ఎవరి వాల్ మీదో కనిపించి, కాసేపు మౌస్ అలా ఆగిపోయింది… అది ఫుడ్ మీద పోస్టు కాబట్టి… అలవాటైన తెలుగు టిఫిన్లు కాబట్టి… కాకపోతే కోనసీమ వంటిల్లు పేరిట హోటల్ పెట్టుకున్నాడు ఒకాయన… కూకట్‌పల్లిలో… అందుకని ఈ టిఫిన్లకూ ఆంధ్రా పేర్లే పెట్టాడు… అసలు అదికాదు, 120 రూపాయలకు అన్‌లిమిటెడ్ బఫె బ్రేక్ ఫాస్ట్ అనే స్కీమ్ ఆకట్టుకుంది… ఇలా క్లిక్ చేయగానే అలా ఇన్‌స్టాగ్రాంలో హైదరాబాద్ ఫుడ్ ట్రిప్ అనే ఖాతాకు తీసుకుపోయింది…
నిజానికి బఫె బ్రేక్‌ఫాస్ట్ కాన్సెప్టు కొత్తదేమీ కాదు… హైదరాబాదులో 15, 20 ఏళ్ల క్రితమే జామ్‌బాగ్, నాంపల్లి ప్రాంతాల్లోని హోటళ్లలో ఉండేది… అక్కడికి టూరిస్టు బస్సులు ఎక్కువగా వచ్చి ఆగేవి, వసతికి రకరకాల స్కీమ్స్ పెట్టి ఆకర్షించేవి… బఫె బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లి, వడ, పూరి, దోస, ఉప్మా పెట్టేవాళ్లు ఎక్కువగా… ఒకటీరెండుచోట్ల పొంగల్… పూరి మస్ట్…
ఇప్పుడు ఈ కోనసీమ స్కీమ్‌లో పదిరకాల వంటలు అంటున్నారు… ఏమిటయ్యా అంటే..? అంబాజీపేట పొట్టిక్కలు, పాలకొల్లు దిబ్బరొట్టె, రావులపాలెం మొలకల వడలు, మండపేట చిట్టిగారెలు, రాజోలు పెసర పుణుకులు, రాజమండ్రి ఆవిరి కుడుము, రాగి ఇడ్లీ, కాకినాడ చిట్టి పెసరట్టు, చించినాడ చిట్టి మినపట్టు, ఉప్మా… హమ్మయ్య, ఉప్మాకు ఏరియా స్పెషల్ పేరేమీ పెట్టలేదు.,. ఐనా ఉప్మాకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ ఏముంటుంది..? అది ప్రపంచ ప్రసిద్ధి కదా…
ఆయా ఏరియాల స్పెషల్ అని పలు టిఫిన్లు పేర్లు రాశారు బాగానే ఉంది… మన వంటకాలు అని అట్రాక్ట్ చేయడం కూడా ఓ వ్యాపార కళే… ఐనా హోటల్ పేరే కోనసీమ వంటిల్లు అని పెట్టుకున్నాక తెలంగాణ జొన్న గట్క, రాయలసీమ రాగిసంకటి ఉంటాయా ఏంది..? ఇప్పటికీ ఆ హోటల్ ప్లస్ ఆ రేట్లు అలాగే ఉన్నాయో లేదో, ఆ స్కీమ్ ఉందో లేదో తెలియదు గానీ… ఒక్కో మనిషికి 120 రూపాయలు అనేది రీజనబుల్ రేటే… కానీ పూరి, మైసూర్ బోండా, దోస, సాంబారు లేని లోటు, వెలితి అనిపిస్తోంది… సాంబార్ లేని సౌతిండియన్ టిఫిన్ ఊహించుకోవడమే కష్టం… ఆవిరి కుడుము, పొట్టిక్కలు, పెసరట్టు, మినపట్టు, వడ… అన్నింటికీ అదే ప్రధాన ఆధరువు కదా…
Ads
నిజంగానే పదిరకాల టిఫిన్లు ఉంటే… వాళ్లు చెబుతున్నట్టు రెండురకాల పొడులు, నాలుగు రకాల చట్నీలు, నెయ్యి, చెరుకు పానకం కూడా ఇస్తే… సమంజసమైన రేటే… పైగా పొట్టిక్కలు, ఆవిరి కుడుము, దిబ్బరొట్టె గట్రా అన్ని హోటళ్లలో దొరకవు… తినేవాడు కూడా ఓ స్థాయి దాటాక కుక్కుకోలేడు కదా… హోటల్ వాడికీ నష్టమేమీ లేదు… బఫె లంచ్, బఫె డిన్నర్‌లాగే ఇది కూడా… ఎక్కువగా ఐటమ్స్ అందుబాటులో ఉంచాలి, తినేకాడికే తింటారు ఎవరైనా… కానీ కడుపు నిండుతుంది… తమకు ఇష్టమైనవి తృప్తిగా తింటారు కాబట్టి… అన్నింటికీ మించి ఫుడ్ వేస్టేజీ ఉండదు…
డోక్లా, కచోరీ, పావ్ బాజీ, జిలేబీ గట్రా నార్త్ ఇండియన్ డిషెస్ ఇక్కడ నడవవు… కానీ ఏమాటకామాట… చాలా దేశాల్లో అసలు వెజ్ ఫుడ్డే దొరకదు, ఇక బ్రేక్ ఫాస్ట్ సంగతి చెప్పాలా..? కొన్ని స్టార్ హోటళ్లయితే కాంప్లిమెంటరీగా బఫె బ్రేక్ ఫాస్ట్ పెడతాయి… వెజ్ వాళ్లకు కార్న్ ఫ్లేక్స్, మిల్క్, బ్రెడ్, బట్టర్ దొరుకుతాయి… ఎగిటేరియన్లయితే ఇంకాస్త నయం… బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్… కాకపోతే అక్కడి ఫ్రూట్లతో ఏదేని జ్యూస్ ఉంటుంది…
ఇండియన్స్ టూరిస్టుల రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈమధ్య దోసెలు వేసిస్తున్నారు… అదేమిటో మరి… దిబ్బరొట్టె ఇచ్చే తృప్తి ఎన్ని బ్రెడ్లు ఇవ్వగలవు..? మినపట్టు టేస్ట్ ఆమ్లెట్‌కు వస్తుందా..? ఆవిరి కుడుముకు కార్న్ ఫ్లేక్స్ సాటిరాగలదా..? పొట్టిక్కను తుంచి సాంబారులో ముంచి తింటేనే కదా కడుపు ఫుల్లు నిండేది… నిండినట్లుగా అనిపించేది…!!
Share this Article