ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మరో అత్యంత భారీ చిత్రం… జక్కన్న వంటి విశేషణాల్ని నేను తగిలించను… సినిమా ఇండస్ట్రీలో జక్కన్నతనం అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది… స్ప్రింగు తాడిచెట్లు వంటి జానపద కథ తరహా కంటెంటుును ప్రేక్షకులు బాహుబలిలో ఆమోదించలేదా..? వేల కోట్లు కురిపించలేదా..? కాకపోతే రాజమౌళిని ఎందుకు మెచ్చుకోవాలంటే… అందరు దర్శకుల్లాంటివాడు కాదు… సాహసి… తను కొన్ని సీన్లు కలకంటాడు… అవి అలాగే వచ్చేవరకూ కష్టపడతాడు… అఫ్ కోర్స్, గతంలో తన సినిమాల్లో బోలెడు కాపీ సీన్లున్నయ్… అసలు కాపీ సీన్లు తీయకుండా గొప్పదర్శకుడెవడయ్యాడు ఈమధ్య..? అయితే వాడెంత పెద్ద హీరో గానీ… ఎంత పెద్ద వృత్తి నిపుణుడైనా సరే, తను చెప్పినన్ని కాల్ షీట్లు ఇవ్వాల్సిందే, ఖాళీగా అందుబాటులో ఉండాల్సిందే… చెప్పినట్టు మౌల్డ్ కావల్సిందే… అసలే మన సౌత్ ఇండస్ట్రీ దరిద్రం తెలుసు కదా… హీరోయే దర్శకుడు, నిర్మాత, కథకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత, డాన్సర్ ఎట్సెట్రా… కానీ రాజమౌళి కథలో కాదు కదా, ఎక్కడ వేలుపెట్టినా సరే ఊరుకోడు…
ఒక దర్శకుడు అంతగా సినిమా మీద గ్రిప్‌తో పనిచేయడం, మిగతా వాళ్లంతా ఆ కెప్టెన్ చెప్పినట్టు పనిచేయడం ముచ్చటేస్తుంది… దర్శకుడికి దమ్ముంటే జరిగేది అది… రానా గానీ, ప్రభాస్ గానీ నెలల తరబడీ వర్క్ చేశారు, ఒళ్లు పెంచారు, రిహార్సల్స్ చేశారు, చెప్పినట్టు నటించారు… హీరో ఎలా ఎలివేట్ కావాలో రాజమౌళి చూసుకుంటాడు… పాట ఎలా పరవశింపచేయాలో కీరవాణి చూసుకుంటాడు… కథ ఎలా పరుగులు తీయాలో విజయేంద్రప్రసాద్ చూసుకుంటాడు… అన్నీ కుదిరితే ఎలా సక్సెస్ చేయాలో ప్రేక్షకుడు చూసుకుంటాడు… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేశారు… నిర్మాతను వదిలేయండి, జస్ట్, డబ్బులున్న ఎవరో ఓ దారినపోయేదానయ్య… 4 గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ అట… అన్ని రికార్డులూ బద్దలు కొడుతుంది పక్కా… అయితే..? కొందరు సినిమా అభిమానులకే కాస్త చివుక్కుమంటోంది…
Ads
వీడియో అంతటా రాజమౌళి విశ్వరూపమే కనిపిస్తోంది… రాంచరణ్, జూనియర్ వంటి అగ్రహీరోలు కూడా… ఒక అలియా భట్, ఒక అజయ్ దేవగణ్, ఒక శ్రియ, మనకు పేరు తిరగని మరో ఆంగ్ల తార కనిపించినట్టుగానే జస్ట్, ఒకటీ రెండు సెకన్లు… అంతే… గుంపులో గోవిందయ్యలు… అదీ కొందరికి చివుక్కుమనేది… కానీ నిజం చెప్పుకోవాలి… రానా, ప్రభాస్ బాహుబలికి ముందు పాన్ ఇండియాలో ఎందరికి తెలుసు..? ఇప్పుడు ప్రభాస్ సాహో తీస్తే సూపర్ హిట్ అయ్యిందంటే కారణం బాహుబలి ఇమేజే… బాహుబలి అసలు హీరో రాజమౌళే… ఇప్పుడూ అంతే… జూనియర్, రాంచరణ్ దేశంలో ఇతరచోట్ల ఎందరికి తెలుసు..? ఇది క్లిక్కయితే పేరు మోగిపోతుందేమో… కానీ క్లిక్ కావాలంటే రాజమౌళి బుర్ర పనిచేయాలి… తను దేశంలో అందరికీ తెలుసు… అందుకే వీడియో పూర్తిగా రాజమౌళినే చూపించింది… ఎస్, మార్కెటింగ్ దందా కోసం రాజమౌళే కనిపించాలి… అదే జరిగింది… వేరే దర్శకుడో, వేరే సినిమాయో అయితే మేకింగ్ వీడియో ఐనా హీరోయే కనిపించేవాడు ప్రతి సెకనూ… రామచరణుడైనా, తారకరాముడైనా… ఇక్కడ కథ వేరు… వేరు… కానీ ఏమాటకామాట… దర్శకుడు చెప్పినట్టు మిగతా వాళ్లంతా వినడం, దర్శకుడనే కెప్టెన్ చెప్పినట్టే నడవడం చాలా ఇంట్రస్టింగు… (జూనియర్, రాంచరణ్ కూడా గ్రేటే… రాజమౌళి స్కూల్‌లో క్రమశిక్షణ కలిగిన విద్యార్థుల్లా నడుచుకున్నందుకు…)
టేకింగు గురించి వదిలేయండి… రాజమౌళి అవసరమైతే మరో పదీపదిహేను పాత సినిమాలు చూసి, ఈ సినిమాలో కుమ్మేయగలడు, ఆ ప్రతిభ ఉన్నవాడే… కథ గురించి మరిచిపొండి… ఇష్టారాజ్యంగా కథ, చరిత్రను వక్రీకరించడమే కదా సినిమావాళ్ల పని… సైరా గొప్పోడా..? చిరంజీవి గొప్పోడా..? చిరంజీవి ఆ పాత్రను తనకిష్టమొచ్చినట్టు పోషించాడు, ఆ కథను ఇష్టమొచ్చినట్టు దునుమాడారు కాబట్టి చిరంజీవే గొప్ప… లేకపోతే సైరాకు ఈ గొప్పతనం ఏది..? ఇండస్ట్రీలో ఇలాగే అనుకుంటారు… అడుగుకో భజన సంఘం కదా… ఇప్పుడూ అంతే… అల్లూరి, కొమురం కూడా కలుస్తారు… రాజమౌళి సినిమా వ్యాపారం లెక్కల ప్రకారం కలిసి తీరాలి… కాదంటే చరిత్ర ఒప్పుకోదేమో గానీ రాజమౌళి దందా ఒప్పుకోదు… కాకపోతే ఇదే నిజమైన చరిత్ర అన్నంత బాగా తీయగలడు రాజమౌళి… హైప్ క్రియేట్ చేయడం ప్రారంభమైంది… ప్రపంచమంతా బోలెడు భాషల్లోకి దింపేయాలి… అమ్మేయాలి… కుమ్మేయాలి… కమాన్ రాజమౌళీ, కమాన్… పేరు కూడా అలాగే పెట్టారు… రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్… అవును, వీడియో నిండా రాజమౌళి గర్జనే… (దిగువన కోడ్ స్కాన్ చేసి ‘ముచ్చట’కు ఆర్థికంగా అండగా నిలవండి…)
Share this Article