35 చిన్న కథ కాదు… అవును, చిన్న కథేమీ కాదు… చాలామందిని కనెక్టయ్యే కథే… చిన్నప్పుడు చాలామందికి కొరుకుడుపడని సబ్జెక్టులు రెండు… ఒకటి ఇంగ్లిషు, రెండు మ్యాథ్స్… చాలామంది డింకీలు కొట్టేది ఈ సబ్జెక్టుల్లోనే… ఈ సినిమా కథలోనూ అంతే…
ఓ పిల్లాడికి పదే పదే ప్రశ్నలు వస్తుంటాయి… ప్రశ్నలకు జవాబులు తెలియకుండా బుర్రకు ఎక్కవు లెక్కలు… అందుకని పదే పదే ఫెయిల్… మరో పిల్లాడికి లెక్కలంటే అసలు లెక్కే లేదు… అందుకే లెక్కకు మించి మార్కులొస్తుంటాయి… ఇక్కడ 35 అంటే… పాస్ మార్కులు… అది దాటితే గానీ లేదా కష్టమ్మీద ఆ మార్క్ చేరుకుంటే గానీ ఓవరాల్‌గా ఆ అకడమిక్ ఇయర్ గట్టెక్కము… సో, చిన్న కథేమీ కాదు… జీవితం అంటేనే గొట్టు లెక్కలు…
సినిమా తీయడం కూడా అంతే… అదీ ఓ క్లిష్టమైన లెక్కే… నటీనటుల ఎంపిక దగ్గర నుంచి మార్కెటింగ్ టెక్నిక్స్ దాకా… చాలా కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు… అన్నీ పోను ఏమైనా మిగిలితే శేషం లాభం… మైనస్ తేలితే అవశేషం నష్టం… ఈ సినిమా కమర్షియల్‌గా ఏమేరకు సక్సెస్ అనేది వదిలేస్తే… ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు అభినందించదగినవి…
Ads
కథ ఎంపిక… మన సగటు సినిమా అంటేనే ఫార్ములా, రొటీన్, ఇమేజీ బిల్డప్పులు, సూపర్ హీరోయిజాలు, పగలు, ప్రతీకారాలు, స్టెప్పులు, ఫైట్లు, ఐటమ్ సాంగ్స్ అంతే కదా… కానీ ఇదలా కాదు, భిన్నమైన కథ… అంతే భిన్నంగా ప్రజెంట్ చేయడం… లెక్కలు అనే సబ్జెక్టు మీద లెక్క ప్రకారం సీన్లు రాసుకుంటూ, పేర్చుకుంటూ చివరి దాకా ఆసక్తికరంగా తీసుకుపోవడం…
ప్రధాన పాత్రకు నివేదా థామస్ ఎంపిక, సహజంగానే మంచి నటి… మంచి పాత్ర దొరికాక ఇక లోటేముంది..? సహజంగా తెలుగు సినిమా హీరోయిన్ అంటే హీరో పక్కన పిచ్చి గెంతులు వేయడమే కదా… కానీ ఇది దానికి పూర్తి కంట్రాస్టు పాత్ర… కథానాయిక… సినిమాకు ఆమే పెద్ద ప్లస్సు… తోడుగా విశ్వదేవ్, ప్రియదర్శి… అసలు ఆ పిల్లలందరి నుంచీ ఆ నటనను రాబట్టుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది…
ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద బలం సాధనసంపత్తి బలంగా ఉన్నవాళ్ల అండ… దగ్గుబాటి రానా ప్రజెంట్ చేయడం ఇంట్రస్టింగ్, అభినందనీయం… రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు వెన్నుదన్నుగా నిలబడితే మంచి సినిమాలు ఎందుకు రావు..? మలయాళం, తమిళమే కాదు… తెలుగులోనూ వస్తాయి… ఎంతసేపూ సోకాల్డ్ మాస్ మసాలా కమర్షియల్ వాసనల్లో పడి దొర్లడమేనా..?
లెక్కల్లో సున్నా విలువెంత..? ఒంటరిగా ఉంటే ఏ విలువా లేదు… ఏదో అంకె పక్కన చేరితే అమాంతం విలువ పెరిగిపోతుంది… ఎందుకు..? రెండును సున్నాతో గుణకారం చేస్తే ఆ రెండు అనే అంకే లేకుండా పోవడం ఏమిటి..? సున్నా అంటేనే ఏమీ లేకపోవడం కదా, మరి సున్నాకు తగ్గితే మైనస్ ఏమిటి..? మనకూ వచ్చేవి ప్రశ్నలు… జవాబుల్లేకుండానే లెక్కలు చేసేసి, పాస్ అయిపోయేవాళ్లం…
నిజానికి ఇలాంటి సినిమాలు మన ప్రేక్షకుల్ని థియేటర్ల దాకా రప్పించలేవు… మనం ఒకే తరహా సినిమాల్ని చూడటానికి అలవాటుపడిపోయాం, కాదు, అలవాటు చేశారు… పైగా ఇప్పుడు థియేటర్ల దోపిడీలకు భయపడి చాలామంది థియేటర్ల వైపే వెళ్లడం లేదు… ఓటీటీలు వచ్చాక మరీనూ… ఇదీ మినీ పాన్ ఇండియా సినిమాయే… తమిళం, మలయాళంలో కూడా… మొత్తానికి సినిమా విషయంలో దర్శకుడు నందకిషోర్, నిర్మాతలతోపాటు అభినందించాల్సిన విషయం దగ్గుబాటి రానా సపోర్ట్ అండ్ టేస్ట్..!
Share this Article