చాలా పెద్ద వయస్సు ఉన్నట్టుంది… ఇంతకీ ఆమె ఎక్కడికి వెళుతోంది? ఆసుపత్రికా?………. లేదు, మీ అంచనాలు పూర్తిగా తప్పు…!
ఈమెకు 95 ఏళ్లు… వృద్దాప్యం, దాంతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఈమె స్పూర్తిని మాత్రం లొంగదీసుకోలేకపోయాయి… ఆమె ఒక ప్రొఫెసర్… అంతకుమించి… ఈరోజుకూ రోజూ 60 కిలోమీటర్ల దూరం వెళ్లివస్తూ విద్యార్థులకు భౌతికశాస్త్రం పాఠాలు చెబుతుంది ఈమె… పేరు చిలుకూరి శాంతమ్మ…
మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకుంది… అలా ఆ క్రచెస్ పట్టుకుని వెళ్తుంటుంది… విజయనగరం సెంచూరియన్ యూనివర్శిటీలో పాఠాలు చెబుతూ ఉంటుంది… ఇంత వయస్సులో ఇంకా ఎందుకమ్మా అనడిగితే… ‘‘పర్లేదు, మా అమ్మ వనజాక్షమ్మ 104 వరకూ బతికింది… నా చివరి శ్వాస వరకూ నేను బోధిస్తూనే ఉండాలనేదే నా కోరిక…’’ అంటుంది…
Ads
ఆమె క్రమశిక్షణ, అంకితభావం, కృషి ఆమె సహచరుల్ని, విద్యార్థుల్ని ఎప్పుడూ విస్మయమే… ఆమెకు బోధన మాత్రమే కాదు, దాతృత్వమూ తెలుసు… తన ఇంటిని వివేకానంద మెడికల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటోంది… “మాది ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం… డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు… మా వారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు… అతనిని చదివించి, పెళ్లి చేశాను… అతనికి ముగ్గురు పిల్లలు… అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం… అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం…’’ అంటోంది ఆమె…
1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించిన శాంతమ్మ ఐదు నెలల వయసులో తండ్రిని కోల్పోయింది… B.Sc ఆనర్స్ చదివింది… ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో D.Sc (Ph.D కి సమానం) పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో కాలేజ్ ఆఫ్ సైన్స్, ఆంధ్రా యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరింది…
లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్ మరియు రీడర్ వరకు ప్రొఫెసర్ శాంతమ్మ అన్నీ… కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఆమె పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేసింది…
1989లో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ… తరువాత పరిశోధనలపై దృష్టి మరల్చి, మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పని చేసింది… ఆమె దినచర్య ఉదయం 4 గంటలకు మొదలవుతుంది.., “నేను రోజుకు కనీసం ఆరు తరగతులకు బోధించగలను… బోధనలో సమయం, శక్తి అనేవి రెండు ముఖ్యమైన అంశాలు… నేను దానిని ఎల్లప్పుడూ నా మనస్సులో ఉంచుకుంటాను… నేను వైజాగ్ నుండి విజయనగరం వరకు ప్రతిరోజూ కనీసం 60 కి.మీ ప్రయాణిస్తాను..,” అని చెబుతోంది…
అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీపై ఆమె చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో ఆమెకు అనేక అవార్డులు, బంగారు పతకాన్ని తెచ్చిపెట్టాయి… ప్రొఫెసర్‌కి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఉంది… ఆమె భగవద్గీతకు ఆంగ్ల వెర్షన్ “భగవద్గీత – ది డివైన్ డైరెక్టివ్” అనే పుస్తకాన్ని రచించింది… “నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు… తెలుగు ప్రొఫెసర్‌గా ఉంటూ నాకు ఉపనిషత్తులను పరిచయం చేశారు…’’ అని చెప్పిందామె…
(ఈమె స్టోరీ ఇంతకుముందు చదివారా..? ఏమో, చదివే ఉంటారు… ఐనా మరోసారి చెప్పుకుంటే తప్పేంటి..? ఇలాంటివే కదా సొసైటీలో పాజిటివిటీని, స్పూర్తిని వ్యాప్తి చేసేవి…)
Share this Article