నాన్నా… బతుకు మీద చిరాకు పెరుగుతోంది… వైరాగ్యం వస్తోంది… ఎటైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది… ఏదైనా ఆశ్రమంలో చేరితే ప్రశాంతత వస్తుందా..?
ఏమైంది బిడ్డా… ఆ కన్నీళ్లు దేనికి..? ఆ ఆందోళన దేనికి..? కష్టాలు, సవాళ్లు లేకపోతే అది మనిషి బతుకెలా అవుతుంది..? లెట్ దెమ్ కమ్…
లేదు నాన్నా… ఒక సమస్య నుంచి బయటపడితే మరో సమస్య రెడీగా ఉంటోంది… బతుకంతా పోరాటమేనా..? సమస్యలతోనే జీవితమా..?
Ads
ఆ తండ్రి ఓ చెఫ్… ఆమెను కిచెన్‌లోకి తీసుకెళ్లాడు… మూడు చిన్న మట్టి కుండల్ని తీసుకున్నాడు, స్టవ్వు మీద పెట్టాడు, నీళ్లు పోశాడు, పెద్ద మంట మీద మరిగించాడు… నీళ్లు మసలడం ప్రారంభమయ్యాక ఒక దాంట్లో ఆలుగడ్డలు వేశాడు… మరోదాంట్లో గుడ్లు వేశాడు… మూడో దాంట్లో కాఫీ గింజల్ని వేశాడు…
ఆమెను కూర్చోమన్నాడు, తనూ కూర్చున్నాడు… వెయిట్ అండ్ వాచ్ అన్నాడు… ఒక్క మాటా అదనంగా మాట్లాడటం లేదు తను… ఆమెలో అసహనం పెరుగుతోంది… కానీ అలా చూస్తూ ఉండిపోయింది చేసేదేమీ లేక… తండ్రి ఏం చేస్తున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు…
ఓ ఇరవై నిమిషాల తరువాత బర్నర్లు ఆఫ్ చేశాడు… ఆలుగడ్డల్ని ఒక పాత్రలోకి, గుడ్లను మరో పాత్రలోకి తీసుకున్నాడు…
తరువాత కాఫీని బయటికి తీసి, ఓ కప్పులోకి చేర్చాడు… ‘బిడ్డా, ఏం గమనించినవ్..?’
‘ఏముంది ఇందులో… ఆలుగడ్డలు, గుడ్లు, కాఫీ… అంతే కదా…’
‘కాస్త దగ్గరగా పరిశీలించి చెప్పు తల్లీ… ఆలుగడ్డల్ని టచ్ చేసి చూడు ఓసారి…’
‘అవును, ఇవి మెత్తగా ఉన్నయ్’
‘ఇప్పుడు ఆ గుడ్లను పగులగొట్టి చూడు…’
‘మంచిగా ఉడికాయి… వెంటనే తినేయవచ్చు…’
‘కాఫీని రుచి చూసి చూడు…’
ఆ కాఫీ పరిమళం, రుచి ఆమె మొహంలోకి ఒక్కసారిగా కాస్త మందహాసాన్ని తీసుకొచ్చాయి… విసుగు, అసహనం మాయమయ్యాయి… ప్రసన్నత ప్రత్యక్షమైంది…
‘నాన్నా, ఇంతకీ ఏం చెప్పాలనుకున్నవ్ నాకు..?’
‘ఏమీ లేదు బిడ్డాా… ఆలుగడ్డలు, గుడ్లు, కాఫీ గింజలు సేమ్ ప్రతికూలతల్ని ఎదుర్కున్నయ్… మరుగుతున్న నీటిలో ఉడికిపోయాయ్… ఒక్కొక్కటీ ఒక్కోలా రియాక్టయింది… నిజానికి ఆలుగడ్డ గట్టిగా ఉంటుంది, మరిగే నీళ్ల సవాల్‌తో మెత్తబడింది, బలహీనపడింది… గుడ్డు పెళుసు… పైన పెంకు లోపల ఉన్న జీవపదార్థాన్ని కాపాడుతూ ఉండేది, ఉడుకు నీళ్లలో పడగానే లోన ఉన్న సాత్వికమైన పదార్థం కూడా గట్టిపడిపోయింది… కానీ కాఫీ గింజలు భిన్నంగా రియాక్టయ్యాయి… రుచిని ఇచ్చాయి… చుట్టూ ఓ మధుర పరిమళాన్ని వ్యాపింపచేశాయి…
ఆ బిడ్డ ఆలోచనల్లో పడింది…
‘ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు..? ఆలుగడ్డవా..? కోడిగుడ్డువా..? కాఫీగింజవా..? ప్రతికూలత నీ తలుపు తట్టినప్పుడు ఎలా రియాక్టవుతావు..?’
బిడ్డ ఏమీ మాట్లాడలేదు…
‘ప్రతి మనిషికీ సమస్యలొస్తాయి బిడ్డా… అది మన డెస్టినీ… ఏది వస్తే అది స్వీకరిద్దాం… పోరాడదాం… గెలుపో ఓటమో కూడా డెస్టినీకే వదిలేద్దాం… మన చుట్టూ సవాళ్లు, సమస్యల్నే కాదు, మనలోపల ఏం మార్పులు వస్తున్నయ్, గట్టిపడుతున్నమా..? మెత్తపడుతున్నమా..? అవీ గమనించుకుందాం… పరిమళాల్ని పంచడానికే ప్రయత్నిద్దాం… నేను ఎదుర్కున్న పరీక్షలతో పోలిస్తే నువ్వు ఎదుర్కునే సమస్యలు అసలు సమస్యలే కావు… కానీ నేనెక్కడికీ పారిపోలేదు బిడ్డా… ఇప్పుడు చెప్పు… నువ్వు ఎవరు..?’
(సోషల్ మీడియాలో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా స్వేచ్ఛానువాదం… శ్రీనివాసరావు మంచాల)
Share this Article