ఓ అడ్వెంచరస్ సినిమా అంటే ఎలా ఉంటుంది.. అంటే… థర్టీన్ లైవ్స్ లా అని ఠకీమని చెప్పొచ్చు! అప్పటికే ఇక వాళ్ల పనైపోయినట్టేని నిర్ణయించుకునే స్థాయికొచ్చాక… అలాంటి ఆపదలో ఉన్నవారిని కాపాడాలంటే.. అదెంత రిస్క్…? ఎంత రెస్క్యూ ఆపరేషన్స్ లో నిష్ణాతులై ఉన్నా… వారిని కాపాడబోయి తామే ప్రాణాలను కోల్పోతే….? ఇదిగో ఈ ప్రశ్నే వేధిస్తే… తనకు మాలిన ధర్మముండదనేదే లోకరీతవుతుంది. కానీ, ఆ ఎక్స్పర్ట్స్ అలా చేయలేదు… ఎలాగైనా కాపాడాలనుకున్నారు. సంకల్పబలంతో… ఓ కోటగుహలో చిక్కుకున్న 13 మందిని లైవ్ గా మళ్లీ వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబీకుల ముందుంచారు. 2018లో థాయ్ లాండ్ లో సంచలనం రేపిన ఈ ఘటనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన థర్టీన్ లైవ్స్. ఆరోజు జరిగిన యదార్థగాధకు కొంత నాటకీయత జోడించినప్పటికీ… రాన్ హోవర్డ్ ఆ సంఘటన జరిగిన రోజుల్ని మళ్లీ తన సినిమా ద్వారా రిక్రీయేట్ చేయడమే ఈ సినిమాలో గొప్పదనం.
థాయ్ లాండ్ లోని థామ్ లువాంగ్ గుహలు ఎంత ప్రసిద్ధో తెలిసిందే. అయితే ఎందరో పర్యాటకుల్లాగే… వాటిని చూసేందుకు ఓ 12 మంది పిల్లలు… వాళ్ల కోచ్ తో కలిసి ఆ గుహల్లోకి వెళ్లతారు. అసలా గుహల్లోకి వెళ్లడమే ఓ అడ్వెంచర్. అలా గుహల్లోకి వెళ్లిన తర్వాత భారీవర్షంతో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంటుంది. గుహల్లోకి నీరు వరదలా వస్తుంటుంది. సుమారు నాల్గున్నర కిలోమీటర్ల దూరం వెళ్లిన పిల్లలు, తమ కోచ్ తో సహా భిక్కుభిక్కుమంటూ గడుపుతుంటారు. ఓవైపు చిన్నారులు బయటకు రాలేని స్థితి… పిల్లలింటికింకా రాలేదని తల్లిదండ్రుల్లో మరోవైపు ఆందోళన… కానీ, కోచ్ తో గుహకు వెళ్లినట్టు తెలుసుకున్న పేరెంట్సంతా ఆ గుహ వద్దకు చేరుకుంటారు. సుమారు 18 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారందరినీ సజీవంగా బయటకు తీసుకువచ్చిన ఆ యదార్థ ఘటన ఆధారంగా మల్చిన సినిమాతో… ఆ 18 రోజుల రెస్క్యూను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఇక ఆపరేషన్ జరిగే తీరంతా సినిమాలో చూస్తేనే మజా!
థాయ్ గుహల రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేసిన స్కూబా డైవర్స్ బృందం తీరుకు నాడు ప్రపంచమంతా సాహో అని ప్రశంసలతో ముంచెత్తింది. తనకు మాలిన ధర్మం లేదనుకుని బతికే సమాజంలో… పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు చూసి చలించి వారినెలాగైనా కాపాడాలనుకుని… అత్యంత కఠినమైన పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతం చేసిన ప్రధానఘటనల్లో లువాంగ్ గుహల గాధ ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేనిది. అయితే దర్శకుడు తన సినిమాతోనూ మనల్ని ఆ గుహల్లోకి తీసుకెళ్లగల్గుతున్నాడంటేనే…. కథలోకీ తీసుకెళ్లినట్టే. అలాంటి టేకింగ్ మనకు థర్టీన్ లైవ్స్ లో స్ఫురిస్తుంది. అందుకు తగ్గ ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరితే… ముమ్మాటికీ థర్టీన్ లైవ్స్ లా ప్రశంసలందుకుంటుంది.
Ads
2018 జూన్ 23 నుంచి జూలై 10వ తేదీ వరకు 18 రోజుల పాటు సాగిన ఆ ఉత్కంఠభరితమైన రెస్క్యూలో… సుమారు పదివేల మంది పాత్ర ఉంది. వందమంది స్కూబా డైవర్స్.. వంద సర్కారు ఏజెన్సీస్.. 900 మంది పోలీసులు… 2 వేల మంది సైనికులు… పది పోలీస్ హెలిక్యాప్టర్స్… ఏడు ఆంబులెన్సులు… 700కు పైగా డైవింగ్ సిలెండర్స్… ఒక బిలియన్ లీటర్ నీళ్లను ఆ కొండగుహల్లోంచి ఎత్తిపోసే మోటార్లతో కూడిన యంత్రాంగం… ఇలా ఒకటా, రెండా…? రెస్క్యూ ఆపరేషన్ కు ఓ కేరాఫ్ గా నిల్చిన థాయ్ గుహల ఘటనను… తన బయోపిక్చర్ కు క్యాన్వాస్ గా ఎంచుకోవడమే ఓ సాహసమైతే… అంతే సాహసంగా దాన్ని తిరిగి తీయడమంటే… కేవలం వందో, రెండొందలో ఎంటర్ టైన్ మెంట్ కోసం వెచ్చించే సగటు ప్రేక్షకుడు వా అనకుండా ఉండగలడా…? అదిగో అలాంటి సినిమానే థర్టీన్ లైవ్స్. అయితే థాయ్-మయన్మార్ బార్డర్ లో ఉన్న గుహల్లో జరిగిన ఈ వాస్తవిక ఘటనలో ఒకరు రెస్క్యూ చేస్తున్నప్పుడు మృతి చెందగా… మరొకరు ఆ తర్వాత బ్లడ్ ఇన్ ఫెక్షన్ కు గురై మరణించడం ఓ విజయంలోనూ బాధించిన విషాదం.
ఓ జీవి ప్రాణం విలువ గుర్తించగల్గడమే మానవత్వం! తమ ప్రాణాలను పణంగా పెట్టి… ఆపదలో ఉన్న తోటి మనుషుల ప్రాణాలను కాపాడటమంటే… అది నిజంగా మానుషరూపేణ దైవత్వమే!! అలాంటి దైవత్వంతో కూడిన మానవత్వపు పరిమళాలను వెదజల్లిన నాటి థాయ్ వాస్తవ సంఘటనకు ప్రతిరూపమే… థర్టీన్ లైవ్స్……… సమీక్ష :: రమణ కొంటికర్ల… ✍🏼
Share this Article