Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న కథ… సినిమా ట్విస్టులూ లేని కథ… కానీ కొలవలేనంత లోతుంది…

September 16, 2023 by M S R

ఓ కథ చదివే ముందు ఓ సోషల్ ట్రెండ్ గుర్తుతెచ్చుకొండి… నువ్వు ఈ పనిచేస్తూ ఫోటో పోస్ట్ చేయగలవా..? ఎందరికి చాలెంజ్ విసురుతావు..? చాలెంజ్‌కు గురైనవాళ్లు కూడా ఆ పనులుచేసి, ఫోటోలో పోస్ట్ చేసి, మరో నలుగురిని చాలెంజ్ చేయాలి… ఇదొక చైన్ స్కీమ్… ఐస్ గడ్డలు నెత్తి మీద గుమ్మరించుకుంటావా..? మీసాలు, గడ్డాలు గొరిగించుకుంటావా..? ఇలాంటివి…

ఇప్పుడు ఫేస్ బుక్‌లోనే కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు స్వేచ్చానువాదం చదవండి… స్థానికరించబడిన అనువాదం… అనగా లోకలైజ్ చేయబడిన అని అర్థం…



ఓ రోడ్డు పక్కన ఒకాయన గుడ్లు అమ్ముతున్నాడు… పల్లీలు, ఒనగాయ (లేత చింతకాయ), పత్రి, పూలు, మొక్కజొన్న కంకులు, కూరగాయలు, చిన్న బొమ్మలు, కందగడ్డ ఎట్సెట్రా అమ్మేవాళ్లలో ఎవరో ఒకరు అనుకొండి… పోనీ, చిన్న చిన్న వినాయకుడి ప్రతిమలు అనుకొండి… అప్పటికప్పుడు పుట్టమన్నుతో చేసిన గణేషులను అచ్చుపోసి, ఓ కాగితంలో పెట్టి అందిస్తాడు మన చేతులకు… సరే, కథలోకి వద్దాం…

Ads

ఓ కారు ఆ గుడ్ల అమ్మకందారు దగ్గర ఆగింది… అందులో నుంచి ఓ లేడీ వాయిస్… దిగలేదు… ఇదుగో అబ్బాయ్… గుడ్లు ఎలా అమ్ముతున్నవ్..? ఆమెకన్నా సదరు గుడ్ల అమ్మకందారు వయస్సులో పెద్దాడే… ఐనా అబ్బాయ్ అనే పిలిచింది…

ఒక గుడ్డు ఐదు రూపాయలమ్మా…

ఐదు రూపాయలా..? మరీ గంతఘనం పిరమా..? (అంత ఎక్కువా..?)

అగ్గువేనమ్మా… (చౌక)

ఇదుగో ఆరు గుడ్లు కావాలె, 20 రూపాయలిస్తా, అంతకుమించి ఆఠానా కూడా ఇవ్వను…

ఇంకో ఐదు రూపాయలు ఇవ్వమ్మా… ఈరోజు అసలు బోణియే (తొలి విక్రయం) కాలేదు… ఏమీ అమ్మకపోతే ఈరోజే గడవదు నాకు… కనీసం ఒక ట్రే అమ్మకపోతే రాత్రి తిండీ కష్టమే…

కథలు చెప్పకు, 20కు ఇస్తవా ఇవ్వవా

సరేనమ్మా, ఇదుగో తీసుకో…

కారు దగ్గరకు వెళ్లి, జాగ్రత్తగా గుడ్లు పెట్టిన కవర్ అప్పగించాడు… 20 తీసుకున్నాడు… ఆ కళ్లల్లో నిర్వేదం… బేరమాడిన లేడీ ఏదో విజయం సాధించినట్టు తలెగరేసి, గేర్ మార్చి, రయ్యిమని కారు పరుగు తీయించింది…

ఆ కారు మరింత దూరంలోని ఓ దాబా వద్ద ఆగింది… అది దాబా కమ్ థీమ్ రెస్టారెంట్… ఆ లేడీ తన దోస్త్‌తో పాటు కారు దిగింది… లోపలకు వెళ్లింది… ఏవేవో డిషెస్ ఆర్డరిచ్చింది…

తినడం అయిపోయింది… సగానికి పైగా ప్లేట్లలోనే వదిలేశారు… సుతారంగా గతకడం అయిపోయాక, బేరర్ 3250 రూపాయల బిల్లు తెచ్చిచ్చాడు… ఆమె 500 రూపాయల నోట్లు ఏడు లెక్కపెట్టి ఆ బిల్లు తెచ్చిన ప్లేటులో వేసింది… మిగతావి నీకు టిప్ అన్నది అతిశయంగా… బేరర్ కనీసం సెల్యూట్ కూడా కొట్టలేదు ఆమెకు…

ఇందులో ఏముంది..? సినిమా కథల్లా ట్విస్టులు ఏమున్నాయి అని ఆలోచిస్తున్నారా..? పైన చెప్పింది కథ ఎందుకవుతుంది..? రోజూ చూస్తున్నదే కదా అనుకుంటున్నారా.,.? మీ ఆలోచన నిజం… వీటిల్లో ట్విస్టులు ఉండవు… ఏదో ఒకటి అమ్ముకోకపోతే గానీ ఆ రోజు గడవని చిన్నాచితకా వ్యాపారుల జీవితాలు మాత్రమే ఉంటాయి…
మీరు గమనించారో లేదో ముసలివాళ్లు వణికే చేతులతో మనకు ‘సరుకులు’ అమ్ముతుంటారు రోడ్ల పక్కన కూర్చుని… ఎండలో, చలిలో… కానీ మనం ఎందుకు అలాంటి వాళ్ల దగ్గరే గీచి గీచి బేరాలు ఆడుతున్నాం..? సదరు రెస్టారెంట్లలో వాడు చెప్పిన రేట్లను గమ్మున కట్టేసి వస్తుంటాం… నిజంగా మనం ఇచ్చే రూపాయి లాభం నుంచి బతికే బతుకుల్ని ఎందుకు ఆలోచించడం లేదు… ఒక ఎగ్ సెల్లర్ మాత్రమే కాదు, ఇలా ఎందరో కదా…
ఓ సుబ్బారావు ఈ కథ ఎక్కడో చదివాడు… తన తండ్రి తరచూ అలాంటి ‘వ్యాపారుల’ వద్దే (వ్యాపారి అనే పదం వీరికి వర్తిస్తుందా..? ఇలా అనొచ్చా..?) ఏదో ఒకటి కొంటుంటాడు… అవసరం లేకపోయినా కొంటూ ఉంటాడు చాలాసార్లు… అడిగిన రేటుకు కాస్త ఎక్కువే ఇస్తాడు… చిల్లర కోసం వాళ్ల తమ చింకిచాపల (గల్లాపెట్టెలు) కింద వెతుకుతూ ఉంటే, పర్లేదు మళ్లీ వచ్చినప్పుడు తీసుకుంటాలే అని కదిలి వెళ్తుంటాడు…

ఎందుకు నాన్నా, ఇలా వదిలేస్తావు, అవసరం లేకపోయినా కొంటావు అనడిగాడు సుబ్బారావు… ఇవ్వాలనుకుంటే నేరుగా డబ్బు దానం చేయొచ్చు కదా అన్నాడు… ‘కాదు బిడ్డా… ఊరికే ఇస్తే అది దానం, వాళ్లు బిచ్చగాళ్లు కాదు, అలా ఇచ్చి మనం అవమానించడమూ కరెక్టు కాదు… మనం దానాన్నే చేస్తుండవచ్చుగాక, కానీ డిగ్నిటీ అనే కవర్ చుట్టి ఇస్తున్నాం… వాళ్లకు మర్యాద, మనకూ పుణ్యం…



ఇప్పుడు చెప్పండి… కథ చదివారు కదా… ఫలానా ముసలామె దగ్గర నాలుగు జామకాయలు కొన్నాను… వంద రూపాయలు ఇచ్చాను అంటూ ఆమెతో ఓ సెల్ఫీ తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి, మరో నలుగురిని ట్యాగ్ చేసి చాలెంజ్ విసరగలరా..? మీ గుండె లోతును ప్రదర్శించగలరా..? (ఓ ఇంగ్లిష్ కథకు ఇది అనువాదం…) ఈ సందర్భంగా మరో చిన్న సంగతి… పావు కిలో కందిపప్పో, ఓ కొబ్బరికాయో కావాలంటే అర్జెంటుగా వీథి మొదట్లో వెలిసిన మాల్‌లోకి ఉరకకండి… మీకు సమీపంలోనే ఓ చిన్న కిరాణం షాపు ఉంటుంది… అక్కడ కొనండి… ఓ కుటుంబం బతుకు అది… మొన్న కరోనా కాలంలో తమ ప్రాణాలకు తెగించి, తెలిసినవాళ్లందరికీ సరుకులు ఉద్దెర ఇచ్చిన హృదయులు వాళ్లు… ఓ రూపాయి ఎక్కువే ఇవ్వండి, పర్లేదు… వాళ్లేమీ బిల్డింగులు కట్టరు దాంతో… కడుపు నింపుకుంటారు… అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions