కథ అందరికీ తెలుసు… ముగింపు అందరికీ తెలుసు… ఒరిజినల్ కథను బోలెడుసార్లు వీడియోల్లో కూడా చూసే ఉంటారు చాలామంది… అన్నీ తెలిసిన కథను చెప్పడంలో థ్రిల్ ఏముంది..? జనానికి ఆసక్తి ఏముంటుంది..? 1983లో అనూహ్యంగా భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్పు గెలిచిన కథను 83 పేరిట తెరకెక్కించే ప్రాజెక్టుపై చాలామంది సినీపండితులు ఇలాగే భావించారు… పెదవివిరిచారు… నిజానికి మంచి సినిమా కథ అంటేనే ఎవరికీ తెలియని కథను చెప్పడం లేదా అందరికీ తెలిసిన కథను కొత్తగా చెప్పడం..! ఎలాగూ అందరికీ తెలిసిన కథే కదా, అందుకే దర్శకుడు కబీర్ ఖాన్ ఎంత కొత్తగా కథను చెప్పగలను అనే అంశం మీదే కాన్సంట్రేట్ చేశాడు…
గెలుపు తెలిసిన ముగింపు… కానీ ఆ గెలుపుకు వెనకాముందూ ఏం జరిగింది..? జట్టు ఎదుర్కున్న అవమానాలు గానీ, ఎమోషన్స్ గానీ ఏమిటి..? డ్రెసింగ్ రూం చాట్స్, ఎత్తుగడలు, కలిసొచ్చిన అదృష్టాలు వంటివి చిక్కగా అల్లుకుంటూ అసలు కథనుదర్శకుడు సూటిగా చెబుతూ పోయాడు… వెరసి 83 మూవీ ఆకట్టుకునేలా రూపొందింది… కాకపోతే మరీ కపిల్‌దేవ్‌ను ఎక్కువగా హైలైట్ చేసినట్టు ఉంది… కెప్టెన్ కదా, ఆ కప్పు గెలవడంలో తన పాత్రే కీలకం కాబట్టి… వోకే…! ఇండియన్లకు క్రికెట్ అంటే ప్రాణం… అందులోనూ ఈ ప్రపంచకప్పు గెలిచాకే ఇండియాలో క్రికెట్ పిచ్చి బలంగా వ్యాపించింది… కోట్లాదిమందికి క్రికెట్ గురించి తెలుసు, అందుకే ఈ సబ్జెక్టును డీల్ చేయాలంటే జాగ్రత్త అవసరం… ఎక్కడ పొరపాటు జరిగినా సినిమా హాస్యాస్పదం అవుతుంది… దర్శకుడు క్లీన్ బౌల్డ్ అవుతాడు… కానీ కబీర్ సక్సెస్‌ఫుల్‌గా టాకిల్ చేశాడు…
Ads
సినిమా నిర్మాణంలో మెచ్చదగిన పోర్షన్ ఏమిటంటే..? రణవీర్ సింగ్ టీంకు క్రికెట్ బేసిక్స్, వాళ్లు పోషించే పాత్రల బాడీ లాంగ్వేజీ, మేనరిజమ్స్, క్రీజులో నిలబడే పద్ధతి, బౌలింగ్ తీరు, లుక్కు, ఆహార్యం మీద వెటరన్ క్రికెటర్లతో శిక్షణ ఇప్పించడం… ధర్మశాల క్రికెట్ స్టేడియంలో రణవీర్ సహా అందరూ ట్రెయినింగ్ పొందారు… ఆ శ్రమ సినిమాలో కనిపిస్తుంది… వెంగ్ సర్కార్, శ్రీకాంత్, కపిల్ దేవ్, మొహిందర్ అమర్నాథ్, గవాస్కర్ తదితరులే కనిపిస్తారు మనకు… కాసేపు కపిల్ భార్య రోమి పాత్రలో దీపిక కూడా కనిపిస్తుంది… కానీ వివిధ జట్ల ప్లేయర్ల మీద ఇదే కృషి సాగితే బాగుండు… ప్రత్యేకించి వెస్టిండీస్ జట్టు పాత్రధారుల మీద దర్శకుడు పెద్దగా కాన్సంట్రేట్ చేయనట్టుంది… క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్ట్స్ వంటి టాప్ ప్లేయర్లకు ఇండియాలోనూ లక్షల మంది అభిమానులున్నారు… వాళ్ల పాత్రచిత్రణ, ఆహార్యం గట్రా అంతగా నప్పలేదు…
అఫ్‌కోర్స్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు… రణవీర్‌కు ఇది కెరీర్‌పరంగా పేరు తీసుకొచ్చే సినిమా… మీకు గుర్తుందా..? ధోని బయోపిక్ కోసం సుశాంత్ అచ్చంగా ధోనీలాగే మారిపోయాడు… బాడీ లాంగ్వేజీతోపాటు హెలికాప్టర్ షాట్స్ వంటివి కూడా అచ్చం దింపేశాడు… సేమ్, ఇందులో కూడా రణవీర్ కపిల్‌దేవ్‌గా మారిపోయాడు… ఆ బౌలింగ్ స్టయిల్, తన బ్యాటింగ్‌లో కొన్ని తనకే పేరుతెచ్చిన షాట్లు బాగా ప్రాక్టీస్ చేశాడు… చిన్న టాస్కేమీ కాదు… హీరో అనగానే ఇలా సెట్‌లోకి వచ్చి, అలా ఏదో తూతూమంత్రం నటించేసి వెళ్లిపోయే రోజులు కావు ఇవి… బాలీవుడ్ నటులు ఒక్కో సినిమా కోసం బాగానే కష్టపడుతున్నారు… కథ మీద, స్క్రిప్టు మీద, కథనం మీద మంచి కసరత్తు సాగుతోంది… అందుకే అందరికీ తెలిసిన కథనైనా సరే కబీర్ ఆకట్టుకునేలా చెప్పగలిగాడు… అభినందనలు…
Share this Article