.
ఆయన గోడ వైపు చూస్తూ… ‘నీకే చెబుతున్నా, ఈరోజు ఆలస్యమవుతుంది, నువ్వు తినేసి పడుకో’ అంటున్నాడు… ఆమె స్టవ్వు మీద మూకుడు వైపు చూస్తూ ‘ఈరోజేమైనా కొత్తా..? సర్లే’ అంటోంది…
ఏదో పట్టింపు.., భార్యాభర్తలన్నాక గొడవలే జరగవా..? కోపం… దాంటో మాటలు బంద్… చాలా ఇళ్లలో జరిగేదే… ఇప్పుడంటే డిష్యూం డిష్యూంలు… మరీ అహాలు దెబ్బతింటే నేరుగా ఫ్యామిలీ కోర్టుకే…
Ads
ఇప్పుడు మాటలు బంద్ పెట్టడాల్లేవ్… బూతులే… అటూ ఇటూ… ఇంతకుముందు దాదాపు ప్రతి ఇంట్లో ఈ ‘మాట బంద్’ నిరసన, ఆగ్రహ ప్రకటన కామన్… ప్రేమ, బాధ్యత ఏమీ తగ్గవు, తాత్కాలిక తాటాకు మంట… అంతే… ఈ తరానికి తెలియని ఒకప్పటి కోపప్రకటన, వ్యక్తీకరణ అది…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… నిన్న ఓ వార్త… జపాన్‌లో ఓ జంట ఏకంగా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూనే 20 ఏళ్లు మాట్లాడుకోలేదు… అది మామూలు విశేషం కాదు… అందుకే వార్తయ్యింది…
1997… జపాన్… భర్త ఒటో కటయామా, భార్య యుమి… ఏదో వాదన జరిగింది… అంతే, భర్త మాటలు బంద్ పెట్టేశాడు… ఇద్దరి మధ్య నిశ్శబ్దం… సుదీర్ఘంగా… 20 ఏళ్లు అలాగే… ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందని కాదు… అదలాగే ఉంది… నిశ్శబ్దమూ అలాగే ఉంది… చిక్కగా…
భార్య యుమి అప్పుడప్పుడూ భర్తతో మాట్లాడటానికి ప్రయత్నించినా సరే, భర్త వినిపించుకోలేదు… అఫ్‌కోర్స్, దాంపత్య జీవితానికి ఢోకా ఏమీలేదు… వాళ్ల నడుమ మాటలు లేవు తప్ప అన్నీ మామూలుగానే సాగిపోతున్నాయి… మరి కమ్యూనికేషన్..? ఏమో, అలా సైగలు, కంటిచూపులతోనే సందేశాలు… ఇద్దరికీ ఇక అలవాటైపోయింది…
ముగ్గురు పిల్లలు… ఈ అగాధాన్ని చూస్తూనే పెరిగారు… పెద్ద వాళ్లయ్యారు… ఈ ఇద్దరి నడుమ నిలబడిన నిశ్శబ్దపు తెరను ఎలా చించేయాలో అర్థం కాలేదు… చివరకు ఆ దంపతుల చిన్న కొడుకు యోపికి ఓ ఆలోచన తట్టింది… ప్రయత్నిద్దాం అనుకున్నాడు…
ప్లాన్ ప్రకారం ఒక టీవీ షో వారి సహకారం తీసుకున్నాడు… ఒక పార్కులో (2017) సమావేశం ఏర్పాటు చేశాడు… అది తమ తల్లిదండ్రులకు మొదట్లో ప్రేమ చిగురించిన తోట… ఏవేవో విషయాలు, కారణాలు చెప్పాడు… చొరవ తీసుకుని ఆ భేటీకి ఇతరులతోపాటు తల్లిదండ్రులను కూడా తీసుకుపోయాడు…
అందరూ సమావేశమయ్యాక… ఒక్కొక్కరు తమ మనసులోని భావాలు, ప్రేమల గురించి మాట్లాడాలని కోరాడు… తరచూ తలెత్తే అపార్థాలు, గొడవలు ఎలా సమసిపోయాయో కూడా చెప్పాలన్నాడు… ఒక్కొక్కరూ మాట్లాడుతున్నారు…
తమ ప్రేమ బంధం గురించి చాలా విషయాలు చెబుతున్నారు… ఈ క్రమంలో ఈ భర్త మనసు కూడా కదిలింది… ఒక పశ్చాత్తాప భావన… అపరాధ భావం… హఠాత్తుగా ఓ భావోద్యేగానికి గురైన అతను 20 సంవత్సరాల నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ… తన భార్య యుమి వైపు చూస్తూ… గద్గద స్వరంతో ‘‘నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను… నీతో మాట్లాడకుండా ఉన్నాను… కానీ నీ మీద ప్రేమ తగ్గలేదు నాకు, నువ్వు నా ప్రాణం… ఇక ఈ నిశ్శబ్దాన్ని భరించలేను… ‘ అని చెప్పుకొచ్చాడు…
ఆ ఇద్దరి ఆలింగనం… కన్నీళ్లు… చుట్టూ చేరిన వాళ్లు అభినందించారు… చప్పట్లతో పార్కు మారుమోగిపోయింది… ఆ ముగ్గురు పిల్లల కళ్లలో కాంతులు… ఈ సంఘటన జపాన్లోని టెలివిజన్ షోలో కూడా ప్రసారమైందట… అనేక మంది హృదయాలను కదిలించింది… సంబంధాలలో కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను అది అందరికీ ఆ షో ద్వారా గుర్తు చేసింది….!!
Share this Article