సోషల్ మీడియా… ఇదొక వైరస్… కోవిడ్‌కన్నా బలమైంది… ప్రస్తుతం ప్రపంచంలోని 500 కోట్ల మందిని పట్టుకుంది… వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువ, కాస్త తక్కువ కావచ్చు గానీ… ఇప్పటికీ దీని నివారణకు వేక్సిన్ లేదు, మందుల్లేవు, చికిత్స లేదు… నిజంగా స్థూలంగా చూస్తే సోషల్ మీడియా వల్ల మంచి ప్రయోజనాలు ఉండాలి…
మెయిన్ స్ట్రీమ్ మీడియా పలు పార్టీల జెండాలు ఎత్తుకుని, రంగులు పూసుకుని నిష్పక్షపాతానికి నిలువెత్తు పాతర వేయడంతో… జనం సోషల్ మీడియా వైపు చూస్తున్నారు… యాక్టివ్ భాగస్వాములవుతున్నారు… అనేక పర్సనల్ విషయాల్ని ప్రపంచంలో షేర్ చేసుకోవడానికి అత్యుత్తమ సాధనం… కానీ ఎప్పుడైతే అత్యధికశాతం ఫేక్ ఖాతాలు, పార్టీల సోషల్ విభాగాలు ఎంటరయ్యాయో ఈ వైరస్ దుర్లక్షణాలు ప్రపంచాన్ని పీడించడం మొదలైంది… ఒక్క చైనా మినహా ప్రతిదేశమూ సోషల్ మీడియా బారిన పడిన బాధితురాలే…
ఎక్కడో ఎవడో ఏదో రాస్తాడు, ఏదో కూస్తాడు… ఇంకేం, వేలు, లక్షల మంది షేర్లు చేస్తారు, ఏమీ ఆలోచించకుండానే… అవి అనేకచోట్ల అకారణ ఉద్రిక్తతలకు, హింసకు దారితీసిన ఉదంతాలు బోలెడు… ఐనాసరే, ఇంకా సోషల్ మీడియా పరిధిలోకి కోట్ల మంది వచ్చి చేరుతున్నారు… ప్రపంచ జనాభా 800 కోట్లు కాగా ప్రస్తుతం 500 కోట్ల ప్రజలు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం పరిధిలో ఉన్నవారేనట… అంతేకాదు, వీరిలో అత్యధికులు చురుకుగా ఉన్నవారేనట సోషల్ మీడియాలో…
Ads
ఇండియాలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంత అంటే… ఒక్కో యూజర్ సగటున రోజుకు రెండున్నర గంటల సమయాన్ని సోషల్ మీడియా వీక్షణంలో మునిగితేలుతున్నాడట… అఫ్‌కోర్స్ ఈ విషయంలో బ్రెజిల్‌దే అగ్రస్థానం… ఒక్కొక్కరు ఆ దేశంలో 3.49 గంటల సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు… అందరికన్నా బెటర్ జపనీయులు… జస్ట్, గంటకన్నా తక్కువ సమయం సోషల్ మీడియాకు వెచ్చిస్తున్నారు వాళ్లు…
గత ఏడాది సోషల్ మీడియాలోకి చేరికలు కొత్తగా 17 కోట్లుగా లెక్కకట్టారు… వివిధ దేశాల్లో ప్రతి 11 మందిలో ఒకరు సోషల్ మీడియా ఉపయోగిస్తుండగా, ఇండియాలో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒకరు సోషల్ మీడియాను వాడుతున్నారు… అంటే చాలా ఎక్కువే… ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏమిటో తెలుసా..? వాట్సప్… ఇన్‌స్టా… ఫేస్‌బుక్…
నిజానికి మొదట్లో ఫేస్‌బుక్ ఎక్కువగా ఉండేది… ఇన్‌స్టా విజృంభణ తరువాత, వాట్సప్ ఉపయోగాలు పెరిగిన తరువాత ఫేస్‌బుక్‌ను అవి రెండూ అధిగమించాయి… ఈరోజు బలమైన కమ్యూనికేషన్స్ వ్యవస్థ వాట్సప్… ఆ తరువాతే ట్విట్టర్… ఈమధ్య టెలిగ్రామ్ కూడా బాగా పెరిగింది… ఎన్నికలొస్తున్నాయి కదా… సోషల్ మీడియా వాడకం మరింత పెరగనుంది… మరి అడ్డమైన ప్రచారాలు, అబద్ధాలు జనంలోకి తీసుకుపోవాలి కదా…!!
Share this Article