సౌత్‌లో విజయవంతమైన సినిమాల్ని హిందీలోకి… హిందీ సక్సెస్‌ఫుల్ సినిమాల్ని సౌత్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే… కాకపోతే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేసేసి, పాన్ ఇండియా ముద్ర వేసేసి, మార్కెటింగ్ చేసేస్తున్నారు… కానీ మన తెలుగు సినిమాయే… 70 ఏళ్ల క్రితమే ఓ జబర్దస్త్ పాన్ ఇండియా మూవీ వచ్చింది… సేమ్, ఒకేసారి దేశమంతా రిలీజ్ చేశారు…
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ సినిమా పేరు చండీరాణి… 1953లో తీసిన ఆ సినిమాకు అసలు హీరో ఎన్టీయార్… సూపర్ హీరో భానుమతి రామకృష్ణ… వాళ్ల సొంత సినిమా అది… ఇక ఆమె ఆధిపత్యం ఎలా ఉంటుందో తెలుసు కదా… అందుకే సూపర్ హీరో అన్నాను… ష్, ఆ సినిమాకు దర్శకత్వం కూడా భానుమతే… అల్లాటప్పాగా డబ్బింగ్ చేసేసి, ఇతర భాషల్లో వాయిస్ ఓవర్లు చెప్పించేసి రిలీజ్ చేయలేదు… దర్శకుడు తమ్మారెడ్డి చెప్పిన వివరాలు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి…
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఎక్కడో మాట్లాడుతూ… ‘‘ఇప్పుడు తెలుగు సినిమా ఎక్కడుందీ? తెలుగు పదాలకు బదులు ఏవేవో పరభాషా పదాలు తగిలిస్తున్నారు. అస్సలు అలాంటి డైలాగ్స్ రాసే వాళ్ళకి బుద్ధిలేదు… యాక్టర్స్‌కి తెలుగు రాదు, సెట్స్‌లో ఎక్కువ మందికి తెలుగు రాదు.. తెలుగు రాని వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ‘కల్లు’కి, ‘కళ్లు’కి తేడా తెలియకుండా పాడింది ఓ గాయని ఈమధ్య… చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. వంటి యాక్టర్స్ తప్పితే ఎవరూ కూడా తమ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మాట్లాడటం లేదు. అసలు చాలామంది హీరోస్‌కి తెలుగు చదవటమే రాదు…’’ అని బాధపడిపోయాడు…
Ads
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మొదటి పాన్ ఇండియా సినిమా గురించి, ఆ స్టార్ల గురించి కదా… ఆ విషయంలోకి వెళ్దాం… పాన్ ఇండియా అంటే వివిధ భాషల్లోకి డబ్ చేయడం కాదు… చండీరాణి సినిమాను అన్ని భాషల్లోనూ విడివిడిగా, ఆయా భాషలకు సంబంధించిన నటీనటులతో… విడివిడిగా షూట్ చేయించి, జస్ట్, 35 రోజుల్లో, పర్‌ఫెక్ట్ ప్లానింగుతో రిలీజ్ చేయించింది ఆమె… మరి భానుమతి కదా…
‘‘ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని మూడు వందల రోజులు తీస్తారు, తీరా తీశాక, అందులో వివిధ భాషలు ఉంటాయి, కానీ ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలీదు.. తీరా చూశాక, అది డబ్బింగ్ సినిమానా, మరొకటా అని ఆలోచించాలి. అదీ ఇప్పటి స్థితి” అన్నారు తమ్మారెడ్డి… ‘‘జెమినివారి ‘చంద్రలేఖ’ మూడు భాషల్లో తీశారు, అలాగే ఇంకా కొన్ని సినిమాలు అప్పట్లో మూడు భాషల్లో తీసి విడుదల చేశారు, పాన్ ఇండియా కొత్తేమీ కాదు… కాకపోతే అప్పట్లోనే రియల్ స్పిరిట్‌తో ఆయా భాషల మాటలకు, నటీనటులకు, పాటలకు వాల్యూ ఇచ్చి విడివిడిగా షూట్ చేసేవాళ్లు…
Share this Article