.
500 ఏళ్ల అబద్ధం… తిమ్మరుసును రాయలు శిక్షించనే లేదు…
విజయనగర సామ్రాజ్య చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టంగా మనం చెప్పుకునే ‘మహామంత్రి తిమ్మరుసు కళ్లు పీకించిన ఉదంతం’ అసలు జరగనే లేదంటే మీరు నమ్ముతారా? అవును, మనం ఐదు శతాబ్దాలుగా ఒక కట్టుకథను నిజమని నమ్ముతున్నాం.
Ads
విజయనగర సామ్రాజ్య వైభవానికి మూలస్తంభం అప్పాజీ (తిమ్మరుసు). రాయలవారిని ప్రాణాల కంటే మిన్నగా చూసుకున్న ఆ మహామంత్రి, కళ్లు లేని గుడ్డివాడిగా మారి జైలులో ప్రాణాలు విడిచాడనేది చదువుకున్నవారికి కూడా ఒక చేదు నిజంలా అనిపిస్తుంది. కానీ, చారిత్రక ఆధారాలు ఈ విషాదాంతాన్ని పచ్చి అబద్ధమని తేల్చి చెబుతున్నాయి.

అపవాదుకు మూలం: ఒక విదేశీ యాత్రికుడి పుకారు
ఈ ‘కనుగుడ్ల కథ’కు బీజం వేసింది పోర్చుగీసు యాత్రికుడు ఫెర్నావో నూనిజ్. రాయల కుమారుడు తిరుమల రాయల మరణానికి తిమ్మరుసు కుమారుడే కారణమని రాజు నమ్మాడని, అందుకే వారిని అంధులను చేశాడని నూనిజ్ రాశాడు. విదేశీ యాత్రికులు ఆ కాలంలో వీధిలో విన్న పుకార్లను కూడా చరిత్రగా రాసేవారు. సమకాలీన కవుల రచనల్లో గానీ, అధికారిక రికార్డుల్లో గానీ ఎక్కడా ఈ ప్రస్తావనే లేదు.
చారిత్రక ఆధారాలు: శాసనాలు చెబుతున్న సత్యం
చరిత్ర పరిశోధకులు నేలటూరి వెంకటరమణయ్య, కె.ఎ. నీలకంఠ శాస్త్రి లాంటి దిగ్గజాలు శాసన ఆధారాలతో ఈ కథను కొట్టిపారేశారు.
1. తిరుమల శాసనం:- కృష్ణదేవరాయల మరణం తర్వాత కూడా తిమ్మరుసు పేరుతో తిరుమలలో దానధర్మాలు జరిగినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. శిక్ష పడ్డ ‘రాజద్రోహి’కి ఇలాంటి గౌరవం ఏ రాజ్యమూ ఇవ్వదు.
2. పదవుల కొనసాగింపు: రాయల తర్వాత వచ్చిన అచ్యుతదేవరాయల కాలంలో కూడా తిమ్మరుసు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నతమైన రాజ పదవుల్లో కొనసాగారు. ఇది ఆ కుటుంబంపై ఎలాంటి నేరం లేదు అనడానికి బలమైన సాక్ష్యం.
నాటకీయతలో చరిత్ర బలిపశువు
తెలుగు సాహిత్యం, నాటకాలు, సినిమాలు ‘సెంటిమెంట్’ పండించడం కోసం చరిత్రను వక్రీకరించాయి. ఒక మహోన్నతమైన రాజు, తన తండ్రి లాంటి మంత్రిని శిక్షించడం కథలో గొప్ప డ్రామా. అందుకే రచయితలు ఈ విషాదాంతాన్ని వాడుకున్నారు.
మరణానికి అసలు కారణం పుత్ర వియోగం
రాయల కుమారుడు తిరుమల రాయలు విషప్రయోగం వల్ల చనిపోలేదు. ఆ రోజుల్లో ప్రబలిన మశూచి (Smallpox) లాంటి అంటువ్యాధుల వల్లే ఆ చిన్నారి మరణించాడని చరిత్రకారులు నిర్ధారించారు. పుత్ర వియోగంతో రాయలు మానసిక కృంగుబాటుకు గురైన మాట వాస్తవమే కానీ, దానికి అప్పాజీతో సంబంధం లేదు.
మచ్చలేని అప్పాజీ
తిమ్మరుసు లేకపోతే కృష్ణరాయలు లేడు…కృష్ణరాయలు లేకపోతే తిమ్మరుసు లేడు. సవతి తల్లి కుట్ర నుండి రాయలను కాపాడటానికి మేక కళ్లు చూపించి ప్రాణదానం చేసిన వాడు తిమ్మరుసు. అలాంటి వ్యక్తిపై రాయలు కత్తి కడతాడనుకోవడం కేవలం మన భ్రమ.

పెనుగొండలో ఉన్నది తిమ్మరుసు సమాధి కాదు, అది ఒక స్మారక కట్టడం మాత్రమే. తిమ్మరుసు కుల సంప్రదాయం ప్రకారం ఆయనకు దహన సంస్కారాలే జరిగి ఉంటాయి. 500 ఏళ్ల ఈ కట్టుకథను పక్కన పెట్టి, వారి మధ్య ఉన్న అపూర్వ బంధాన్ని గౌరవించడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article