2014… టీవీ అనుపమ… ఓ ఐఏఎస్ అధికారిణి… తనది కూడా కేరళే… కన్నూరు సబ్‌కలెక్టర్‌గా చేసి టూరిజం, ఫుడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్‌గా ట్రివేండ్రం బదిలీ అయ్యింది… ఓ వెహికల్‌లోకి సామాను ఎక్కించుకుని ట్రివేండ్రం చేరింది… సమయానికి ఎవరూ లేబర్ దొరకలేదు… ఆమె, కుటుంబసభ్యులు, ఆ వెహికిల్ డ్రైవర్, హౌజ్ ఓనర్ అందరూ కలిసి సామాను అన్‌లోడ్ చేశారు, చివరలో ఓ వాషింగ్ మెషిన్ మిగిలింది… అప్పుడక్కడికి వచ్చిన సీఐటీయూ కూలీలు దాన్నలాగే ఆపేసి, మొత్తం లోడ్‌కు కూలీ కట్టమని అడిగారు ఆమెను, ఆమె షాక్ తిని, నా చేతులతో నేనే అన్‌లోడ్ చేసుకున్నాను, నీకెందుకు కూలీ ఇవ్వాలి అనడిగింది… అదంతే అన్నాడు ఆ ఏరియా లేబర్ యూనియన్ లీడర్ మురళి… దీన్ని నొక్కు కూలీ అంటారట… అంటే ఏమీ లేదు, రౌడీ మామూలు… ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నాడు… అరె, ఓ ఐఏఎస్ అధికారిణికి ఈ అనుభవం ఎదురైందా అని ఆశ్చర్యపడకండి… కొన్ని వేల సంఘటనలు… ఊళ్లల్లో వాళ్లదే రాజ్యం… ఎదురుతిరిగితే నరకం…
ఐఏఎస్‌లే కాదు, ఎవరైనా సరే, ఆ రౌడీ మామూలు కట్టాల్సిందే… బెంగాల్‌లో కూడా ఇలా చేసే కదా, మమతబెనర్జీ పార్టీ ఎదురుతిరిగేసరికి, ప్రజలందరూ ఆమె వెంట నిలబడ్డారు, లెఫ్ట్‌ను కసితీరా ఓడించారు, మొన్న ఎన్నికల్లో తెలుసు కదా, ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు… పల్లెల్లో వాళ్ల అరాచకాలు అలా ఉంటాయి… కేరళలో మమతబెనర్జీ వంటి ముదురు కేరక్టర్ తగల్లేదు, లేకపోతే అక్కడా అదే జరిగేది… సరే, ఈ నొక్కు కూలీ… అంటే నొక్కుడు కూలీ గురించి చెప్పుకుందాం… ఆయా ప్రాంతాల్లో సీఐటీయు యూనియన్ ఎంత చెబితే అంతే కూలీ… లోడింగ్, అన్‌లోడింగ్ వాళ్లే చేసుకున్నా సరే కూలీ కట్టాల్సిందే… లేకపోతే ట్రక్కులు కదలవు… వ్యాపారం నడవదు… ఈ కేసులు, ఫిర్యాదులు ఎక్కువయ్యేసరికి హైకోర్టు మూడేళ్ల క్రితం ఈ కూలీ దందాను అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది… ఐనా ప్రభుత్వం పట్టించుకోలేదు, పట్టించుకుంటే పినరై విజయన్ సర్కారు నిలవదు, ఐనా తను కూడా ఆ మూలాల్లో నుంచి ఎదిగినవాడే కదా… ఐనా ఫిర్యాదులు ఆగకపోవడంతో ఈమధ్యే హైకోర్టు మరోసారి సర్కారుకు చీవాట్లు పెట్టింది కూడా… మూడేళ్ల క్రితం ఓ పారిశ్రామికవేత్త తన ఉత్పత్తులను వేరే రాష్ట్రం వాళ్లకు అమ్మాడు, వాళ్లు సరుకు తీసుకుపోవడానికి వాహనాలతో వచ్చారు, కానీ అక్కడి సీపీఎం కూలీలు మా నొక్కు కూలీ కడితేనే తప్ప వెహికిల్స్ కదలవు అన్నారు… పోలీసులకు చెబితే సెటిల్ చేసుకో, మేమేం చేయలేం అన్నారు, ఆయన అడిగినకాడికి కూలీ చెల్లించి, నేరుగా హైకోర్టులో ఓ ప్రైవేటు కంప్లయింట్ ఫైల్ చేశాడు, ఎలాగూ పోలీసులు కేసు పెట్టరు కదా…
Ads
దానిపైనే హైకోర్టు ప్రభుత్వానికి తలంటింది… అది జరిగిన మూడురోజులకే (మొన్నటి అయిదో తారీఖు) ఇస్రోకు చెందిన ఓ హెవీ లోడ్‌తో ఓ ట్రక్కు ట్రివేండ్రం వచ్చింది… విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ [Vikram Sarabhai Space Centre (VSSC)] ప్రాంగణం బయటే దాన్ని ఆపేశారు లేబర్ యూనియన్ నాయకులు. 10 లక్షలు నొక్కు కూలి [ gawking charge ] ఇస్తేనే కానీ ట్రక్కుని లోపలికి వెళ్ళనివ్వమని ఆందోళనకి దిగారు… ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన VSSC కి చెందిన ట్రక్కుని గూండా టాక్స్ కోసం ఆపడం ఏంటి…? నాలుగు గంటల పాటు వాహనాన్ని కదలనీయలేదు… అది ఇస్రో గానీ, ఏ వెహికిల్ అయినా సరే ఈ నొక్కుడు గ్యాంగుల్ని దాటిపోలేదు… పోలీసులు వచ్చారు, కానీ వాళ్ళకి కూడా తెలుసు… ప్రభుత్వ వాహనాన్ని అడ్డుకోవడం ఒక తప్పు, డ్యూటీలో ఉన్న స్పేస్ సెంటర్ అధికారిని అడ్డుకోవడం మరో తప్పు… కానీ పోలీసులకు సీఐటీయూ వాళ్ల మీద కేసులు పెట్టే ధైర్యం ఎక్కడిది..? చివరకు ఇస్రో అధికారి ఒకాయన కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్తే, అది కార్మిక శాఖ మంత్రికి సంబంధించినది కాబట్టి సదరు శాఖ మంత్రికి ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు… అదేమైనా డిప్లొమాటిక్ బ్యాగుల్లో బంగారం తరలింపు యవ్వారం కాదు కదా, స్పందించడానికి..!! వెహికిల్ కదలకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేయడం తప్ప వేరే మార్గం లేదనీ, కూలీ ఇవ్వలేమనీ ఇస్రో ఖండితంగా చెప్పాక, సంబంధిత మంత్రి, మరికొందరు పార్టీ నేతలు కలిసి, ఎలాగోలా వాళ్లను కన్విన్స్ చేసి, క్లియర్ చేస్తే తప్ప ఇస్రో ట్రక్కు కదల్లేదు… కేరళ అనగానే ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని భ్రమపడకండి… ఇదుగో ఈ గాడ్స్ కూడా ఉంటారు… కాదు, వాళ్లే ఉంటారు…!! మరి మన మీడియా ఇలాంటివి ఎందుకు రాయదు అనే అమాయకపు ప్రశ్న వేయకండి…!!!
Share this Article