ముందుగా ఓ ఒపీనియన్… అందరూ అంగీకరించకపోవచ్చు కూడా… ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీసిన ఘనుడు… ఒక క్రికెటర్‌గా కన్నా సేవాభావం, క్రికెట్ పట్ల అంకితభావం, తన దేశం పట్ల ఉన్న నిబద్ధత కోణం తనను ఉన్నతంగా నిలబెడుతుంది… తనకు బాగా అడ్వాంటేజ్ ఏమిటంటే…? పుట్టుకతోనే తన చేతి నిర్మాణం కాస్త వంకర తిరిగి ఉంటుంది…
అది తన బౌలింగుకు అనుకూలంగా మారి, మంచి స్పిన్ సాధ్యమయ్యేది… ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంతటి స్టారుడైనా సరే మురళీధరన్ బాల్ ఎదుట చిత్తు కావాల్సిందే… మోకరిల్లాల్సిందే… తన బాల్స్ అంచనా వేయలేక మేటి బ్యాటర్లు సైతం మెలికలు తిరిగిన బంతిని ఆశ్చర్యంగా, అభినందనగా చూస్తూ పెవిలియన్ బాట పట్టిన సీన్లు క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేనివి… కానీ..?
ఒకరకమైన వైకల్యం, అంటే లోపం తనకు వరంగా మారింది… అఫ్‌కోర్స్, అదొక్కటే తన బౌలింగ్ బలం కాదు, కలిసొచ్చింది అని..! ఈ కోణంలో చూస్తే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ అద్భుతమైన స్పిన్నర్ అనిపిస్తుంది… సరే, ఆ మనిషి వివాదాస్పద వ్యక్తిగత బలహీనతలతో పోలిస్తే మురళీధరన్ ఓ వ్యక్తిగా మెచ్చుకోదగినవాడు…
Ads
ఇప్పుడు తన జీవితం మీద 800 పేరిట ఓ బయోపిక్ వచ్చింది… ఎక్సలెంట్… ఎందుకంటే..? సాధారణంగా మన సౌత్ సినిమాల్లో బయోపిక్ గానీ, ఏ కథ గానీ ఓవర్ డ్రమటైజేషన్ ఉంటుంది… పేరున్న నటులైతే తనకు అనుగుణంగా కథ మారుస్తారు… అసలు బయోపిక్ హీరోకన్నా ఈ స్క్రీన్ హీరోల హీరోయిజం ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తారు… కానీ 800 సినిమాలో అలాంటివి ఏమీ లేవు… తన జీవితాన్ని అలాగే చూపించారు… ఎక్కడా వక్రీకరణలు, ఓవర్ డ్రమెటైజేషన్ ఉండదు… బహుశా మురళీధరన్ అంగీకరించి ఉండడు…
నిజంగానే తన జీవితంలో కష్టాలు, అవమానాలు, పట్టుదల, పోరాటం, విజయం ఎట్సెట్రా బోలెడు… ఓ సినిమా కథను మించి… దాన్ని ఓ రెండు గంటల సినిమాగా కుదించి చూపగలిగిన దర్శకుడు అభినందనీయుడు… ప్రత్యేకించి తమిళ, సింహళ జాతుల మధ్య భీకరమైన యుద్ధం జరిగిన రోజుల్లో… ఇండియన్ తమిళ్ రూట్స్ ఉన్న ఓ కుటుంబం నుంచి వచ్చిన మురళీధరన్ ప్రదర్శించిన సంయమనం, ఓపిక గ్రేట్… దాన్నలాగే చూపించారు సినిమాలో… ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు దర్శకుడు… అదీ విశేషం…
కేవలం క్రికెట్… అదే ధ్యాస, అదే శ్వాసగా బతికాడు… క్రికెట్‌లో శ్రీలంక పతాకాన్ని ఎగరేసేందుకే కష్టపడ్డాడు… తన ఘనతను ఇక ఎవ్వరూ అందుకోలేరు… అన్ని వికెట్లు… అన్నింటికీ మించి డౌన్ టు ఎర్త్… క్రికెట్ కోసమే ఓ స్టేడియం నిర్మాణం, సేవాకార్యక్రమాలు, శిక్షణలు… మురళీధరన్ అంటేనే శ్రీలంక క్రికెట్… అంతే… అందుకే తమిళుల్ని ద్వేషించే సింహళీయులు కూడా మురళీధరన్ జోలికి వచ్చేవారు కాదు… మనకూ తనంటే సాఫ్ట్ కార్నర్… తమిళుడనేదే ప్రధాన కారణం కాకపోవచ్చు… తన నడక, తన నడత… సింహళీయులు ఏమనుకుంటారో అనే వెరపు కూడా లేకుండా మురళీధరన్ తన ఇండియన్ రూట్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఎప్పుడూ సందేహించలేదు… అలాగని శ్రీలంక పట్ల దేశభక్తినీ విస్మరించలేదు…
నిజంగా విజయ్ సేతుపతి దురదృష్టవంతుడు… ఈ బయోపిక్ చేయకపోవడం తన బ్యాడ్ లక్… (తను మంచి నటుడే కానీ తన సినిమా ప్లానింగ్, పాత్రల ఎంపిక పలుసార్లు దరిద్రంగా ఉంటుంది)… ఈ పాత్ర మధుర్ మిట్టల్ ఒడిలో పడింది… సద్వినియోగం చేసుకున్నాడు… మురళీధరన్ పాత్రలోకి ఒదిగిపోయాడు… కాకపోతే లుక్కు కాస్త తేడాగా ఉంది… బట్, వోకే… (ధోనీ పాత్ర చేసిన సుశాంత్ అచ్చంగా ధోనీలాగే మారిపోయాడు ఓ బయోపిక్ కోసం… తన షాట్లు, తన లుక్కు, మ్యానరిజమ్ అచ్చు ధోనినే దింపేశాడు…)
ఐతే ఈ 800 మూవీలో సగటు కమర్షియల్ సినిమా వాసనలు తక్కువ… కేవలం క్రికెట్, ఒక క్రికెటర్ జీవితం… కష్టాల చీకట్ల నుంచి అనితరసాధ్యమైన రికార్డుల వెలుతురు వైపు ప్రస్థానం… క్రికెట్‌ను ప్రేమించని భారతీయుడు ఎవరుంటారు..? సో, క్రికెట్‌ను అభిమానించేవాళ్లకు ఈ సినిమా కూడా నచ్చుతుంది… అన్నింటికీ మించి జాతి వివక్షలు, పరాభవాల నుంచి ఒక వ్యక్తి కష్టపడి, పోరాడి ఎదిగిన తీరు అద్వితీయం… ఆ కోణంలోనూ సినిమా ఓసారి వాచబుల్… కాకపోతే గతంలో వచ్చిన మన ఇండియన్ క్రికెట్ బయోపిక్స్‌తో పోలిస్తే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ప్రమాణాలు బాగాలేవు… బట్ వోకే…
ఒక విషయం చెప్పుకోవాలి… ఈ సినిమాలో శ్రీలంక క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ పాత్ర కేరక్టరైజేషన్ గానీ, సదరు పాత్రధారి యాక్షన్ గానీ అదుర్స్… ఒకరకంగా చెప్పుకోవాలంటే మురళీధరన్ పాత్రకు దీటుగా… ఒకింత ఎక్కువగా కనెక్టవుతుంది… తన జట్టు సభ్యుడికి ప్రతికూలత ఎదురైనప్పుడు కాపాడుకోవడానికి స్థిరంగా నిలబడి, మద్దతునిచ్చిన ఒక మంచి కెప్టెన్‌గా రణతుంగ ప్రేక్షకాభిమానాన్ని పొందుతాడు…!! అది నిజమైన నాయకత్వ లక్షణం కూడా..!!
Share this Article