Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

2025 …. ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం…

January 1, 2025 by M S R

.

కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే.

పొద్దుపొడుపు- పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేం. రావాల్సిన ఒక్క క్షణాన్ని కూడా ముందుగానే తీసుకురాలేం. కాలకృతి చేతిలో ఆకృతులం.

Ads

అనంతకాలానికి ఆది లేదు. తుది ఉండదు. కానీ మనకు మాత్రం ఆది- అంతాలు ఉంటాయి. ఉండి తీరాలి. మనం కాలానికి అతీతులం కాము. అందుకే “కాలాతీత విఖ్యాతుడు” పరబ్రహ్మ ఒకడే అన్నాడు త్యాగయ్య.

మనవన్నీ దిన చర్యలే. ఉదయం లేవాలి. తినాలి. పడుకోవాలి. మళ్లీ లేవాలి. మళ్లీ పడుకోవాలి. ఇదే పునరపి…పునరపి…

సృష్టికి ఆటోమేటిక్ అలారం ఉంటుంది. దానికి ఇంకొకరు అలారం పెట్టి సమయానికి తగు పనులు చేయాలని చెప్పాల్సిన పనిలేదు. మనకలా కాదు. అలారం తట్టి లేపాలి. గడియారం సమయం చెబుతూ తొందర పెట్టాలి. నిముషాల ముల్లు వేగంగా తిరగాలి. గంటల ముల్లు నెమ్మదిగా నడవాలి. భోజనానికి గంట కొట్టాలి. బడికి గంట కొట్టాలి. పూజకు గంట కొట్టాలి. ఉంటే గుండె గంట కొట్టాలి. పొతే చావు డప్పు కొట్టాలి. గడియారాన్ని చూస్తూ బతకాలి. టైమ్ వచ్చినప్పుడు గడియారాన్ని చూడకుండానే పోవాలి.

సృష్టి గడియారానికి- జీవ గడియారానికి- గోడ మీద లేదా చేతి గడియారానికి అంతర్గతంగా లంకె ఉంటుంది. పగలు పని చేయాలి. రాత్రి పడుకోవాలి. ఇది సృష్టి ధర్మం. మనమిప్పుడు పగలు పడుకుని రాత్రిళ్లు జడలు విప్పి నర్తిస్తున్నాం. ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆఫీసు వేళలు, ఇతర రోజువారీ కార్యక్రమాలు, సమస్త దైనందిన జీవితం ఈ జీవ గడియారం పరిధిలోనే ఉంటుంది. ఉండాలి.

కాలం కొమ్మకు-
చిగురించిన యుగాలెన్నో?
కుసుమించిన పుష్పాలెన్నో?
కాచి…పండి…రాలిపోయిన పళ్లెన్నో?
చీకటి దుప్పటి కప్పుకుని రెప్పవేసిన రాత్రులెన్నో?
వెలుగుపూల రేకులు విచ్చిన వేకువలెన్నో?
వాలిపోయిన పొద్దుల్లో వర్ణాల సుద్దులెన్నో?
రాలిపోయిన కాలం ఆకుల మాటున వినిపించే జ్ఞాపకాలెన్నో?
రానున్న కాలం ఇవ్వనున్న అనుభవాలెన్నెన్నో?

పల్లవి :

తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ!
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ!
నీ దోవ పొడవునా…కువకువల స్వాగతము
నీ కాలి అలికిడికి…మెలకువల వందనము

చరణం 1 :

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను మూర్తీ! నీ ప్రాణకీర్తన విని.. పలుకనీ
ప్రణతులనీ ప్రణవ శృతినీ.. పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని

చరణం 2 :

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తలయూచు
తలిరాకు బహుపరాకులు విని దొరలనీ
దోర నగవు దొంతరనీ… తరలనీ దారి తొలగి రాతిరిని

చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
గానం :   వాణీజయరాం

గతం గాయలెన్ని ఉన్నా…రేపటి ఆశల వెలుగులు ఆ గాయాలను మాయం చేస్తూనే ఉంటాయి. రోజూ రాత్రి పడ్డ చీకటి తెర తొలగి…పొద్దుటికి వెలుగు పూల వసంతం వస్తూనే ఉంటుంది. తెలిమంచు కరిగే వేళలో…ఇలగొంతు వొణికే వేళలో…లోకం తలుపు తెరిచి…సూర్యుడిని పిలిచి బొట్టు పెట్టి…ఏ రోజుకారోజు నవనవోన్మేష నవోదయ కావ్యాలు, కార్యాలు రచించాలి. తొలిపొద్దు కిరణాలు భూమిని తాకేవేళ పక్షుల కువకువల స్వాగతాల వందనం. సూర్యుడి కాలి అలికిడికి మన మెలకువే వందనం.

సూర్యుడి రాకకు పూల పులకింత గమకాలు. గాలికి పూసిన గంధాలు. లోక దైనందిన కావ్యంలో కొత్త పేజీ రాయడానికి ఉత్ప్రేరకాలు.

కిరణజన్యసంయోగ క్రియతో పత్రహరితప్రాణం నింపుకోవడానికి, ఒంపుకోవడానికి బంగారు కిరణాలు. జగతి ప్రతినిత్యం చైతన్యం నింపుకోవడానికి పొంగారు కిరణాలు.

2024 గతం రాత్రి దారి తొలగి…2025 రేపటి వెలుగులకు దారి ఇచ్చే ఉషోదయ వేళ…
నూతన సంవత్సర శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions