12 th FAIL
బావున్న సినిమాని బావుందని చెప్పి మన తోటి ప్రేక్షకకుల్ని కూడా సినిమా చూసేలానూ.. బాగోని సినిమాని’ రేయ్ చెత్త సినిమారా బాబూ చూడకండి వడ దెబ్బ తగులుతుంది ‘అని ప్రజాక్షేమం దృష్ట్యా హెచ్చరికలు చేయటమున్నూ సామాజిక బాధ్యత కాబట్టి ఇప్పుడు బాగా బావున్న 12 th FAIL గురించి చెప్పుకుందాం !
ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇందులో కుర్చీ మడతబెట్టటాలు ఉండవు..లుంగీ డాన్సులు ఉండవు!
హీరోయిన్ల నడుమొంపులు చూపటాలు ఉండవు..గుండెలదిరేట్టుగా హీరోల తొడగొట్టుళ్ళు ఉండవు !
హీరో గారు ఏకే 47 గన్నులు పట్టుకున్న వందమంది రౌడీలను చిన్న స్క్రూ డ్రైవర్ తో గుచ్చుకుంటూ వెళ్ళటాలు అసలే ఉండవు !
శివాలెత్తిపోయే శివమణి డ్రమ్ముల శబ్దాలు ఏ మాత్రం ఉండవు !
ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా చూడకండి..డిసప్పాయింట్ అవుతారు !
సమాజంలో సహజంగా జరిగే సంఘటనలను తెరపై చూడాలనుకుంటే 12 th FAIL చూడండి !
పుస్తకాల్లో అబ్దుల్ కలాం గారిని చదివినవాళ్ళు ఆయన్ని చూడాలనుకుంటే 12 th FAIL చూడండి !
జీవితంలో ఏదో సాధించాలని కసిగా మోటివేషన్ క్లాసులకు వెళ్ళేవాళ్ళు 12 th FAIL చూడండి !
మన చుట్టూ ఉన్న IAS , IPS అధికారుల్లో మనోజ్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే 12 th FAIL చూడండి !
నిజ జీవితంలో IPS కావాలని కష్టపడి చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకున్న ఒక సామాన్య కుర్రాడి రియల్ లైఫ్ స్టొరీ చూడాలంటే 12 th FAIL చూడండి !
ఇందులో హీరో..హీరోయిన్ల పాత్రలను ప్రస్తుతం IPS..IRS లకు సెలెక్ట్ అయిన ఇద్దరు గొప్ప వ్యక్తుల ప్రేరణ ఆధారంగా రూపొందించారు !
ఇక కధ అంటారా ,
మధ్యప్రదేశ్ లోని మారుమూల పల్లెలో మనోజ్ శర్మ అనే కుర్రాడు DSP గా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని గోల్ గా పెట్టుకుంటాడు !
ప్రభుత్వ పరీక్షలు రాసి పోలీస్ ఆఫీసర్ గా తిరిగి గ్రామానికి రావాలన్న నాయనమ్మ కోరికతో ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకుని గ్వాలియర్ వెళ్తాడు !
అక్కడ ఎవరో దొంగతనం చేయటంతో డబ్బులు పోగొట్టుకుంటాడు !
దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయటంతో రెస్టారెంట్ లో పరిచయం అయిన సాటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే స్టూడెంట్ సాయంతో తో ఢిల్లీ చేరతాడు !
చేతిలో డబ్బులు లేవు
IPS కావాలనే లక్ష్యం మాత్రం అలాగే ఉంది !
పగలు టాయిలెట్లు క్లీన్ చేయటం.. పిండి మరలో పనిచేయటం..రాత్రిళ్ళు చదువుకోవటం..ఇదీ అతడి దినచర్య !
పిండి మరలో పనిచేస్తున్నప్పుడు అతడిలో నాకు ఎక్కడా హీరో కనపడలేదు
మనోజ్ శర్మ మాత్రమే కనపడ్డాడు !
మూడు అటెంప్ట్ లు ఫెయిల్ అయి నిరుత్సాహంలో ఉన్నప్పుడు అతడి కోచ్ ఓటమిని ఒప్పుకోవద్దు..నీ గోల్ ని రీ స్టార్ట్ చెయ్ అని ఎంకరేజ్ చేసి పరీక్షలకు పంపుతాడు !
ఆఖరి అటెంప్ట్ లో సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్ పాస్ అయి ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అవుతాడు !
ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు చూడాలి మనోజ్ శర్మ ని !
అప్పటిదాకా కసిగా పిండిమరలో పనిచేసిన కుర్రాడేనా ఇప్పుడు ఇంటర్వ్యూ కి హుందాగా సూటు బూటు లో వెళ్తుంది అనిపించింది !
అంత బాగా సెట్ అయ్యాడు హీరో పాత్రధారి (అతడి పేరు కూడా చూడలేదు)
ఇంటర్వ్యూలో IPS కావటం తన గోల్ అని చెప్పటంతో ,
ఒకవేళ నువ్ సెలెక్ట్ కాకపోతే నీ గోల్ ఫెయిల్ అయినట్టేగా అని కమిటీ మెంబర్ అడిగిన ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం బావుంది !
ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోయినా నా గోల్ ఫెయిల్ కాదు..హాయిగా గ్రామానికి వెళ్లి పాఠాలు చెప్పే టీచర్ ని అవుతా..అవినీతి రహిత భారత నిర్మాణానికి నా వంతుగా భావి భారత పౌరులను నేను తయారు చేస్తా..నేను IPS అయినా చేసేది అదే కదా అంటాడు !
ఫైనల్ గా ఆ కుర్రాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి IPS అవుతాడు
అతడ్ని ప్రేమించిన హీరోయిన్ కూడా పరీక్షల్లో పాస్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ అవుతుంది
కథకు ఆధారమైన అసలు వ్యక్తులు నిజ జీవితంలో IPS , IRS ఆఫీసర్లు గా ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నారు !
ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో చూసి బావుందని చాలామంది రివ్యూలు కూడా రాసేసారు !
అయినా నాలాగా ఇంకెవరన్నా మిస్ అయ్యారేమో అని ఇప్పుడు రాసా ! ... పరేష్ తుర్లపాటి
Share this Article