ఈరోజు పత్రికల్లో ఒక్కసారిగా కనెక్టయ్యింది ఈ వార్తే… ఒక కలెక్టర్ కారుపై ఏకంగా 23 చలానాలు పెండింగ్… ఎలాగూ ఖజానా నుంచే కట్టేస్తారు, వాళ్ల జేబుల్లో నుంచి కట్టేది లేదు కదా… అది కాదు అసలు విషయం… రవాణా చట్టాల్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే, ఏ భయమూ భక్తి లేకపోతే, ఇక మామూలు మనిషికి ఎందుకు ఉండాలి..? కలెక్టరే చలానా కట్టకపోతే మామూలు మనిషి ఎందుకు నిజాయితీగా, చట్టానికి లోబడి ఉండాలి.., అతివేగం, ప్రమాదకరంగా వాహనం నడిపించడం, జీబ్రా లైన్ క్రాసింగ్ దగ్గర నుంచి బోలెడు ఉల్లంఘనలు… ఒక్క ముక్కలో చెప్పాలంటే కలెక్టర్ కారుకు కూడా రూల్స్ ఉంటాయా..? పాటించాలా…? అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం… నిజం, ఓ చిన్న వాహనదారుడు రూల్ ఉల్లంఘిస్తే పోలీసులు నానా రకాలుగా సతాయిస్తారు, సీజ్ చేస్తారు, కాళ్లు మొక్కినా వదలరు… మరి కలెక్టర్ కారును ఎందుకు మినహాయించారు ఈ నొటోరియస్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్…? కలెక్టర్లు చట్టాలకు అతీతులా..? పోనీ, ఎవరెవరు చట్టాలకు అతీతులే ముందే నోటిఫై చేస్తే సరిపోతుందిగా…
ఇలాంటివి వివాదంగా పరిణమిస్తే సింపుల్‌గా డ్రైవర్లపై చర్యలు తీసుకుంటారు… అంతేతప్ప కలెక్టర్లు మాత్రం తమ తప్పులెరుగరు… రాజీవ్ రహదారిపై ఒకసారి 100 స్పీడ్ దాటొద్దు అన్నారు, ఆ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు, వందల మందిపై 1200 చొప్పున చలానాలు దంచి కొట్టారు… తరువాత 80 అన్నారు, మళ్లీ 100 అన్నారు… ఎవరు నిర్ణయిస్తున్నారో, ప్రజలకు ఎవరు చెబుతున్నారో ఎవరికీ తెలియదు… సేమ్, ఇతర ప్రధాన రోడ్లపై కూడా..! అంతెందుకు..? ఒక్కసారి హైదరాబాద్- సిద్దిపేట రోడ్డు మీద అత్యధిక రోడ్డు నిబంధనల ఉల్లంఘనులు ఎవరో లెక్క తీసి చెప్పగలదా ఈ సర్కారు..? ఏం వసూలు చేసిందో చెప్పగలదా..? అసలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అక్కర్లేదా..? పదిమందికీ చెప్పాల్సినవాళ్లే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా..? ఈ మాట ఎవరూ అనరు, అనలేరు… అంటే చాలా కష్టాలుంటయ్… ఈ వార్త విషయానికొద్దాం… జనగామ కలెక్టర్ కారు పెండింగ్ చలాన్ల మీద రాశారు, వోకే… కానీ అనేకచోట్ల కలెక్టర్లే కాదు, బోలెడుమంది ఉన్నతాధికార్ల వాహనాలూ అంతే కదా… ప్రజాప్రతినిధుల వాహనాలూ అంతే కదా… అవునూ… కేసీయార్ కాన్వాయ్ ఫామ్ హౌజుకు పోతున్నప్పుడు అదే రాజీవ్ రహదారి మీద 80, 100 స్పీడ్ దాటకుండా ప్రయాణించిందా..? దరిద్రం ఏమిటంటే..? ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా స్పీడ్ కంట్రోల్స్… దేనికదే ప్రత్యేక లేన్లు, పెద్దగా ఓవర్ టేక్స్ ఉండవు… మరి దానిపై కూడా 100 స్పీడ్ లిమిట్ ఏమిటో ఆ రూల్ పెట్టినవాళ్లకే తెలియాలి…!!
Ads
Share this Article