Nancharaiah Merugumala…. ఈనాడులో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లే గాని ఇండియన్లని కాదు! ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలోని 10 మంది తెలుగోళ్లలో 7గురు రెడ్లే! అట్లుంటది ఔషధాలు, ఆస్పత్రుల రెడ్డీల సంపాదన మరి…
…………………………………………………………….
ఈరోజు ఈనాడు బిజినెస్ పేజీలో తమ వ్యాపార మైనర్ ‘భాగస్వామి’ ముకేశ్ అంబానీ కొత్త విజయాలపై ఎప్పటిలా పెద్ద వార్త ఇస్తూనే,‘‘ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మనోళ్లు’’ అనే శీర్షికతో పది మంది పేర్ల జాబితా ఇచ్చారు. ‘ఈనాడు’లో ‘మనోళ్లు’ అంటే మన భారతీయులు అని కొన్ని సందర్భాల్లో అర్ధం. మరి కొన్ని సమయాల్లో అయితే– తెలుగోళ్లు అని మనం గ్రహించాలి. అంతేగాని మనోళ్లు అంటే పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు గారి కులమైన కమ్మలు అనుకోకూడదని ఎప్పుడో నాకు అర్ధమైంది.
Ads
ఎందుకంటే ఈ పెదపారుపూడి మధ్య తరగతి కమ్మ రైతుబిడ్డకు కుటుంబాభిమానం ఉందిగాని కులాభిమానం కొద్దిగా కూడా లేదని ఆయనతో పరిచయం ఉన్న మా గుడివాడ పక్క గ్రామాలోళ్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గుడివాడకు 50 కి.మీ చుట్టూరా ఉన్న ప్రాంతం ప్రజలంటే రామోజీకి కాస్త ఎక్కువ అభిమానం అని కూడా గుంటూరు జిల్లాకు చెందిన ఈనాడు కమ్మ ఉద్యోగులు చెప్పగా విన్నా. వినడం కాదు ఈ ‘ఆరోపణ’ నిజమే. అది పాత ముచ్చట.
ప్రస్తుత సందర్భానికి వస్తే– మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావు గారు నిర్షోషి అని చెప్పడానికి– తన కాపు కుల గుర్తింపును పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదారిలో వదిలేసి వచ్చిన పెద్దన్నయ్య కొణిదెల చిరంజీవి గారి పెద్ద తమ్ముడు నాగబాబు ఇచ్చిన యోగ్యతాపత్రం (రామోజీరావు లక్షల మందికి ఆదర్శం) ఈనాడులో రావడమేమిటి? 1980ల్లో కొత్త కమ్మ షావుకారుగా ముద్రపడిన రామోజీరావుకు కమ్మల నుంచీ, రెడ్ల నుంచీ గాక కాపులు, ఇతర ‘బలహీనవర్గాల’ నుంచి సానుభూతి వెల్లువలా రావడం ఏమిటి?
మొదటి ర్యాంక్ కమ్మ కుబేరుడిది గాని, టాప్ టెన్‌లో ఏడుగురు రెడ్లే
––––––––––––––––––––––––––––––
మూడు వేల మందికి పైగా ఉన్న ఫోర్బ్స్ 2023 ప్రపంచ కుబేరుల జాబితాలో పైపది స్థానాలు సంపాదించిన తెలుగు వ్యాపారుల జాబితాను ‘మనోళ్లు’ పేరుతో ఈనాడు ప్రచురించిందని చెప్పాను. ఈ జాబితాలో అగ్రభాగాన (అంటే వరల్డ్ లిస్టులో 552 ర్యాంక్) కృష్ణా జిల్లా మంతెన గ్రామంలో పుట్టిన కమ్మ పారిశ్రామికవేత్త (దివి లాబ్స్–ఫార్మారంగం) దివి మురళీకృష్ణ కుటుంబం ఉంది.
ఆ తర్వాత స్థానాల్లో అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సీ రెడ్డి, మేఘా ఇంజనీరింగ్ పి.పిచ్చిరెడ్డి, ఆయన బంధువు పీవీ కృష్ణారెడ్డి, తెలంగాణకు చెందిన ఎంఎసెన్ ఫార్మా కంపెనీ అధినేత ఎం.సత్యనారాయణరెడ్డి, మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు, జీఎమార్ గ్రంథి మల్లికార్జునరావు, అరబిందో పీవీ రాంప్రసాదరెడ్డి, రెడ్డి లాబ్స్ కళ్లం సతీశ్ రెడ్డి, ఇదే కంపెనీ ఎండీ జీవీ ప్రసాద్ (రెడ్డి) ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జీవీ ప్రసాద్ హరిశ్చంద్రారెడ్డి కొడుకు, డాక్టర్ రెడ్డి లాబ్స్ స్థాపకుడు డా.కళ్లం అంజిరెడ్డి గారి అల్లుడు.
ఫోర్బ్స్ గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో స్థానం దక్కించుకున్న ఈ పది మంది తెలుగు సంపన్నుల్లో (అదే మనోళ్లు) మొదటి ర్యాంక్ కృష్ణా జిల్లా కమ్మ కుటుంబంలో పుట్టిన దివి మురళీకృష్ణదే. కాని ఈ పది మందిలో ఏడుగురు రెడ్లు. వారిలో మేఘా గ్రూపునకు చెందిన పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి కూడా కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామం నుంచి వచ్చినోళ్లు. మిగిలిన ఐదుగురు రెడ్లలో కళ్లం సతీశ్ రెడ్డి గుంటూరు జిల్లా మూలాలున్న ఔషధాల వ్యాపారి. ఆయన బావగారు జీవీ ప్రసాద్ (రెడ్డి) నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త. అరబిందో సహ వ్యవస్థాపకుడు అయిన పీవీ రాంప్రసాద్ రెడ్డిది కూడా నెల్లూరు జిల్లాయే. ఇక మిగిలిన ఎం.సత్యనారాయణరెడ్డి అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఫార్మా కంపెనీ యజమాని అనుకుంటాను.
పది మంది జాబితాలో మొదటి ర్యాంకర్ దివి మురళీతోపాటు మరో ఇద్దరు బిలియనీర్లు రెడ్లు కాదు. వారు: తెలంగాణకు చెందిన వెలమ ఇన్ఫ్రా వ్యాపారి జూపల్లి రామేశ్వరరావు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా రాజాంలో మూలాలున్న వైశ్య ఇన్ఫ్రా రంగ వ్యాపారి గ్రంథి మల్లికార్జునరావు. ఇలా ఈ ఏడాది ఫోర్బ్స్ గ్లోబల్ కుబేరుల లిస్టులో చోటు సంపాదించుకున్న టాప్ టెన్ తెలుగు వ్యాపారుల్లో ఏడుగురు రెడ్లు ఉండడం, మిగిలిన మూడు అగ్రకులాలకు (కమ్మ, వెలమ, వైశ్య) కూడా కనీస ప్రాతినిధ్యం దక్కడం చూడడానికి బావుంది.
భారతదేశంలో ఎగువ మధ్య తరగతి సైజు అత్యంత ఎక్కువ ఉన్న తెలుగు కులం కమ్మలేగాని, వారిలో రెడ్ల మాదిరిగా డాలర్ బిలియనీర్లు తక్కువ అని, సాధ్యమైనంత వరకూ రెడ్లు గుట్టు చప్పుడు కాకుండా పైకి ఎదిగిపోతారని తాజా ఫోర్బ్స్ జాబితా చెబుతోంది. డబ్బు సంపాదించిన చౌదర్లు కాస్త ఎక్కువ హడావుడి చేస్తారు. కాని, ప్రజారోగ్యంతో ముడిపడిన ఔషధాలు వంటి అత్యవసర సరకుల తయారీ ద్వారా రెడ్డీలు బాగా సంపద కూడబెడుతున్నారని పాశ్చాత్య తెల్లోళ్ల కంపెనీ ఫోర్బ్స్ మరోసారి వెల్లడిస్తోంది.
ఎప్పుడో నా గౌరవనీయ మిత్రుడు పాశం యాదగిరి గారు చెప్పిన ఓ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. తెలుగువారు గర్వపడే కొద్ది మంది గొప్పవారిలో ఒకరైన కట్టమంచి రామలింగారెడ్డి గారు (సర్ సీఆర్ రెడ్డి) తన సామాజికవర్గమైన రెడ్లను– రిచ్ రెడ్డీస్, రెచెడ్ రెడ్డీస్ అని సరదాగా వర్గీకరించి ఓ సందర్భంలో మాట్లాడారట. ఇలా తెలుగు పాలకవర్గమైన రెడ్లను రిచ్ (దనిక) రెడ్లు, రెచెడ్ (దిక్కుమాలిన) రెడ్లు అని రెండుగా విభజించిన సీఆర్ రెడ్డి గారు, ‘ఎవ్రి రెచెడ్ రెడ్డీ లవ్స్ ఏ రిచ్ రెడ్డీ, బట్ నో రిచ్ రెడ్డీ లవ్స్ ఏ రెచెడ్ రెడ్డీ’ అని చమత్కరించారని చెబుతారు. అవును మరి. రిచ్ రెడ్డీసే అందరికీ ఇష్టం. అందులోనూ ఏడుగురు ఫోర్బ్స్ లిస్టు డాలర్ బిలియనీర్లు రెడ్లే అయినప్పుడు– తెలంగాణలో రెడ్డి నేత ఎవరూ 2014 తర్వాత ముఖ్యమంత్రి కాకున్నా నష్టం లేదు. మరో 30 ఏళ్లు పద్మనాయకులే హైదరాబాద్ కొత్త సచివాలయంలో రాజ్యమేలినా రెడ్లకు మేలే మరి…
Share this Article