ఒక శిరీష అలియాస్ బర్రెలక్క … ఒక రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్… ఈ రెండు పేర్లూ ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి… వీరిలో ప్రశాంత్‌ది గజ్వెల్ ప్రాంతం… శిరీషది కొల్లాపూర్… ఇద్దరూ టిక్‌టాక్ బాపతు యూట్యూబ్, సోషల్ మీడియా వీడియో బిట్లతో కాలం గడిపేవాళ్లు… ఆమె డిగ్రీ చేసింది… ప్రశాంత్ ఏం చదివాడో తెలియదు… ఇద్దరూ మట్టిమనుషులే కొన్ని నెలల క్రితం… కానీ…
ఒక శిరీష రాజకీయ చైతన్యానికి, సాహసానికి, ధైర్యంగా నిలబడటానికి, ఒక కాజ్ గురించి పోరాటం చేయడానికి ప్రతీకగా మారింది… మంచి పేరు సంపాదించింది… తనపై దాడి జరిగినా సరే వెనుకంజ వేయలేదు, వచ్చిపడిన మద్దతును, డబ్బును వినమ్రంగా స్వీకరించింది… జనంలోకి వెళ్లి తెలంగాణలో నిరుద్యోగిత అనే అంశాన్ని బలంగా ఫోకస్ కావడానికి ఉపయోగపడింది… ఒకరకంగా ఆమె పాపులారిటీకి ఒక ప్రజాసమస్య వెలుగులోకి రావడం అనే సార్థకత లభించింది…
ఆమె పాత టిక్‌టాక్ వీడియోలు చూస్తే ఈమెకేనా ఇంత మద్దతు వస్తోంది..? ఈమె రాజకీయ పరిజ్ఞానం ఎంత..? ఎందుకింత బలమైన సపోర్ట్ ఆమె చుట్టూ గుమిగూడుతోంది..? అని ఆశ్చర్యం వేస్తుంది… కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో నిలబడి జనంలోకి వెళ్లి మాట్లాడటం స్టార్ట్ చేసిందో ఆమె టిక్‌టాక్ బాపతు అమాయకత్వం, చిన్నపిల్లతనం ఏమీ కనిపించలేదు… బాగానే మాట్లాడింది… ఎస్, ఆమె రెగ్యులర్ ప్రొఫెషనల్ పొలిటిషియన్ కాదు కదా… కడుపులో ఉన్నదే జనానికి చెప్పింది… ఒక కాజ్ బలంగా జనంలోకి వెళ్లింది… ఆమె నిలబడిన స్థానంలోనే కాదు, చాలాచోట్ల నిరుద్యోగుల వోట్లు ప్రభావితమయ్యాయి… అదీ ఆమె నైతిక విజయం…
Ads
అందుకే దాడులకు, బెదిరింపులకు గురైంది… అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మనుషులు ఎప్పటిలాగే అరాచక శక్తులుగా ఆమెను బరి నుంచి తప్పించడానికి ప్రయత్నించారు… కానీ మొండిగానే నిలబడింది… 5 వేల వోట్లా..? 10 వేల వోట్లా..? జానేదేవ్… ఆమె ఒక సమస్యను ఎలుగెత్తి, అనూహ్య మద్దతు సంపాదించింది… అది ఆమె విజయం… (అంతకుముందు ప్రవళిక ఆత్మహత్య బాపతు విషాదం, అధికార బీఆర్ఎస్ ఆమె చావుకు కూడా వక్రబాష్యాలు చెప్పి, ఓ ప్రేమకథను ముడిపెట్టి నీచమైన ఎత్తుగడలకు పూనుకుంది… జనంలో దాంతో పెరిగిన ఆ కోపం కూడా బర్రెలక్కకు మద్దతుగా మారి ఉండవచ్చు…)
సీన్ కట్ చేస్తే… పల్లవి ప్రశాంత్… తను సాధించిందేముంది..? బిగ్ జీరో… బిగ్‌బాస్ అనేది ఓ పెద్ద వినోదదందా… అందులో ఇతను ఒక పావు… తన పాత వీడియోలు చూస్తే ఓ ఉన్మాదిలా మట్టిని నోట్లో కుక్కుకుంటూ, అరుస్తూ, ఏడుస్తూ… ఒక బిట్‌లో ఏదో వైకల్యమున్నట్టే కనిపించింది… తను బిగ్‌బాస్ నాగార్జున పదే పదే చెప్పినట్టు కామన్ మ్యాన్ కాదు… సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్… టిక్‌టాకర్… ఓ రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో బిగ్‌బాస్ చూసే ప్రేక్షకుల సానుభూతిని కృత్రిమంగా పొందే ప్రయత్నం ప్రశాంత్‌ది…
పైగా తనకు ఇండివిడ్యుయాలిటీ లేదు… హౌజులో ఆ వెగటు కూతల, బూతుల, పెత్తందారీ పెడపోకడల శివాజీకి పాలేరుగా మారాడు… తను ఏది చెబితే అది… చివరకు శివాజీని ఎలిమినేట్ చేస్తే కూడా తన కాళ్ల మీద పడి ఏడుస్తూ తెగ చిరాకు పుట్టించాడు… ఓ కామన్ మ్యాన్, ఓ రైతు బిడ్డ అనే ట్యాగ్‌ను బిగ్‌బాస్ టీం ప్రమోట్ చేయడం వెనుక కూడా వాళ్ల తాలూకు ఓ ఫేక్ డ్రామా, కమర్షియల్ పర్పస్ ఉంది… సోషల్ మీడియా ఇకారాలు తప్ప సోషల్ రెస్పాన్సిబులిటీ ఏమీ లేదు ప్రశాంత్ గెలుపులో… నాలుగు రోజులు పోతే ఎవడూ మాట్లాడడు తన గురించి…
అజ్ఞానానికి తోడు అరాచకం… తను గెలిచి బయటికి రాగానే ఫ్యాన్లు అట… వీరంగాలు, కేకలు, ట్రాఫిక్ జామ్… ఆర్టీసీ బస్సులపై, పోలీస్ వెహికిల్‌పై దాడులు… ఆల్‌రెడీ అక్కడి నుంచి వెళ్లిపోయినవాడు మళ్లీ వచ్చాడు… పోలీసులు అక్కడి నుంచి తన కారు క్లియర్ చేస్తుంటే ‘‘రైతుబిడ్డ అనే గౌరవం కూడా లేదు వీళ్లకు’’ అని ప్రశాంత్ ఆరోపిస్తున్న వీడియో కనిపించింది… చేసేది సొసైటీ మీద దాడి… పైగా రైతుబిడ్డ అని పోలీసులు గౌరవించాలట… తెలంగాణలో కోటి మంది రైతు బిడ్డలు ఉన్నారురా నాయనా..? నీలాగా ఫేక్ డ్రామాలు, ఫార్స్ సీన్ల బాపతు రైతు బిడ్డలు కారు… సో, స్థూలంగా బర్రెలక్క సొసైటీకి ఉపయోగపడే ఓ అమాయకత్వం, ఓ మొండితనం… ప్రశాంత్ సొసైటీకి ఏమాత్రం పనికిరాని ఓ అరాచకం, ఓ నాటకం..! ఒకరి పేరు వినమ్రత… మరొకరి పేరు వికారం…!!
Share this Article