ఉన్నవాడికి వెయ్యి కోట్ల స్వర్గ సౌధం!
లేనివాడికి ఊహా సౌధం!!
——————–
పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ ఇల్లు. జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు. డబ్బున్నవారు ఎంతయినా పెట్టి ఇల్లు కొనవచ్చు.
మిగతా సంపన్నులతో పోలిస్తే డీ మార్ట్ సూపర్ మార్కెట్ల అధినేత దమాని భిన్నమయినవాడు. సౌమ్యుడు. అత్యంత సంపన్నులకు ఉండే చాలా లక్షణాలు లేనివాడు. కష్ట జీవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునేవాడు. దాదాపు యాభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కాబట్టి వెయ్యి కోట్లు పెట్టి అరవై వేల చదరపు అడుగుల ఇల్లు కొనడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఆయన కష్టార్జితం. ఆయన ఇష్టం. బాంబేలో ఆయన కొన్న ఇంటికి స్టాంప్ డ్యూటీనే ముప్పయ్ కోట్లు చెల్లించాడు. అంటే అంతా సక్రమమయిన, లెక్కల్లో చూపిన, ఆదాయపు పన్ను కట్టిన తరువాత మిగిలిన సొమ్మే. దూరదృష్టితో ఇటుక ఇటుక పేర్చి ఓపికగా అంతటి వ్యాపార సౌధాన్ని నిర్మించుకున్నందుకు దమానీ అభినందనీయుడు.
Ads
బాంబేలో హై రైజ్ ఆకాశ హర్మ్య అపార్ట్ మెంట్ మూడు వేల చదరపు అడుగులదే అరవై, డెబ్బయ్ కోట్లు పలికేప్పుడు, అరవై వేల చదరపు అడుగుల ఇండిపెండెంట్ ఇల్లు వెయ్యి కోట్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు.
హైదరాబాద్ బంజారా హిల్స్ విలాసవంతమయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్లలో చదరపు అడుగు పదమూడు- పదిహేను వేల దాకా పలుకుతోంది. అంటే మూడు వేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ అన్నీ కలిపి అయిదారు, కోట్లు అవుతుంది. శివారుల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు పదిహేను కోట్లు దాటినవి బోలెడు ఉన్నాయి. కోవిడ్ ఏకాంతాల, భౌతిక దూరాల ఒంటరితనాలు బజ్ వర్డ్ అయిన వేళల్లో విల్లాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట.
——————–
నేనొక దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ ఛార్జ్ గా పని చేసేవాడిని. హైదరాబాద్ సిటీ బస్ పాస్. మెస్ భోజనం. ఒక గొప్ప పండితుడి కొడుకు పార్ట్ టైమ్ తెలుగు లెక్చరర్ గా పని చేసేవాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడుగా బతుకు బండిని లాగేవాడు. మంచి మిత్రుడయ్యాడు. ఇల్లు కట్టుకున్నాను. గృహ ప్రవేశానికి రావాలని సాదరంగా ఆహ్వానించాడు. సరేనన్నాను. 1996 నాటి మాట. రాజ్ భవన్ రోడ్లో 49 పి సిటీ బస్ ఎక్కి సికిందరాబాద్ లో దిగాను. అక్కడ మళ్లీ 229 లేక మరేదో నంబర్ బస్సెక్కి మిత్రుడు చెప్పినట్లుగా వెళుతూనే ఉన్నాను. మేడ్చల్ లో దిగి రెండు కిలో మీటర్లు ఎర్రటి ఎండలో నడిస్తే సహారా ఎడారిలాంటి నిర్మానుష్య ప్రాంతం వచ్చింది. ఇప్పటిలా సెల్లులు లేవు కాబట్టి ముందే చెప్పిన కొండ గుర్తుల ప్రకారం కష్టంగా అయినా ఇంటిని దారి తప్పకుండా పట్టుకున్నా. నూట ఇరవై అయిదు చదరపు గజాల్లో ఆ ఇంటిని మూడేళ్లపాటు ఎన్ని వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్నాడో గృహప్రవేశ హోమం సాక్షిగా మిత్రుడు వివరించాడు. ఈ చతుస్సాగర ధరాముద్రిత భూమండలం మీద వెయ్యి చదరపు అడుగులతో రెండు బెడ్ రూముల సువిశాలమయిన ఒక ఇల్లు కట్టుకున్నందుకు మిత్రుడి కళ్లల్లో ఆనందం, మనసులో పులకింత, ఉక్కిరి బిక్కిరి మాటలకందేది కాదు. పప్పన్నం తిని మళ్లీ రెండు, మూడు సిటీ బస్సులెక్కి నాలుగు గంటల ప్రయాణంతో ఖైరతాబాద్ సర్కిల్లో పడ్డాను. ఎలాగయినా, ఎప్పటికయినా ఇలా ఒక వంద గజాల్లో ఇల్లు కట్టుకుని ఈ పాడు ప్రపంచాన్ని పరిహసించాలని ఆ క్షణం నాలో ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపింది. పాతికేళ్లు గడిచిపోయాయి కాబట్టి బహుశా ఇప్పుడా మేడ్చల్ ప్రాంతం జనారణ్యమైపోయి ఉంటుంది. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కలిపి నాలుగు లక్షల లోపు ఎక్కడొస్తుందో వెతకడానికి పాపం మిత్రుడికి సంవత్సరం పట్టింది అప్పుడు. ఆ నాలుగు లక్షల్లో ఒక లక్ష వడ్డీకి తెచ్చిన అప్పు. చివరికి గృహప్రవేశానికి అయిదు వేలు కూడా అప్పే. ఇంటి లోపల వుడ్ వర్క్ పెండింగ్. అయినా సొంతిల్లు సొంతిల్లే.
ఎంత చెట్టుకు అంత గాలి. దమాని వెయ్యి కోట్లతో ఇల్లు కొంటాడు. సామాన్యుడు వెయ్యి కారణాలతో ఇల్లు కొనలేకపోతాడు. ఎవరి కారణాలు వారివి. అన్నట్లు- డెబ్బయ్ ఏళ్లుగా ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు కడుతూనే ఉన్నాయి. అయినా ఇళ్లు లేని వారు కోట్లల్లోనే ఉన్నారు. ఎక్కడుంది లోపం?…………………. By…… పమిడికాల్వ మధుసూదన్
Share this Article