ప్రజాస్వామ్యంలో ఓట్లే ముఖ్యం. అవి వస్తేనే సీట్లు. సీట్లు వచ్చిన వారిదే అధికారం. రాష్ట్రం ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా ఇదే ప్రధాన సూత్రం. ఓటు కోసమే రాజకీయం. ఓటు చుట్టే రాజకీయం. ఏం చేస్తే ఓట్లు వస్తాయో అదే చేయడం. విధానాలు, సిద్ధాంతాలు ఏం లేవు. ఏం చేస్తే ఓట్లు పడతాయో అదే విధానం. ట్రెండ్‌కు తగ్గట్లు రాజకీయం చేయడమే ఇప్పుడు గెలుపు విధానం. ఉత్తరప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం ఇది. భారతదేశ రాజకీయాలను ప్రభావితం ఉత్తరప్రదేశ్ గెలుపు ఇప్పుడు అన్ని పార్టీలకు పెద్ద పరీక్ష. వచ్చే జనవరి తర్వాత ఎప్పుడైనా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే అన్ని పార్టీలు పూర్తిగా రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓట్లు పొందడం లక్ష్యంగా ఇక్కడి ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత పార్టీల విధానాలు, నినాదాల హద్దులను దాటి మీరీ సొంతంగా ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పక్షాల ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఒక్కటే మాటతో ఉన్నారు. ఇలా ఉండడమే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ పెట్టిన ‘ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన’ దీనికి కారణమైంది.
వారసత్వ, పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక, మతపరమైన ప్రాధాన్యత ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పథకం పెట్టింది. దీని పేరు ‘ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన’. యూపీ సీఎం యోగీ ఆదిత్యేనాథ్ ఈ ఏడాది మొదట్లో ప్రారంభించారు. ఈ పథకంలో చేపట్టిన ప్రదేశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.50 లక్షల చొప్పున కేటాయిస్తుంది. అదనంగా అవరసమైతే ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) ఫండ్‌తో పూర్తి చేస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన కోసం రూ.180 కోట్లను ఇప్పటికే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం కావడంతో… మీ నియోజకవర్గంలో వేటిని అభివృద్ధి చేయాలో ప్రతిపాదించాలని పర్యాటక శాఖ అందరు ఎమ్మెల్యేలను కోరింది. తమ నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇదేనని, దీన్నే అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇచ్చారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో పర్యాటక శాఖ ఓ బుక్‌లెట్‌ను రూపొందించింది. యూపీలో రాష్ట్రంలోని 403 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 373 ప్రదేశాలతో ప్రతిపాదనలు వచ్చాయి. హిందూ… మత, ధార్మిక, సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి చేయాలని అత్యధిక మంది ఎమ్మెల్యేలు కోరారు. ప్రతిపాదనలలో దాదాపు అన్ని హిందూ ఆలయాలు, ఆశ్రమాలు, ధామాలు, తీర్థయాత్రలు, పవిత్ర స్నానఘట్టాలే ఉన్నాయి. (వాటిల్లోనూ శైవ సంబంధ ప్రాంతాలే ఎక్కువ అట)…
Ads
ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన అమలులో అధికార బీజేపీ, మెయిన్ అపోజిషన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) పార్టీల్లో ఎమ్మెల్యేలు, వీటిలోని ముస్లిం ఎమ్మెల్యేలూ ‘మెజారిటీ’ లాగే ప్రతిపాదనలు ఇచ్చారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మొత్తం ప్రతిపాదనలో దర్గాలు రెండే మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒకటి చందౌలీలోని సూఫీ ప్రవక్త లతీఫ్ షా దర్గా. దీన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఎస్పీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది ఎమ్మెల్యేలు హిందూ ఆలయాల, ఆశ్రమాలనే అభివృద్ధి ప్రతిపాదనలో పెట్టారు. మిగిలిన నలుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు… కోటను, దర్గాను, గురుద్వారాను, తీలా(మహాభారతానికి సంబంధించిన మట్టి దిబ్బ)ను ప్రతిపాదించారు. ఎస్పీలోని ఇద్దరు మినహా మిగిలిన ముస్లిం ఎమ్మెల్యేలు ఆలయాలనే ఎంపిక చేశారు. అజంగఢ్ ఎమ్మెల్యే అలం బాదీ గురుద్వారాను, సుల్తాన్‌పూర్ ఎమ్మెల్యే అబ్రార్ అహమ్మద్ కోటను అభివృద్ధి చేయాలని సూచించారు. 2017 ఎన్నికల్లో బీఎస్పీ తరుపున 17 మంది గెలిచారు. వీరిలో 13 మంది హిందూ ఆలయాలనే అభివృద్ధి కోసం ప్రతిపాదించారు. జైలులో ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ వీరిలో ఉన్నారు. బీఎస్పీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ సుఖ్‌దేవ్ రాజభర్ తన నియోజకవర్గం దాదర్‌గంజ్‌లోని శివాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. నరోత్తమ్‌దాస్ అనే కవి జన్మస్థలాన్ని, మహాభారతంతో సంబంధం ఉన్న లక్షాగ్రహ(ప్రయాగ)ను, సరస్సును… మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పురాతన పార్టీ కాంగ్రెస్కు యూపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అజయ్‌కుమార్ లల్లూతోపాటు మరొ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆలయాలనే అభివృద్ధి చేయాలని కోరారు. హస్తం పార్టీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నీటి వనరుల ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. మిగిలిన ఇద్దరు… అంబేద్కర్‌పార్కును, గోల్ఫ్ కోర్సును ప్రతిపాదించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రఘురాజ్ ప్రతాప్‌సింగ్(రాజుభయ్యా), వినోద్ సరోజ్, అమన్ మణి త్రిపాఠితోపాటు సుహల్దేవ్ భారతీయ సమాజ్‌పార్టీకి చెందిన ముగ్గరు ఎమ్మెల్యేలు ఆలయాలనే అభివృద్ధి చేయాలని అని చెప్పారు.
‘‘వారసత్వ, పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక, మతాల, అన్ని వర్గాల ప్రదేశాల అభివృద్ధి కోసం ఈ పథకం ప్రారంభించాం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆలయాలను ప్రతిపాదించారు. ఎమ్మెల్యే దేన్ని ప్రతిపాదిస్తే నిధులు దాని కోసమే వెళతాయి. ఎస్పీ ఎమ్మెల్యేలు సైతం దర్గాలను, మసీదులను కాకుండా ఆలయాలనే ప్రతిపాదించారు’’ అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన్ సంవర్ధన్ యోజన కోసం ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు వారి రాజకీయ లక్ష్యాలను స్పష్టంగా చెబుతున్నాయని యూపీ అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల లెక్కలతోనే ఈ ప్రతిపాదనలు వచ్చినట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వం హిందూ సంబంధిత ప్రదేశాలనే ప్రతిపాదించాలని తమకు అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ముస్లిం ఎమ్మెల్యేగా హిందూ ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడితే కలిసి ‘సుహృద్భావ’ పరిస్థితుల కోసం తమ వైపు నుంచి ముందుగుడులా ఉంటుందని కాన్పూర్‌లోని సీసమౌ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి చెప్పారు. పథకం ఉద్దేశం విస్తృతంగా ఉన్నా బీజేపీతో అత్యధిక మంది ఎమ్మెల్యేలు విశాలంగా ఆలోచించలేకపోయారని చరిత్రకారులను, పర్యాటక నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. హిందూ సంస్కృతితో సంబంధం ఉన్న చారిత్రక, ప్రాధాన్యత ప్రదేశాలు, కోటలు, నీటి వనరుల కేంద్రాలను, కవుల జన్మస్థలాలు, జైన కేంద్రాలు, వన్యప్రాణి కేంద్రాలను బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ప్రతిపాదించకపోవడంపై వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలపై పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ మహేశ్రమ్ ఇచ్చిన వివరణ ఎక్కువ మంది మంది ఎమ్మెల్యేలను నిరాశకు గురి చేసేలా ఉంది. ‘మా పథకంలో మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమైన ప్రదేశాలలో మౌలిక వసతులను అభివృద్ది చేయమే పథకం ఉద్దేశం. మతపరమైన నిర్మాణాలను మేం ముట్టుకునే అస్కారం లేదు. మతపరమైన నిర్మాణాల ఆధునీకరణ కోసం వచ్చిన ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నాం’ అని స్పష్టత ఇచ్చారు….. (Inputs దిహిందూ సౌజన్యంతో..) —- రచయిత :: అజ్ఞాతి
————-
Share this Article