆ చెక్క గుర్తును తీసుకుని, మర్యాదపూర్వకంగా తిరిగి అందించారు… దీంతో మావోరీ సంప్రదాయానికి గౌరవం తెలిపినట్లే కాకుండా, భారత్- న్యూజిలాండ్ సంబంధాలు శాంతి, స్నేహం, పరస్పర విశ్వాసంపై కొనసాగాలనే సందేశాన్ని కూడా ఇచ్చినట్లైంది.
అనంతరం ఏం జరిగింది? సంప్రదాయ స్వాగత కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను “వ్యూహాత్మక భాగస్వామ్యం (Strategic Partnership)” స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. అలాగే ఈ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచేందుకు అంగీకరించాయి.
వాణిజ్యం
రక్షణ
విద్య
వ్యవసాయం
సాంకేతికత
ప్రజల మధ్య పరస్పర సంబంధాలు
ఈ సంఘటన ఎందుకు ముఖ్యమంటే…
అంతర్జాతీయ పర్యటనలు అంటే కేవలం ఒప్పందాలు, సమావేశాలే కాదు. ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం కూడా దౌత్యంలో కీలక భాగం.
ప్రధాని మోదీ మావోరీ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ చెక్క గుర్తును ఎత్తుకోవడం ద్వారా న్యూజిలాండ్ ఆదివాసీ సంస్కృతికి గౌరవం తెలిపారు. అదే సమయంలో భారత్ శాంతి, స్నేహం, పరస్పర గౌరవానికి కట్టుబడి ఉందనే సందేశాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు.
.
- చాన్నాళ్ల క్రితం రాష్ట్రపతి రష్యా పర్యటన టీమ్‌లో నేనూ ఉన్నాను… ఏదో మాటల సందర్భంలో మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఓ మాటన్నాడు… ‘‘విదేశీ వ్యవహారాల్లో ఒక చిన్న పుల్ల అటు నుంచి ఇటు పడినా సరే, దాని వెనుక ఓ మర్మం ఉంటుంది… ప్రధాని గానీ, రాష్ట్రపతి గానీ ఏదైనా దేశం పర్యటిస్తుంటే… దానికి ముందస్తు ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది’’… ఈ మావోరి స్వాగతం ఫోటో చూస్తే అదే గుర్తొచ్చింది…
#PM #NewZealand #Maori #IndiaNewZealand #Diplomacy #Friendship #Peace #Culture #InternationalRelations
Share this Article