అమృతం పంచిన ఆ గొంతును అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది… నిజం… చాలామందికి తెలియని చేదు నిజం ఇది… లతా మంగేష్కర్ మీద స్లోపాయిజన్ హత్యాప్రయత్నం జరిగింది… ఇప్పుడు 28 రోజులపాటు ముంబై, బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృత్యువు ఎదుట ఓడిపోయింది… ఆమె వయస్సు కారణం కావచ్చు, సాధారణంగా స్టార్ హాస్పిటల్స్‌లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు… తన 33 ఏళ్ల వయస్సులో ఇంతకు మించే పోరాడింది…
1962… అప్పటికి లత వయస్సు 33 ఏళ్లు… హిందీలో పాపులర్ అవుతోంది… ఆమె పాట దేశమంతా సుస్వరగంధాన్ని వ్యాపింపజేస్తోంది… అప్పుడేం జరిగిందంటే..? ఆమెకు సన్నిహితుడైన వెటరన్ హిందీ రైటర్ పద్మ సచ్‌దేవ్ ‘ఐసా కహాసే లావూ’ అనే పుస్తకంలో ఇదంతా రాసుకొచ్చాడు… ఆమె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించాడు…
‘‘ఓరోజు ఉదయం ఆమె కడుపులో విపరీతమైన నొప్పి, మెలికలు తిరిగిపోతోంది… రెండుమూడుసార్లు ఆకుపచ్చ రంగులోని ఏదో ద్రావకాన్ని వాంతి చేసుకుంది… కదల్లేకపోతోంది… చివరకు చేతుల్ని కూడా పైకి లేపే స్థితి లేదు… ఒళ్లంతా నొప్పులు… లతకు రెగ్యులర్‌గా వైద్యం చూసే డాక్టర్‌ను పిలిచారు అర్జెంటుగా… ఈమె కదిలే స్థితి లేదు కదా, ఆయన ఓ ఎక్స్-రే మెషిన్‌నే ఎత్తుకొచ్చాడు ఆమె ఇంటికి…
Ads
ఆ నొప్పులు భరించలేకపోతుండటంతో మత్తులోకి పడేసే ఓ సూది ఇచ్చాడు… తరువాత మూడు రోజులపాటు ఆమె మృత్యువుతో పోరాడుతూనే ఉంది… స్పృహలోకి రాలేదు… పది రోజుల తరువాత గానీ ఆమెలో రికవరీ లక్షణాలు కనిపించలేదు… ఆమెకు ఎవరో స్లోపాయిజన్ ఇచ్చారని డాక్టర్ తేల్చాడు… ఎవరు అతను..? ఎందుకు..? మూడు నెలలపాటు ఆమె మంచం మీదే ఉంది…
ఈలోపు ఆమె ఇంట్లో వంటవాడు తన వేతనాల్ని కూడా వదిలేసి, ఎవరికీ చెప్పాపెట్టకుండా మాయమైపోయాడు… అందరికీ అర్థమైపోయింది వాడే కుట్రదారు అని… కానీ ఎందుకు చేశాడు..? లతను ఈలోకం నుంచే పంపించేయాలని ఎవరు కుట్ర పన్నారు… ఫీల్డ్‌లో పోటీదారులా..? తన కొడుకు నుంచి దూరం చేయడానికి దుంగార్పూర్ రాజకుటుంబీకులా..? ఏమో… దర్యాప్తు లేదు, ఏమీ బయటపడలేదు… ఈరోజుకు కూడా…! సదరు వంటవాడు గతంలో బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో పనిచేసినవాడేనట… ఎవరో సిఫారసు చేస్తేనే ఆమె వంటవాడిగా పెట్టుకుందట…
తరువాత ఆమె ఎవరినైనా సదరు వంటవాడి గురించి అడిగిందా..? లేక ఏమైనా ఆమె జీర్ణం చేసుకోలేని నిజాలు తెలిసి, ఇక మౌనంగా ఉండిపోయిందా..? ఇక ఆమె ఎవరికీ ఏమీ చెప్పలేదు, తన చివరి క్షణం వరకు కూడా…!! అంటే ఆమె ఎవరినో బజారుకు లాగడానికి, శిక్ష వేయించడానికి ఇష్టపడలేదు… మూడునాలుగు నెలలపాటు ఆమె ఐస్ క్యూబ్స్ వేసుకున్న సూప్ తాగేది… ఘనాహారం తినేది కాదు, తినే పరిస్థితి లేదు, అప్పటికే అంతగా ఆమె చిన్నపేగులు దెబ్బతిన్నాయి…
తింటే నొప్పి… బలహీనపడిపోయింది… మెల్లిమెల్లిగా కోలుకుంది… మళ్లీ పాటల్లో బిజీ అయ్యేసరికి ఆమె ఏమైపోతుందనే భయమే ఉండేది ఆమె సన్నిహితుల్లో… లండన్ బేస్డ్ ఫిలిమ్ రచయిత నస్రీన్ మున్నీ కబీర్‌కు తన చేదు అనుభవాల్ని చెప్పింది ఆమె… ఇండియాలో జర్నలిస్టులతో ఈ విషయాల్ని షేర్ చేసుకునేది కాదు… అందుకే ఇదంతా నమ్మలేక కబీర్ లత చెల్లెలు ఉషా మంగేష్కర్‌తో మాట్లాడి నిర్ధారించుకున్నాకే రాశాడు… సచ్‌దేవ్ ఇంకా ఏమంటాడంటే… ‘‘ఈ కుట్ర తరువాత బాలీవుడ్ పాటల రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి కొన్నాళ్లపాటు రోజూ పొద్దున్నే ఆమె ఇంటికి వచ్చేవాడు… ఆమెకు పెట్టే ఆహారాన్ని తను ముందుగా తినేవాడు… తరువాతే ఆమెకు పెట్టేవాళ్లు… తరువాత కొన్నాళ్లకే ఆమె పాట పాత మాధుర్యాన్ని సంతరించుకుని, దశదిశలా గానపరిమళాల్ని వెదజల్లింది… ఇంతకీ ఈ గొంతును కోసేయాలనుకున్న కుట్రదారు ఎవరు..? మిస్టరీ…!!
Share this Article