రీచ్ హఠాత్తుగా ఘోరంగా పడిపోతుంది… డబ్బులు కట్టు, రీచ్ పెంచుకో అంటాడు వాడు… పేరుకు 2 లక్షల ఫాలోయర్లు, కానీ ఎంత మంచి పోస్టు పెట్టినా నాలుగయిదు వేల రీచ్ ఉండదు… అంతేకాదు… ఒకప్పుడు ఉన్న వాళ్లలో మెజారిటీ ఇప్పుడు కనిపించడం లేదు… చాలామంది దూరమైపోయారు, లేదా నామ్‌కేవాస్తే ఖాతాలు మెయింటెయిన్ చేస్తున్నారు…
వాళ్ల ప్లేసులో గలీజు గాళ్లు, ట్రోలర్లు, రాజకీయ పార్టీల వీర ఫ్యాన్స్, నాయకుల అనుచరులు, ఫేక్ ఖాతాలు… దీనికితోడు కంప్యూటరే లైకులు కొట్టి, షేర్లు చేసి, పోస్టులు పెట్టే బోట్స్… ఏది నిజమో తెలియదు, ఏది మార్ఫింగో తెలియదు… అది తెలుసుకునే యంత్రాంగం వాడికి లేదు… ఎవడైనా రిపోర్ట్ చేస్తే యాక్షన్, ఖాతా స్తంభన… ఇందులో అభ్యంతరకరం ఏముంది అనడగడానికి ఎవడూ అందుబాటులో ఉండడు… మేం ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పుకునేవాడికి సముద్రం వంటి ఫేక్ ఇంటెన్షనల్స్ కనిపించరు…
లైకులకు రేటు, రీచ్‌కు రేటు.., ఇదంతా ఓ మాయా వ్యాపార ప్రపంచం… మొన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కనిపించింది ఓ వార్త… అదేదే సర్వే ప్రకారం 2025 నాటికి ఒరిజినల్, జెన్యూన్ ఖాతాదారులు 50 శాతం వదిలేయడమో లేక పూర్తిగా లిమిట్ చేసుకోవడమో జరుగుతుందట… ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్… ఏది చూసినా ఏమున్నది గర్వకారణం… ఇక చెత్తా వీడియోలతో యూట్యూబ్ ఏనాడో భ్రష్టుపట్టింది… రీల్స్, షార్ట్స్ వీడియోల్లో బూతు, అశ్లీలం మనకు తెలియకుండానే మన బుర్రల్లోకి చేరిపోతోంది…
Ads
కొంతలోకొంత వాట్సప్ నయం… వీడియో కాల్స్‌కు, గూపు కాల్స్‌కు, మెసేజులకు, గ్రూపులకు, లొకేషన్ షేరింగ్‌కు బాగా అనుకూలం… ఇప్పుడైతే వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ వేస్ట్… బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, ఇతర సర్వీస్ సంస్థలేవైనా సరే ‘చెక్ యువర్ వాట్సప్’… అలా అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థగా మారిపోయింది…
ఇతర సోషల్ మీడియా వ్యవస్థలకు వస్తే… గత ఐదేళ్లతో పోలిస్తే దాదాపు 53 శాతం మంది అన్నీ మూసుకున్నారట… ఏదో ఖాతా ఉందంటే ఉంది… అసలే మూలిగే నక్క, ఇప్పుడు కృత్రిమ మేధ వచ్చాక అది తాటిపండు పడ్డట్టయింది… ‘‘సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటికీ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఛానెల్, కానీ వినియోగదారులు వేగంగా తమ యాక్టివిటీనీ తగ్గించేసుకుంటున్నారు’’ అంటున్నాడు Gartner Marketing Practice సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చర్ ఎమిలీ వీస్…
సోషల్ మీడియా కూడా విపరీతంగా మార్కెటింగ్ యాడ్స్, ప్రమోటెడ్ పోస్టులకు ప్రయారిటీ ఇస్తోంది… అందరు ఖాతాదారులు అనుభవిస్తున్నదే… పోనీ, చైనాలో ఉన్నట్టుగా మనకంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా అంటే అదీ లేదు… సోషల్ మీడియా లేనిదే సోషల్ లైఫ్ లేదనే భ్రమల నుంచి ఇక జనం బయటికి వచ్చేస్తున్నారు…
చాలా మంది టెకీలు, వృత్తి నిపుణులు అసలు ఏమీ పోస్ట్ చేయడం లేదు… వాళ్ల పోస్టులపై కూడా నిఘా ఉంటోంది… కమ్యూనిటీ స్టాండర్డ్స్, లాకింగ్ ప్రొఫైల్స్ ఎట్సెట్రా కూడా వాళ్లు నమ్మడం లేదు… జస్ట్, ఇగ్నోర్ చేస్తున్నారు… అవునూ, ఒక లోపరహిత సోషల్ మీడియా యాప్ ప్రభుత్వమే ఎందుకు డెవలప్ చేయకూడదు..?! ప్రత్యేకించి ఫేక్ ఖాతాల్లేని ‘ఆధార్ లింక్డ్’ యాప్… ఏమో, ఆ పెద్ద మనిషి ఫాలోయర్ల సంఖ్యపైనే అతి పెద్ద డౌట్… తనెందుకు చేస్తాడు..?!
Share this Article