మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం చేద్దాం..? మన చేతిలో పనై ఉంటే చాలా బెటర్… నమ్మకంగా ఉపయోగపడే పనైతే మరీ బెటర్… వాళ్ల స్టీల్ ప్లాంటులోనే ఓ ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంది… కానీ అది ఉత్పత్తి చేసేది ఇండస్ట్రియల్ ఆక్సిజన్… దాంట్లో కొంతమేరకు మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించొచ్చు… కానీ రవాణా కష్టాలుంటయ్… ఆలస్యాలుంటయ్… అసలు మనమే ఓ టెంపరరీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు..?
ఈ ఆలోచన నుంచి ఏకంగా 500 పడకల ఓ హాస్పిటల్ ఏర్పాటుకు పూనుకున్నారు… నిజానికి దేశవ్యాప్తంగా పరిస్థితి ఏమిటంటే..? ఈ సెకండ్ వేవ్ వేగంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీస్తోంది… కరోనా నెగెటివ్ వచ్చినా సరే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బలి తీసుకుంటోంది… ఆక్సిజన్ కోసమే రోగులు హాస్పిటళ్లలో చేరాల్సి వస్తోంది… అనేకచోట్ల దోపిడీకి మూలం ఇదే… క్లోజ్డ్ ఐసీయూలు, సమయానికి ఆక్సిజన్ కొన్నిసార్లు అందకపోవడం, కొన్నిచోట్ల ఆక్సిజన్ ప్రమాదాలు… ఇవీ వార్తలు… ఈ నేపథ్యంలో గాలి వచ్చీపోయే విశాల ఆవరణ, నమ్మకమైన ఆక్సిజన్ సరఫరా, డాక్టర్ల వైద్యం ఇవి ఉంటే అనేక ప్రాణాల్ని కాపాడొచ్చు… ఆ దిశలోనే చకచకా హాస్పిటల్ కట్టేశారు… జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో రోజుల్లోనే హాస్పిటల్ రెడీ… అదే ఇది… మంచి ఇనీషియేటివ్… వాళ్ల ప్లాంట్ నుంచి నేరుగా పైపు లైన్ వేసేశారు… ఇక ఆక్సిజన్ ఆగేదే లేదు… రవాణాపై చింతలేదు… ఆక్సిజనే ప్రాణాధారమైన రోజుల్లో కరోనా రోగులకు ఇంతకుమించి కావల్సిందేముంది..?
Ads
సరే, కట్టేశారు… మరి డాక్టర్లు, నర్సులు, మెడికల్ సూపర్ విజన్ ఎలా..? ప్రభుత్వ యంత్రాంగం ముందుకొచ్చింది… రిక్రూట్ చేసుకున్నారు… ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి, నిరంతర సప్లయ్ ఉండేలా చూసుకునే బాధ్యతను ప్రభుత్వ మెడికల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ (APMSIDC) తీసుకుంది… చైనాలో పది రోజుల్లో 500 పడకల హాస్పిటల్ కట్టారు అంటే రికార్డు… మనమూ చేయగలం… ఆర్జాస్ స్టీల్‌తోపాటు తమిళనాడులో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 3000 పడకల హాస్పిటల్స్ కడుతోంది… నీడ్ ఆఫ్ ది అవర్… తాడిపత్రిలో హాస్పిటల్ మూడు నాలుగు జిల్లాలకు ఉపయోగకరం… భేష్… ఆరంభానికి రెడీగా ఉంది ఇదిప్పుడు…! సొసైటీ నుంచి వనరుల్ని, సంపదను తీసుకునే ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు తిరిగి ఇస్తాయ్..!? అయితే ఆ సోయి ఎన్ని కంపెనీలకు ఉంది..!? కర్నూలు, అనంతపురంలలో సేమ్ ఇలాంటివే ఏర్పాటు చేస్తున్నారు..!!
Share this Article